● ఏపీ జేఏసీ అమరావతి
జిల్లా చైర్మన్ అల్లంపాటి పెంచలరెడ్డి
నెల్లూరు(అర్బన్): ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల న్యాయమైన 22 డిమాండ్లను తీర్చాల్సిందేనని ఏపీ జేఏసీ అమరావతి జిల్లా చైర్మన్ అల్లంపాటి పెంచలరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం నెల్లూరు కలెక్టరేట్‌లోని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఏపీ జేఏసీ భాగస్వామ్య పక్షాల నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు దాటినా ఉద్యోగుల సమస్యలు పట్టించుకోలేదన్నారు. దీంతో ఎన్నికల హామీలు నెరవేర్చాలంటూ ఉద్యమానికి సంఘం రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారన్నారు. ఈనెల 21న అనంతపురంలో ఉద్యమ సన్నద్ధ సభ ఏర్పాటు చేసి ప్రభుత్వంపై పోరుబాటకు పిలుపునిచ్చినట్లు తెలిపారు. దీంతో సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు మంత్రులు కొలుసు పార్థసారథి, అనగాని సత్యప్రసాద్ ఏపీ జేఏసీ అమరావతి నాయకులతో శనివారం చర్చలు జరిపారన్నారు. పీఆర్సీ కమిషన్‌ను తక్షణమే నియమించాలని, మధ్యంతర భృతి ప్రకటించాలని, డీఏ అరియర్స్ చెల్లించాలని, సీపీఎస్ రద్దు, ఓపీఎస్ విధానం అమలు తదితర 22 డిమాండ్లను ప్రభుత్వం ముందుంచి ఆమోదించాలని డిమాండ్ చేశామన్నారు. రెండు రోజులు నాయకులతో మంత్రులు చర్చించి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారన్నారు. మళ్లీ ఈనెల 21న ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వం తరఫున చర్చించి వీలైనంత వరకు డిమాండ్లు తీర్చుతామని హామీ ఇచ్చారన్నారు. దీంతో అనంతపురంలో జరపాల్సిన ఉద్యమ సన్నాహక సభను వాయిదా వేశామన్నారు. ఒకవేళ సమస్యలు పరిష్కరించకపోతే 21వ తేదీ తర్వాత మళ్లీ ఉద్యమాన్ని మరింత వేగంగా విస్తరించేలా చర్యలు చేపడతామన్నారు. కార్యక్రమంలో ఏపీ జేఏసీ జిల్లా జనరల్ సెక్రటరీ ఓవీ ప్రసాద్, కార్యవర్గ సభ్యుడు చంద్ర, జానా చైతన్య కిశోర్, మాల్యాద్రి, రవికుమార్, సతీష్‌కుమార్, రమే ష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.


