బ్యాంక్‌ ఉద్యోగాల పేరుతో టోకరా | - | Sakshi
Sakshi News home page

బ్యాంక్‌ ఉద్యోగాల పేరుతో టోకరా

Mar 11 2026 7:26 AM | Updated on Mar 11 2026 7:26 AM

శ్రీకాకుళం క్రైమ్‌: బ్యాంక్‌లో పీఓ, క్లర్క్‌ ఉద్యోగాలు తీసిస్తానని నిరుద్యోగ యువతను నమ్మించిన అంతర్‌జిల్లా నేరస్తుడు ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడ్డాడు. శ్రీకాకుళంతోపాటు తిరుపతి, నెల్లూరు, తాడేపల్లిగూడెం, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో అమాయక యువత నుంచి రూ.కోట్లలో దోచుకున్న నెల్లూరు జిల్లాకు చెందిన గొల్ల బెనర్జీని శ్రీకాకుళం రూరల్‌ పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేశారు. ఈ మేరకు కేసు వివరాలను శ్రీకాకుళం డీఎస్పీ సీహెచ్‌ వివేకానంద మీడియాకు వెల్లడించారు.

ఇలా చెప్పి..

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలం వవ్వేరు గ్రామానికి గొల్ల బెనర్జీ అలియాస్‌ హర్షవర్ధన్‌రెడ్డి ఇంటర్‌ చదివి సీఏ కోర్సులో చేరి మధ్యలోనే మానేశాడు. అకౌంట్స్‌పై పరిజ్ఞానం సంపాదించాడు. నెల్లూరులో ఓ మహిళను వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలున్నారు. భార్యను విడిచి పెట్టేశాడు. తర్వాత శ్రీకాకుళం జిల్లా గార మండలం సతివాడకు చెందిన ఓ మహిళను పెళ్లి చేసుకున్నాడు. అనంతరం అరసవల్లిలో దేశెట్టి రమణమూర్తి ఇంట్లో అద్దెకు దిగాడు. రమణమూర్తి స్వగ్రామం నందిగాం మండలం నర్సిపురం. ఢిల్లీ సెంట్రల్‌ జోనల్‌ ఆడిట్‌ అధికారిగా పనిచేసి ఇటీవల విశాఖ రీజియన్‌కు బదిలీపై వచ్చానని, పలు బ్యాంక్‌ల రిక్రూట్‌మెంట్‌ బోర్డులో మెంబర్‌నని బెనర్జీ నమ్మించాడు.

పీఓలు, క్లర్కు

పోస్టులంటూ..

ఎస్బీఐ బ్యాంక్‌లో బ్యాక్‌లాగ్‌ పోస్టుల కింద పీఓ, క్లర్కు పోస్టులు ఖాళీగా ఉన్నాయని.. ఒక్కో ఉద్యోగానికి రూ. 6 లక్షల సెక్యూరిటీ డిపాజిట్‌ కడితే ఉద్యోగం తీసిస్తానని యువతను నమ్మబలికాడు. అలా ఆరుగురి నుంచి రూ.36 లక్షలు తీసుకున్నాడు. వారికి నకిలీ అపాయిట్‌మెంట్‌ ఆర్డర్‌ కాపీలు సైతం ఇచ్చాడు. ఈ మేరకు బాధితులు 2024 నవంబర్‌ 12వ తేదీన జిల్లా ఎస్పీ గ్రీవెన్స్‌ను ఆశ్రయించారు. బెనర్జీ తమ వద్ద రూ.1.80 కోట్లు కాజేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.

స్థలాల పేరుతో..

చిన్నబజారు రోడ్డులో 8 సెంట్ల స్థలం వేలానికి వస్తుందని, తన పరిచయాలతో తక్కువ ధరకు ఇప్పిస్తానని దేశెట్టి రమణమూర్తి వద్ద రూ.86 లక్షలను బెనర్జీ తీసుకున్నాడు. రూ.29 లక్షల విలువైన గోల్డ్‌ క్రాఫ్ట్‌ మెషీన్‌ను రూ.14 లక్షలకే ఇప్పిస్తానని డబ్బులు తీసుకుని మోసం చేశాడు. మొత్తంగా రమణమూర్తి నుంచి రూ.1.05 కోట్లకు టోకరా వేశాడు. జిల్లాలో తన మోసాలు బయటపడటం, పలువురు ఫిర్యాదులివ్వడంతో బెనర్జీ మకాం మార్చేశాడు.

పలు ప్రాంతాల్లో సైతం

తిరుపతి ఈస్ట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి నుంచి రూ.25 లక్షలు, వారి సోదరుడు, సోదరుని కుమార్తె నుంచి కొంత నగదు తీసుకున్నాడు. విశాఖపట్నంలో 8 మంది నుంచి రూ.కోటి తీసుకోగా, నెల్లూరులో 2 చీటింగ్‌ కేసులు, బుచ్చిరెడ్డిపాళెంలో 1, తాడేపల్లి గూడెంలో 1, ఏఎస్‌పేట పీఎస్‌లో ఒక కేసు ఉన్నాయి.

సీఐడీ డీజీకి సైతం ఫిర్యాదు

మూడేళ్లుగా ఎవరికీ చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న బెనర్జీపై అరసవల్లిలో ఉంటున్న నందిగాం వాసి రమణమూర్తి మంగళగిరి సీఐడీ డీజీ కార్యాలయంలో ఫిర్యాదు చేయడంతో అధికారులు లోతుగా విచారణ చేపట్టారు. నివేదికను తదుపరి చర్యల కోసం శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డికి పంపించారు. డీఎస్పీ సీహెచ్‌ వివేకానంద పర్యవేక్షణలో రూరల్‌ పరిధి కావడంతో సీఐ పైడపు నాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తనకొచ్చిన సమాచారంతో సీఐ పైడపునాయుడు బెనర్జీని నగరంలోనే అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ వెల్లడించారు.

ఢిల్లీలో సెంట్రల్‌ జోనల్‌

ఆడిటర్‌నంటూ మోసం

శ్రీకాకుళం, నెల్లూరు, తిరుపతి,

విశాఖ, తాడేపల్లిగూడెంలో దోపిడీ

ఎట్టకేలకు అంతర్‌ జిల్లా నేరస్తుడు

బెనర్జీ అరెస్ట్‌

నిందితుడిది బుచ్చిరెడ్డిపాళెం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement