చిల్లకూరు: మండలంలోని తీర ప్రాంతమైన తూర్పుకనుపూరులో ఉన్న ముత్యాలమ్మ ఆలయంలో జరుగుతున్న జాతర సందర్భంగా అమ్మవారికి గురువారం బంగారు చీరను అలంకరించారు. దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తూర్పుకనుపూరుకు చేరుకున్నారు. పలు రాష్ట్రాలకు చెందిన వారు మొక్కుల తీర్చుకునే క్రమంలో పొంగళ్లు పెట్టి చీర, సారె సమర్పించారు. ఆలయంలో క్యూలైన్లు పూర్తిగా నిండిపోవడంతో అమ్మ వారి దర్శనానికి గంటకు పైగా సమయం పట్టింది. దీంతో కొందరు ఇలా ఎప్పుడూ జరగలేదని వాపోయారు. సాయంత్రానికి భక్తుల సంఖ్య విపరీతంగా పెరగడంతో అధికారులు చర్యలు చేపట్టారు.
వైభవంగా గ్రామోత్సవం
జాతర సందర్భంగా పోలేరమ్మ గుడికి సమీపంలో కొలువుదీరిన యారా గురునాథస్వామికి గ్రామోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇసుక తిన్నెలపై ఉన్న గురునాథస్వామి వద్ద ఉన్న అక్క దేవతలు, గంగపెట్టెకు గొల్లలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గణాచారి ముందు ఉండగా, గంగపెట్టెను ఎత్తుకుని గొల్లలు నడుస్తుండగా గ్రామోత్సవాన్ని అత్యంత వైభవంగా చేశారు. ఈ సందర్భంగా గొల్లలు వేసిన వీరతాళ్లు అందరిని అలరించాయి.
పోలీసుల పెత్తనం
జాతర సందర్భంగా ఆలయంలో భక్తులకు సౌకర్యాలు కల్పించే బాధ్యత మొత్తం దేవదాయ శాఖ చూసుకోవాల్సి ఉంది. అయితే ఈ ఏడాది పెత్తనం మొత్తం పోలీసులు తమ చేతుల్లోకి తీసుకున్నారు. తమకు కావాల్సిన వారిని ఇష్టానుసారంగా పంపి అమ్మవారి దర్శనం చేయించారు. దీంతో క్యూలైన్లలో ఉన్న భక్తులు ఇబ్బంది పడ్డారు. ఆలయ పాలకమండలి కూడా గతంలో ప్రత్యేక పాస్ సౌకర్యం కల్పించేది. అయితే ఈసారి పోలీసులు పాస్‌లు ఇచ్చే ఆనవాయితీని ఆపేశారు. తాము ప్రత్యేక పాస్‌లను నచ్చిన వారికి ఇచ్చారని విమర్శలున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా జాతర సందర్భంగా మాతమ్మల చేత చిందులు వేయించడంతో గుర నాథస్వామి గ్రామోత్సవంలో తోపులాట జరిగింది. అయినా పోలీసులు పట్టించుకున్న దాఖలాల్లేవని మహిళా భక్తులు విమర్శించారు.


