● జాతీయ స్థాయిలో పొదలకూరు దివ్యాంగుడి ప్రతిభ
● తల్లి ప్రోత్సాహంతో విజయ తీరాలకు..
దివ్యాంగుడిగా ఎన్నో బాధలు.. అవమానాలు.. కష్టాలు.. కన్నీళ్లు ఉన్నా తన తల్లి అందించిన ప్రోత్సాహం వల్ల జాతీయ స్థాయి దివ్యాంగుల వాలీబాల్ పోటీల్లో
రాణించారు పొదలకూరుకు చెందిన వ్యక్తి. తండ్రిని కోల్పోయినా.. క్రీడలపై
మక్కువతో ఆత్మ విశ్వాసాన్ని విడవకుండా వృద్ధురాలైన తల్లితో జీవిస్తూ విజయ తీరాలను అందుకునేందుకు ఇంకా శ్రమిస్తూనే ఉన్నాడు. ఉపాధ్యాయుడిగా
ఎంపికై తన తల్లిని బాగా చూసుకోవాలనే పట్టుదలతో ముందుకు వెళ్తున్నాడు.
పొదలకూరు: పొదలకూరు పట్టణంలో నివసిస్తున్న కంభాపు పెంచలయ్య చిన్న వయస్సు లోనే తండ్రి రామయ్యను కోల్పోయారు. అప్పటి నుంచి తల్లి అంకమ్మ పెంపకంలో పెరిగారు. బిడ్డ భవిష్యత్తే లక్ష్యంగా ఆమె తమ కుల వృత్తి అయిన దుస్తులు ఉతికి ఐరన్ చేస్తూ బిడ్డను ఉన్నతంగా చదివించారు. అయితే పెంచలయ్య 80 శాతం వికలత్వంతో జన్మించినా ఏనాడు ఆ తల్లి నిట్టూర్చలేదు. లేకలేక జన్మించిన పెంచలయ్య తమ గారాలపట్టిగా పెంచుకుంది. దీనికితోడు అంకమ్మకు చెవుడు రావడంతో జీవితం మరింత ఇబ్బందిగా మారింది. అయినా ఆత్మ విశ్వాసాన్ని కోల్పోలేదు. కుమారుడిని పొదలకూరులో ఇంటర్, డిగ్రీ వరకు చదివించారు. ఆ తర్వాత ఎంఏ, బీఈడీ నెల్లూరులో అష్టకష్టాలు పడి చదివించారు.
క్రీడలపై ఆసక్తి
చదువుల తర్వాత పెంచలయ్య దివ్యాంగుల క్రీడలపై ఆసక్తి పెంపొందించుకున్నారు. దీంతో తనకు ఇష్టమైన క్రీడలపై నిరంతరం శ్రమించి పట్టు సాధించాడు. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ప్రతిభ చాటుతూ చివరకు జాతీయ స్థాయికి ఎదిగాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ నగరంలో ఇటీవల జరిగిన జాతీయ స్థాయి పారా సిట్టింగ్ వాలీబాల్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ జట్టుకు ఎంపికై ఆడిన పెంచలయ్య అద్భుత ప్రతిభ కనబరిచారు. జట్టు విజయానికి తన వంతు కృషి చేసి రాష్ట్ర జట్టు ప్రథమ స్థానాన్ని సాధించేందుకు ఒకడిగా నిలిచారు. దీంతో జాతీయ స్థాయిలో అభినందనలు అందుకున్న పెంచలయ్య పొదలకూరుకు చేరుకున్నాడు.
అమ్మను బాగా చూసుకోవాలి
క్రీడల్లో ఎన్ని విజయాలు సాధించినా అమ్మను బాగా చూసుకునేందుకు ఇన్ని కష్టాలు పడుతున్నానంటాడు పెంచలయ్య. వైకల్యం శరీరానికే కాని పట్టుదలకు కాదంటున్నాడు. సంకల్పం ఉంటే ఏదైనా సాధించేందుకు వీలు కలుగుతుందని, అవకాశాలు తలుపు తట్టవని.. మనమే అవకాశాలను వెతుక్కుంటూ వెళ్లాలని ఇప్పటి యువతకు మార్గదర్శకంగా చెబుతున్నారు. క్రీడా కోటాలో ఉద్యోగం సాధించి ఎనిమిది పదుల వయస్సులో ఉన్న తన తల్లి అంకమ్మను బాగా చూసుకోవడం తన ముందున్న పెద్ద లక్ష్యంగా చెప్పాడు. పారా సిట్టింగ్ వాలీబాల్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు బోడపాటి శివదత్ తనను ఎంతగానో ప్రోత్సహించారని తెలిపారు. అయితే పెంచలయ్య పట్టణంలోని నరసారెడ్డి కాలనీ సమీపంలో అద్దె ఇంట్లో ఉంటున్నారు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, దాతలు ప్రోత్సహిస్తే క్రీడాకారునిగా మరింత ప్రతిభ చూపేందుకు అవకాశం ఉంటుందంటున్నాడు.


