
ప్రజాస్వామ్యంలో చీకటి పాలన
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్య పాలనకు పాతరేసి చీకటి పాలన సాగిస్తోందని, రాచరిక పాలనతో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తోందని, దేశ చరిత్రలో ఇలాంటి పాలన ఎక్కడా చూడలేదని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ రీజనల్ కో ఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు దుయ్యబట్టారు. నగరంలోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో సోమవారం మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్, సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, నెల్లూరురూరల్ ఇన్‌చార్జి ఆనం విజయ్‌కుమార్‌రెడ్డి, నెల్లూరు విజయ డెయిరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, పార్టీ రీజనల్ మహిళా విభాగం అధ్యక్షురాలు మొయిళ్ల గౌరి, కాకాణి కుమార్తె పూజితతో కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. కారు మూరి మాట్లాడుతూ ఈ నెల 31న మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నెల్లూరు పర్యటన ఖరారైన నేపథ్యంలో పోలీసులు అర్థం లేని ఆంక్షలు పెట్టడం చూస్తే ప్రజాస్వా మ్య దేశంలో ఉన్నామా? లేక నియంతృత్వ పాలన సాగించే దేశంలో ఉన్నామా? అని ప్రశ్నించారు.
కూటమి అధికారంలోకి వచ్చాక..
రాష్ట్రమంతా వైఎస్సార్‌సీపీ శ్రేణులపై అక్రమ కేసు లు, అరెస్ట్‌లతో అరాచకాలకు పాల్పడుతోంది. అందులో భాగంగానే మాజీ మంత్రి, జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై ఒకటి తర్వాత మరొకటి అక్రమ కేసులు పెట్టి దాదాపు రెండు నెలలుగా జైల్లో ఉంచారన్నారు. ఫ్యాక్షన్ కక్షలతో రగిలిపోయే రాయలసీమలోనే జరగని విధంగా రాజకీయంగా చేసిన విమర్శలపై ప్రతివిమర్శలు చేశారని మాజీమంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిని టీడీపీ కిరాయి రౌడీమూకలతో ఇంటి గోడలు మినహా అణువణవు ధ్వంసం చేశారని, ఇంట్లో ఉండి ఉంటే ప్రసన్నను సైతం హతమార్చేవారన్నా రు. జిల్లాలో ఎప్పుడూ జరగని అక్రమ కేసులకు గురైన కాకాణినితో జైల్లో ములాఖత్ కావడానికి, దౌర్జన్య కాండకు దెబ్బతిన్న నల్లపరెడ్డి ప్రసన్న కుటుంబాన్ని పరామర్శించేందుకు ఈ నెల 31న ఉదయం 10 గంటలకు హెలికాప్టర్‌లో నెల్లూరుకు వస్తున్న తమ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాకపై అత్యధిక ఆంక్షలు పెట్టడం దారుణమన్నారు.
ప్రజాభిమాన్ని తట్టుకోలేక కుతంత్రాలు
రెడ్‌బుక్ రాజ్యాంగంతో అక్రమ అరెస్ట్‌లు, దౌర్జన్య కాండలు సాగిస్తూ ప్రభుత్వం చేస్తున్న పాలనను ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. ఎన్నికల ముందు సూపర్ సిక్స్‌తో ప్రజలను అభివృద్ధి చేస్తామని అబద్ధాలతో అధికారంలోకి వచ్చి ప్రజా స్వామ్యాన్ని రాచరికపు పాలనగా మార్చారన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు మంచి పాలన అందించాలే కాని రాచరిక పాలనను ప్రజలు ఒప్పుకోరన్నారు. రైతులను, ప్రజలను అక్రమ కేసులు, అరెస్ట్‌లతో నాయకులను ఇబ్బందులు పెడుతున్నప్పుడు ప్రతిపక్ష నాయకులు వస్తుంటే వారి పర్యటనకు ఆంక్షలు పెట్టడం కూడా భావ్యం కాదన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ఎక్కడకు వచ్చినా ప్రజలు విపరీతంగా రావడాన్ని తట్టుకోలేకనే కూటమి ప్రభుత్వం విపరీతమైన ఆంక్షలను పెడుతుందన్నారు. నెల్లూరులో వైఎస్ జగన్ పర్యటనకు వైఎస్సార్‌సీపీ నాయకులే కాదు.. కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉన్న ప్రజలందరూ వస్తారన్నారు. అరచేతితో సూర్య కాంతిని ఎలా ఆపలేరో.. ఈ ప్రజాభిమానాన్ని కూడా అడ్డుకోలేరని స్పష్టం చేశారు.
మాజీ సీఎం పర్యటనకు ఇన్ని ఆంక్షలా?
జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనకు పెట్టిన ఆంక్షలు అత్యంత దుర్మార్గంగా ఉన్నాయన్నారు. ఈ నెల 3న పర్యటన ఖరారైన సమయంలోనూ ప్రభుత్వం, పోలీసులు కనీసం హెలిప్యాడ్‌కు స్థలం కేటాయించకుండా అడ్డుపడ్డారన్నారు. చివరి నిమిషంలో అత్యంత ప్రమాదకరమైన ప్రదేశంలో హెలిప్యాడ్ ఏర్పాటుకు అనుమతివ్వడంతో పర్యటన రద్దు చేయాల్సి వచ్చిందన్నారు. అయితే ఈ దఫా ఎవరెన్ని ఆంక్షలు పెట్టిన వైఎస్ జగన్ పర్యటన ఖరారు కావడంతో పోలీసులు కఠిన ఆంక్షలు విధించడం చాలా దారుణమన్నారు. ఈ పర్యటనకు సంబంధించి మొదటి ఇచ్చిన నోటీసులో హెలిప్యాడ్ వద్దకు మూడు వాహనాలే అని, ములాఖత్‌కు ముగ్గురు మాత్రమే అని, అసలు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటి వద్దకు ఒక్కరికీ కూడా అనుమతి లేదంటూ ఇచ్చిన నోటీసును తీసుకునేందుకు తాను నిరాకరించానని తెలిపారు. ఆ తర్వాత రెండో నోటీసులో జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనకు మూడు వాహనాలకు బదులు 15 వాహనాలను, హెలిప్యాడ్ వద్దకు, జైలు వద్దకు 10 మందికి అనుమతిస్తామని, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటికి మాత్రం ఒక్కరికీకి అనుమతి లేదంటూ ఇచ్చారన్నారు. తమ నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనకు వస్తే రాప్తాడు, పొదిలి, పల్నాడు తదితర ప్రాంతాల్లో విపరీతమైన జనాలు రావడంతో కూటమి ప్రభుత్వానికి దడ పుడుతుందన్నారు. అందుకు నెల్లూరు పర్యటనలో 25 మందికి వలంటీర్‌ను నియమించాలని, కారు నంబర్లు, డ్రైవర్ల ఆధార్ కార్డులు ఇవ్వాలని నోటీసులు ఇవ్వడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. కూటమి ప్రభుత్వ అక్రమాలను తట్టుకోలేక జగన్‌మోహన్‌రెడ్డిపై ఉన్న అభిమానంతో జనాలు స్వచ్ఛందంగా వస్తున్నారని, వారిని ఆపడం ఎవరి తరం కాదన్నారు. కూటమి ప్రభుత్వం మాదిరిగా బస్సులు, ట్రాక్టర్లతో ప్రజలను తరలించమని, స్వచ్ఛందంగానే ప్రజలు వస్తున్నారని, జగన్‌మోహన్‌రెడ్డిపై వారికున్న అభిమానానికి నిదర్శనమన్నారు.
మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనపై ఆంక్షలేంటి
రాచరిక పాలనతో
రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు
ప్రజాభిమానాన్ని ఆపడం ఎవరి తరం కాదు
ప్రశ్నించడాన్ని జీర్ణించుకోలేక
అక్రమ కేసులు, అరెస్ట్‌లు
అబద్ధపుహామీలతో కూటమి ప్రభుత్వంపై వెల్లువెత్తుతున్న ప్రజాగ్రహం
వైఎస్ జగన్ ఎక్కడికెళ్లినా
పోటెత్తుతున్న ప్రజలు
అది జీర్ణించుకోలేకే ఇలాంటి కుట్రలు, కుతంత్రాలు
పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ కారుమూరి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి
హెలిప్యాడ్ పనుల పరిశీలన
వెంకటాచలం: మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఈ నెల 31న జిల్లా పర్యటనకు రానుండడంతో మండలంలోని చెముడుగుంట వద్దనున్న సెంట్రల్ జైలు సమీపంలో హెలిప్యాడ్ పనులు జరుగుతున్నాయి. ఈ పనులను వైఎస్సార్‌సీపీ రీజన ల్ కోఆర్డినేటర్ కారుమూరి వెంకట నాగేశ్వర రా వు, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆనం విజయకుమార్‌రెడ్డి సోమవారం పరిశీలించారు. వైఎస్ జగన్ హెలికాప్టర్ దిగే హెలిప్యాడ్ వద్దకు భారీగా అభిమానులు తరలివచ్చే అవకాశం ఉండడంతో తీసుకోవాల్సిన చర్యలపై వారు చర్చించారు. ఆ మేరకు హెలిప్యాడ్ పరిసరాలను పరిశీలించి ఏర్పాట్లు చేస్తున్నారు.