
ఆంక్షలతో వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకోలేరు
● వైఎస్సార్‌సీపీ రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు
వెంకటాచలం: మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పర్యటనను ఆంక్షలతో కూటమి ప్రభుత్వం అడ్డుకోలేదని వైఎస్సార్‌సీపీ రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఈ నెల 31న వైఎస్ జగన్ నెల్లూరుకు రానున్న నేపథ్యంలో మండలంలోని చెముడుగుంట వద్దనున్న సెంట్రల్ జైలు సమీపంలో జరుగుతున్న హెలిప్యాడ్ పనులను జిల్లాలోని ముఖ్య నేతలతో కలిసి కారుమూరి మంగళవారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా పర్యటను విజయవంతం కాకుండా చేసేందుకు కూటమి ప్రభుత్వం అడుగడుగునా కుట్రలు చేస్తుందని ఆరోపించారు. ఆంక్షలతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ప్రజలకు ఉన్న అభిమానాన్ని అడ్డుకోలేరన్నారు. ఇదే విధమైన ఆంక్షలు విధించి ఉంటే చంద్రబాబు, లోకేశ్ గత వైఎస్సార్‌సీపీ పాలనలో ప్రజల్లో తిరిగే వారా అని ప్రశ్నించారు. ప్రజలకిచ్చిన హామీలను అమలు చేస్తూ, ప్రజల అభిమానాన్ని పొందాలే గానీ, ప్రతి పక్ష నాయకుల పర్యటనలను అడ్డుకునే కుట్రలు చేయడం మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనలు అడ్డుకుంటున్న అధికారులను కూడా ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తామని చెప్పారు.
పోలీసులు కుట్రలు దారుణం
ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక కూటమి ప్రభుత్వం అనేక అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిందని విమర్శించారు. జైల్లో ఉన్న కాకాణిని ములాఖత్ ద్వారా మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించాలని అనుకుంటే పలు దఫాలు అడ్డంకులు సృష్టించి అడ్డుకున్నారని విమర్శించారు. తాజాగా పర్యటన ఖరారైతే హెలిప్యాడ్, జైలు వద్దకు మూడు కార్లు, పది మంది మాత్రమే ఉండాలని ఆంక్షలు విధించడం ఏమిటని ప్రశ్నించారు. అక్కడి నుంచి మాజీ మంత్రి ప్రసన్నకుమారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించే సమయంలో కూడా ఆంక్షలు విఽధించడం గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. కుట్రపూరితమైన ఆంక్షలు విధించడం, వీటిని అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసులు చెప్పడం సరికాదన్నారు. కూటమి ప్రభుత్వం మోపే అక్రమ కేసులకు ఎవరూ భయపడే ప్రసక్తే లేదని, ఆంక్షలతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ప్రజల్లో ఉన్న అభిమానాన్ని తొలగించలేరని స్పష్టం చేశారు. తాము బస్సులు, ఇతర వాహనాలు పెట్టి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనకు తరలించడం లేదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, పలు నియోజకవర్గాల వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జులు తదితరులు పాల్గొన్నారు.