
ఆశ చూపి.. నగదు దోచేసి..
సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తుల మాటలు నమ్మి చాలామంది తక్కువ వ్యవధిలో అధిక మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చని ఆశపడి ఉన్నదంతా పోగొట్టుకుంటున్నారు. సైబర్ నేరగాళ్ల మాటలు నమ్మి ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో నగదు పెట్టొద్దని పోలీసు అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. కానీ అనేకమంది మోసపోతూనే ఉన్నారు.
కొన్ని ఘటనలు
● నెల్లూరు నగరానికి చెందిన ఓ వ్యక్తికి ఫేస్‌బుక్‌లో లిఖితాశ్రీ అనే మహిళ పరిచయమైంది. ఫారెక్స్ ట్రేడింగ్ కంపెనీలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించింది. దీంతో ఆ వ్యక్తి పలు దఫాలుగా రూ.10.30 లక్షలు పెట్టుబడి పెట్టాడు. కొన్నిరోజులకు లాభాలు రాలేదు. నగదు విత్‌డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా ట్యాక్స్ కింద రూ.లక్ష కడిస్తే మొత్తం డబ్బులు పొందవచ్చని చెప్పడంతో మోసపోయానని గ్రహి ంచిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
● నెల్లూరు నగరానికి చెందిన ఓ మహిళకు ఇన్‌స్ట్రాగామ్‌లో మెసేజ్ ద్వారా లింక్ వచ్చింది. దానిపై క్లిక్ చేయగా తన వాట్సప్ నంబర్‌కు నిషాబసు అనే మహిళ చాటింగ్ ప్రారంభించింది. ఓ ప్రముఖ కంపెనీకి చెందిన దానినని ఆన్‌లైన్ మార్కెటింగ్‌లో సలహాలు ఇచ్చి లాభాలు వచ్చేలా చూస్తామని నమ్మించింది. తొలుత మహిళ వద్ద నుంచి కొంత మొత్తం పెట్టుబడి పెట్టించి రెట్టింపు లాభం వచ్చేలా నమ్మించింది. దీంతో మహిళ పలు దఫాలుగా రూ.2.46 కోట్లు పెట్టుబడి పెట్టింది. నిందితులు ఆమె ఖాతాలో రూ.4.02 కోట్లు ఉన్నట్లు చూపించారు. విత్‌డ్రా చేసేందుకు యత్ని ంచగా రాలేదు. లార్జ్ ట్రాన్సాక్షన్ కోసం మరో కొంత నగదు చెల్లించాలని నిందితులు సూచించారు. దీంతో మోసపోయానిని గ్రహించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు.
● నెల్లూరు నగరానికి చెందిన ఓ వ్యక్తిని ఆన్‌లైనింగ్ ట్రేడింగ్ పేరిట నమ్మించి రూ.1.01 లక్షలు పెట్టుబడి పెట్టించారు. రూ.3.50 లక్షలు లాభం వచ్చిందని సైబర్ నేరగాళ్లు చెప్పారు. ఆ మొత్తం తీసుకోవాలంటే తమ కమీషన్ రూ.60 వేలు పంపాలన్నారు. కమీషన్ ఎందుకు పంపాలని అతను నిలదీయడంతో ఫోన్‌లు స్విచ్ఛాఫ్ చేశారు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
● ట్రేడింగ్ పేరిట మోసాలు
● లాభాలొస్తాయని పెట్టుబడి పెట్టిస్తున్న కేటుగాళ్లు
● ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదులు
● సైబర్ నేరగాళ్లతో తస్మాత్ జాగ్రత్త
నెల్లూరు(క్రైమ్): జిల్లాలో సైబర్ మోసాలు చాప కింద నీరులా వ్యాపిస్తున్నాయి. ఏటా బాధితులు పెరుగుతున్నారు. రూ.కోట్లలో తమ నగదును కోల్పోతున్నారు. అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా.. సోషల్ మీడియా వేదికగా చైతన్యవంతుల్ని చేస్తున్నా.. ఏదో ఒక విధంగా మోసానికి గురవుతూనే ఉన్నారు. ప్రతి సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో బాధితుల ఫిర్యాదులు అధికంగా ఉంటున్నాయి.
ఉచ్చులో చిక్కి..
టెక్నాలజీ ఎంత పెరిగిందో ఆన్‌లైన్ మోసాలు అంతే స్థాయిలో పెరుగుతున్నాయి. సైబర్ నేరగాళ్లు అందివచ్చిన ఏ అవకాశాన్ని వదలడం లేదు. రకరకాలుగా ప్రజలను మోసగించి పెద్ద మొత్తంలో నగదు దోచేస్తున్నారు. ముఖ్యంగా చదువుకున్న వారు, ఉన్నత ఉద్యోగులు, గృహిణులు నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుపోతున్నారు. నగదు పోగొట్టుకున్న విషయం ఎవరికీ చెప్పుకోలేక, పోయిన డబ్బులు వస్తాయో? రావో? తెలియక సతమతవమవుతున్నారు.
ఎలా అంటే..
ట్రేడింగ్‌లో నైపుణ్యం కలిగిన వ్యక్తులమంటూ నేరగాళ్లు వాట్సప్, ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్, టెలిగ్రామ్ లాంటి సోషల్ మీడియా యాప్స్‌లో మెసేజ్‌లు చేస్తున్నారు.
తమ సలహాలు, సూచనలు పాటిస్తే తక్కువ పెట్టుబడులతో ఎక్కువ మొత్తంలో లాభాలు పొందవచ్చని నమ్మిస్తారు. అనధికారిక అప్లికేషన్ లింక్‌లను పంపుతూ వారు రూపొందించిన మోసపూరిత వెబ్‌సైట్లలో పెట్టుబడులు పెట్టేలా ప్రేరేపిస్తున్నారు. ప్రారంభంలో కొంత లభాలు వస్తున్నట్లు చూపుతూ ఎక్కువగా పెట్టుబడులు పెట్టేలా చేస్తున్నారు. లాభాలు వచ్చినట్లు చూపించి తిరిగి నగదు తీసుకునే అవకాశం లేకుండా చేస్తున్నారు. ఇలాంటి ప్రకటనలు సైబర్ మోసమని గ్రహించాలని, అత్యాశకు పోయి ఉన్నది పోగొట్టుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. సైబర్ మోసానికి గురైన వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930, సైబర్‌క్రైమ్.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలి.

ఆశ చూపి.. నగదు దోచేసి..