
అధికారులకు వర్క్‌షాప్
నెల్లూరు రూరల్: అగ్రిస్టాక్, ఏఐ ద్వారా వ్యవసాయ రంగంలో తీసుకొచ్చే మార్పులపై నెల్లూరులోని కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ హాల్లో బుధవారం అధికారులకు వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఒ.ఆనంద్ మాట్లాడుతూ ఆధునిక టెక్నాలజీ ద్వారా వ్యవసాయాన్ని లాభదాయకంగా చేయడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారిణి సత్యవాణి, జిల్లా హార్టికల్చర్ అధికారి సుబ్బారెడ్డి, జిల్లా కో–పరేటివ్ అధికారి గుర్రప్ప, మార్కెటింగ్ ఏడీ అనిత తదితరులు పాల్గొన్నారు.
8 మెగావాట్ల
ట్రాన్స్‌ఫార్మర్ దగ్ధం
● సుమారు రూ.కోటి నష్టం
కావలి(జలదంకి): కావలి రూరల్ మండలం తుమ్మలపెంట 33 కేవీ సబ్‌స్టేషన్‌లో మంగళవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో 8 మెగావాట్ల విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ దగ్ధమైంది. సిబ్బంది అప్రమత్తమై కావలి అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు వచ్చి మంటలను అదుపు చేశారు. దీంతో ఆ ప్రాంతంలో గురువారం సాయంత్రం వరకు విద్యుత్ నిలిచిపోయింది. ఈ ఘటనపై రూరల్ ట్రాన్స్‌కో ఏఈ చేజర్ల శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ ఆక్వా రైతులు ఎక్కువగా మోటార్లు బిగించి ఉన్నారని, దీంతో బ్రేకర్లు పడిపోయి ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోయిందన్నారు. దీని విలువ రూ.కోటి ఉంటుందన్నారు.
జూనియర్ బాస్కెట్‌బాల్ జట్ల ఎంపికలు రేపు
నెల్లూరు(బృందావనం): నెల్లూరులోని వీఆర్ హైస్కూల్ మైదానంలో శుక్రవారం సాయంత్రం 5 గంటలకు జిల్లా బాస్కెట్‌బాల్ బాలబాలికల జూనియర్ జట్ల ఎంపికలు జరుగనున్నాయని ఆ అసోసియేషన్ కార్యదర్శి గాధం వాసు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు వచ్చే నెల 14 నుంచి 17వ తేదీ వరకు పిఠాపురంలోని ఓబీఎస్ హైస్కూల్ క్రీడా ప్రాంగణంలో జరిగే 10వ ఆంధ్రప్రదేశ్ జూనియర్స్ ఇంటర్ డిస్ట్రిక్ట్ చాంపియన్‌షిప్‌లో పాల్గొంటారన్నారు. ఎంపికకు హాజరయ్యే వారు 2007 జనవరి ఒకటో తేదీ తర్వాత జన్మించినవారై ఉండాలన్నారు. అందుకు సంబంధించిన వయసు ధ్రువీకరణపత్రాలతో హాజరుకావాలన్నారు. తమపేర్లను వ్యాయామ విద్య ఉపాధ్యాయులు డి.కృష్ణమోహన్, వి.చైతన్యల వద్ద నమోదు చేసుకోవాలన్నారు. వివరాలకు 94408 79884 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలని తెలియజేశారు.
యువకుడి ఆత్మహత్య
సింగరాయకొండ: అనారోగ్య కారణాలతో ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున సింగరాయకొండ మండలంలోని ఊళ్లపాళెం పంచాయతీ అంబేడ్కర్ కాలనీ సమీపంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. కందుకూరు మండలం ఓగూరు గ్రామానికి చెందిన నాగరాజు తన తల్లితో కలిసి ఊళ్లపాళెంలోని అంబేడ్కర్ నగర్‌లో నివాసం ఉంటున్నాడు. ఏడో తరగతి చదివిన నాగరాజు ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. రెండేళ్లుగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నాడు. తెల్లవారుజామున 5 గంటల సమయంలో బహిర్బూమికి వెళ్లొస్తానని తల్లికి చెప్పి బయటకు వచ్చాడు. ఊరి శివారులో వేపచెట్టుకు తాడుతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఎస్సై బి.మహేంద్ర ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కందుకూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

అధికారులకు వర్క్‌షాప్

అధికారులకు వర్క్‌షాప్