
అంగీకరించింది కొందరే.. అందరూ కాదు
● మభ్యపెడుతున్న ప్రభుత్వం
ఉలవపాడు: కరేడు గ్రామంలో కొంతమంది అధికార పార్టీకి చెందిన రైతుల్ని కలెక్టర్ దగ్గరకు తీసుకెళ్లి మాట్లాడించి, అందరూ భూసేకరణకు అంగీకరించారని ప్రకటించడం బాధాకరమని భూసేకరణ వ్యతిరేక పోరాట కమిటీ నేతలు, రైతులు స్పష్టం చేశారు. భూసేకరణ కొలిక్కి వచ్చిందని బుధవారం ఓ పత్రికలో (సాక్షి కాదు) ప్రచురించిన వార్తపై తహసీల్దార్ కార్యాలయం వద్ద వారు సమావేశం ఏర్పాటు చేశారు. జేఏసీ నాయకులు మిరియం శ్రీనివాసులు, బత్తుల రమణారెడ్డి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి అజయ్‌కుమార్, సీపీఐ ఎంల్ న్యూడెమోక్రసీ నాయకులు ఆర్.మోహన్ మాట్లాడారు. కలెక్టర్ ఆనంద్, ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పత్రికలకు అబద్ధాలు చెప్పడం దారుణమన్నారు. రైతులకు ఎకరాకు రూ.20 లక్షలు ఇచ్చేందుకు ఇండోసోల్ కంపెనీ అంగీకరించిందని, 100 ఎకరాలను ఇచ్చేందుకు కొందరు అంగీకారపత్రాలపై సంతకాలు చేశారని మైండ్‌గేమ్ ఆడటం సిగ్గు చేటన్నారు. వారంతా అధికార పార్టీకి చెందిన వ్యక్తులని, ఉద్యమంలో ఉన్న రైతులు కాదని తెలిపారు. గతంలో టెంకాయచెట్లపాళెంలో మీ భూముల జోలికిరామని ఎమ్మెల్యే తెలియజేశారని, ఇప్పుడు మత్స్యకారులను ఆఫీసుకు రమ్మని నోటీసులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. రైతులెవరూ భూసేకరణకు ఒప్పుకోవడం లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నేతలు జీవీబీ కుమార్, నాయకులు నాంచార్లు, రైతులు మాలకొండారెడ్డి, అజిత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.