
ఖాకీల ఓవరాక్షన్.. ప్రజల అవస్థ
నెల్లూరు(బృందావనం): వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి నెల్లూరు పర్యటన సందర్భంగా పోలీసులు అనుసరించిన తీరుతో ప్రజలు నానా అవస్థలు పడ్డారు. జాతీయ రహదారిపై బారికేడ్లను ఏర్పాటు చేయడంతో కావలి వైపు వెళ్లే మార్గంలో భారీ వాహనాల వారి అగచాట్లు వర్ణనాతీతమయ్యాయి. ఉదయం ఎనిమిది నుంచే విడతల వారీగా ట్రాఫిక్‌ను నియంత్రించారు. జిల్లా కేంద్ర కారాగారం వద్ద కాకాణి గోవర్ధన్‌రెడ్డితో ములాఖతయ్యాక సుజాతమ్మ కాలనీలోని నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిని పరామర్శించేందుకు వస్తున్నప్పుడూ ఉదయం 11 నుంచి 12 గంటల వరకు జాతీయ రహదారిపై ఇదే పోకడను అవలంబించారు. ఫలితంగా ముండుటెండలో వాహనచోదకులు మగ్గాల్సి వచ్చింది.
స్వామి భక్తిని చాటుకొని..
మాజీ ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్మన్లు, ఎమ్మెల్సీలను సైతం పోలీసులు అడ్డుకొని తమ స్వామిభక్తిని చాటుకున్నారు. మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, గూడూరు మున్సిపాల్టీ మాజీ చైర్‌పర్సన్ కోడూరు కల్పలత, మీరారెడ్డి దంపతులు, ఎమ్మెల్సీ మేరిగ మురళి, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె పూజిత, ఆదాల ప్రభాకర్‌రెడ్డి, కొండ్రెడ్డి రంగారెడ్డి ఇలా ప్రతి ఒక్కరి వాహనాలను నిలిపేశారు. అనుమతి పత్రాలను పరిశీలించి, ప్రతి ఒక్కరి పేరును చూసి.. సహాయకులెవర్నీ అనుమతించేది లేదంటూ నిర్దాక్షిణ్యంగా దించేశారు. డీఎస్పీ గిరిధర్, సీఐలు షముల్లా, సుధాకర్‌రెడ్డి తదితరులు తామేమీ చేయలేమంటూ చేతులెత్తేశారు. దీంతో అనుమతులున్న వారే జిల్లా కేంద్ర కారాగారం వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
విద్యార్థులనూ వేధించి..
జిల్లా కేంద్ర కారాగారానికి వెళ్లే మార్గంలోనే ఉన్న నారాయణ జూనియర్ కళాశాల వద్దకు విద్యార్థినులు, వారు పయనించే ఆటోలను అనుమతించలేదు. దీంతో జాతీయ రహదారి నుంచి కాలేజీకి విద్యార్థులు నడుచుకొని వెళ్లాల్సి వచ్చింది.