
మైనింగ్ ఆపాలంటూ రాస్తారోకో
వరికుంటపాడు: వరికుంటపాడు పంచాయతీ పరిధిలోని జంగంరెడ్డిపల్లి పల్లతిప్పలో మైనింగ్ కార్యకలాపాలు వెంటనే నిలిపి వేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం స్థానికులు మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి రోడ్డుపై బైఠాయించారు. దీంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. వారు మాట్లాడుతూ ప్రజాభిప్రాయ సేకరణలో అందరూ ముక్తకంఠంతో మైనింగ్ రద్దు చేయాలని కోరామన్నారు. అయినా లీజు హక్కుదారులు తమ కార్యకలాపాలు ఆపలేదని, దీంతో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌ను కలిసి తమ గోడు వినిపించామన్నారు. వారి నుంచి స్పందన రాకపోవడంతో జేఏసీ ఏర్పాటు చేసి ఆందోళనకు దిగినట్లుగా చెప్పారు. మైనింగ్ చేస్తే నాలుగు గ్రామాల ప్రజల జీవనాధారం కోల్పోవడమే కాకుండా జంగంరెడ్డిపల్లిని వేరే ప్రాంతానికి తరలించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మైనింగ్‌ను రద్దు చేయకపోతే న్యాయస్థానాల్లో న్యాయపోరాటానికి సిద్దమవుతామని తెలిపారు. ట్రాఫిక్ సమస్య ఏర్పడటంతో ఎస్సై రఘునాథ్ తన సిబ్బందితో వెళ్లి ఆందోళనకారులతో మాట్లాడి రాస్తారోకోను విరమింపజేశారు.