
ధైర్యంగా ఉండండి.. అండగా ఉంటాం
● గిరిజన మహిళలకు బుర్రా భరోసా
ఉలవపాడు: ‘మీరు ధైర్యంగా ఉండండి.. అండగా ఉంటా. ఏ కష్టం వచ్చినా తోడుగా ఉంటా’ అని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ కందుకూరు ఇన్‌చార్జి బుర్రా మధుసూదన్ యాదవ్ గిరిజన మహిళలకు భరోసా ఇచ్చారు. రామకృష్ణాపురం గిరిజన మహిళలు బెయిల్‌పై విడుదల కావడంతో వారిని శుక్రవారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజకీయ కక్షలో భాగంగా కేసులు నమోదయ్యాయి కాబట్టి, బాధపడాల్సిన అవసరం లేదన్నారు. ఇండోసోల్ కంపెనీకి భూములు ఇవ్వలేదని ప్రభుత్వం పెట్టిన కేసని అర్థమైందన్నారు. మహిళల్ని అర్ధరాత్రి అరెస్ట్ చేయకూడదన్నారు. కానీ పోలీసులు భయభ్రాంతులకు గురిచేయడానికి ఇలా చేశారన్నారు. నెల్లూరుకు వచ్చిన మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి కేసు గురించి తెలియజేశానన్నారు. జగనన్న రైతులకు అండగా ఉండాలని తెలియజేశారన్నారు. న్యాయవాదులతో మాట్లాడతానన్నారు. గిరిజన మహిళలు శిరీష, లలితమ్మ, సునీతలు తమను పోలీసులు అర్ధరాత్రి తీసుకుని వెళ్లి చాలా ఇబ్బంది పెట్టారని తెలిపారు. ఎంత భయపెట్టినా తాము మాత్రం భూమలు ఇచ్చేది లేదన్నారు. కరేడు గ్రామ రైతులందరూ వచ్చి ధర్నా చేయడం వల్ల సెక్షన్ తగ్గించారని, అందువల్లే బెయిల్ వచ్చిందని వారు బుర్రాకు తెలిపారు. మాజీ సీఎం జగన్‌ను కరేడుకు తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు కేశవరపు జాలిరెడ్డి, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు నన్నం పోతురాజు, కరేడు గ్రామ కన్వీనర్ సీతారామిరెడ్డి పాల్గొన్నారు.