
పామాయిల్ ఫ్యాక్టరీ కార్మికులకు స్వల్ప గాయాలు
ముత్తుకూరు(పొదలకూరు): మండలంలోని పంటపాళెంలో ఉన్న బుంగి పామాయిల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులు కెమికల్ నీరు కలిసిన ప్రాంతంలో నడవడంతో గాయపడ్డారు. సేకరించిన సమాచారం మేరకు వివరాలు.. శుక్రవారం ఫ్యాక్టరీని శుభ్రం చేసేందుకు నీటిలో కెమికల్ కలిపినట్టుగా తెలుస్తోంది. నలుగురు కార్మికులు ఆ నీటిపై నడవడంతో వారి కాళ్లకు బొబ్బలు రేగి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే యాజమాన్యం ముత్తుకూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వారికి చికిత్స చేయించింది. నలుగురికి ప్రమాదమేమీ లేదని, కోలుకుంటున్నట్టు తెలిసింది.
కసుమూరు దర్గాలో భక్తుల నిలువు దోపిడీ
● హుండీలో కానుకలు వేయకుండా
అడ్డుకున్న ముజావర్లు
వెంకటాచలం: దక్షిణ భారతదేశంలో ఎంతో ప్రసిద్ధి చెందిన మండలంలోని కసుమూరు మస్తాన్‌వలీ దర్గాలో కొందరు ముజావర్ల కారణంగా భక్తులు నిలువు దోపిడీకి గురయ్యారు. శుక్రవారం కావడంతో ఉదయం నుంచి దర్గాకు భక్తులు పోటెత్తారు. వారు తమకు తోచిన కానుకలు (నగదు) హుండీల్లో వెళ్తుండగా కొందరు ముజావర్లు తమ చేతికివ్వాలని డిమాండ్ చేశారు. పలువురు భక్తులు చేసేదేమీలేక కానుకలు సమ ర్పించి వెళ్లారు. కొందరు మాత్రం ఎదురు తిరిగి మీకెందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. హుండీల్లో కానుకలు వేసేందుకు ఒప్పుకోమని చేతికి ఇవ్వాల్సిందేనని ముజావర్లు పట్టుబట్టారు. వారి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. భక్తితో దర్గాకు వస్తే బలవంతపు వసూళ్లకు పాల్పడతారా అంటూ భక్తులు మండిపడ్డారు. అధికారులు జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై దర్గా కేర్ టేకర్ అస్లాం మాట్లాడుతూ వివాదం గురించి తెలిసిన వెంటనే ముజావర్లు వసూళ్లకు పాల్పడకుండా చేశామని తెలిపారు. మరోసారి ఇలా జరిగితే వక్ఫ్ బోర్డు దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామన్నారు.
అథ్లెటిక్స్ ఎంపికలు రేపు
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏసీ సుబ్బారెడ్డి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఈనెల 3వ తేదీన సౌత్‌జోన్ మీట్ కమ్ సెలక్షన్స్ జరగనున్నాయని ఆ అసోసియేషన్ అధ్యక్షుడు కె.వెంకటేశ్వర్లు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఎంపికలు 14, 16, 18, 20 సంవత్సరాల్లోపు బాలబాలికలకు ఉదయం 9 గంటలకు జరుగుతాయన్నారు. హాజరయ్యే వారు ధ్రువీకరణపత్రాలతో హాజరుకావాలన్నారు. ఆర్గనైజర్ విజయకుమార్‌ను 94418 75190కు ఫోన్ చేసి పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ఎంపికై న క్రీడాకారులు బాపట్లలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు.