
చెడు వ్యసనాలకు యువత బానిస
● మత్తులో నెల్లూరులో హత్యలు
మితిమీరుతున్నాయి
● రాజ్యసభ సభ్యుడు ఏఏ రహీం
నెల్లూరు (వీఆర్సీసెంటర్): దేశంలో యువత చెడు వ్యసనాలకు బానిసై భవిష్యత్‌ను, జీవితాన్ని కోల్పోతున్నారని కేరళకు చెందిన రాజ్యసభ సభ్యుడు, డీవైఎఫ్‌ఐ ఆల్ ఇండియా అధ్యక్షుడు ఏఏ రహీం ఆందోళన వ్యక్తం చేశారు. ‘డ్రగ్స్ వద్దు–ఆరోగ్యం ముద్దు’, ‘డ్రగ్స్ అంతం డీవైఎఫ్‌ఐ పంతం’ నినాదాలతో శనివారం డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో యువత అయ్యప్పగుడి సెంటర్ నుంచి వేదాయపాళెం సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. రాజ్యసభ సభ్యుడు రహీం మాట్లాడుతూ అంధ్రప్రదేశ్‌లో చెడు వ్యసనాలకు, డ్రగ్స్, గంజాయి సేవిస్తున్న యువత ఎక్కువవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరులో యువత మత్తులో ఉంటూ ఏమి చేస్తున్నారో కూడా అర్థంకాక అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, ఈ క్రమంలో హత్యలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు నాయకులు యువతను ప్రధాన శక్తిగా వాడుకుంటూ యువశక్తిని నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. విచ్చలవిడిగా జరిగే మద్యం అమ్మకాలను అరికట్టాలని, గంజాయి, డ్రగ్స్‌ను నివారించేందుకు అధికార యంత్రాగం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ నెల్లూరు రూరల్ అధ్యక్ష, కార్యదర్శులు చైతన్య, శశి, సీపీఎం సీనియర్ నాయకులు మాదాల వెంకటేశ్వర్లు, మోహన్‌రావు, కట్టా సతీష్ పాల్గొన్నారు.
న్యాయ విజ్ఞాన సదస్సు
నెల్లూరు (లీగల్): జిల్లా కోర్టు ఆవరణలో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి కే వాణి ఆధ్వర్యంలో శనివారం న్యాయవిజ్ఞాన సదస్సు జరిగింది. జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీ శ్రీనివాస్ న్యాయ సేవాధికార సంస్థ ప్రయోజనాలను, లక్ష్యాలను వివరించారు. వరంగల్ ఇంజినీరింగ్ కాలేజీలో రెండో సంవత్సరం చదువుతున్న గండిపోయిన దివ్య తన ఆర్థిక ఇబ్బందులను తెలియజేస్తూ జిల్లా న్యాయసేవాధికార సంస్థకు అర్జీ పెట్టుకుంది. తన విద్యకు ల్యాప్‌టాప్ అవసరమని, తనకు కొనుగోలు చేసే ఆర్థిక స్థోమత లేదని పేర్కొంది. ఈ విషయం జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ దృష్టికి వచ్చింది. ఆయన మానవతా దృక్పథంతో కావలి విశిష్ట కాలేజీ కరస్పాండెంట్ సుధాకర్ ద్వారా ల్యాప్‌టాప్ కొనుగోలు చేయించి, న్యాయ విజ్ఞాన సదస్సులో ఆ విద్యార్థినికి బహూకరించారు. కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు, ఏపీ బార్ కౌన్సిల్ సభ్యుడు వేనాటి చంద్రశేఖర్ రెడ్డి, నెల్లూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయ్యప్ప రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

చెడు వ్యసనాలకు యువత బానిస