
డీఎంహెచ్‌ఓ పేరిట మెసేజ్‌లు
సీహెచ్‌ఓలపై తీవ్ర ఒత్తిడి
వైద్యులు
పేదరికం నిర్మూలన పేరుతో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పీ4 (పబ్లిక్, ప్రైవేట్, పీపుల్, పార్ట్నర్‌షిప్) ఉద్యోగుల పాలిట శాపంగా పరిణమించింది. సమాజంలోని ధనవంతులు నిరుపేద కుటుంబాలను దత్తత తీసుకుని వారిని ఆర్థికంగా పరిపుష్టి చేసి బంగారు కుటుంబాలుగా మార్చాలన్నదే ఈ పీ4 ముఖ్య ఉద్దేశం. ఈ పథకాన్ని ముందుగా ప్రజాప్రతినిధులు, జిల్లా స్థాయి అఽధికారులు పేద కుటుంబాలను దత్తత తీసుకోవాల్సి ఉంది. అయితే ఈ పథకానికి జిల్లాలో ప్రజాప్రతినిధులు, అధికార వర్గాల నుంచి స్పందన కరువైంది. ఈ క్రమంలో ప్రతి శాఖ అధికారికి టార్గెట్లు ఇచ్చి ప్రతి ఉద్యోగి రెండు కుటుంబాలను దత్తత తీసుకోవాలంటూ ఒత్తిడి పెంచుతున్నారు.
ఉద్యోగం కావాలంటే పీ4 చేయండి...
● పీ4 పథకాన్ని అమలు చేయాలని తీవ్ర ఒత్తిడి
● ఒక్కొక్కరూ రెండేసి కుటుంబాలను దత్తత తీసుకోవాలని ఆదేశాలు
● డీఎంహెచ్‌ఓ పేరిట గ్రూపుల్లో మెసేజ్‌లు
● లేదంటే ఉద్యోగాలు కష్టమంటూ
హెచ్చరికలు
నెల్లూరు (అర్బన్): అధికారంలోకి రావడానికి కూటమి అధినేత చంద్రబాబు అలవికాని అమలు ఇచ్చారు. నిరుపేదలను ఆర్థికంగా సంపన్నులను చేస్తానంటూ ‘పూర్ టు రిచ్’ పథకాన్ని ఆర్భాటంగా ప్రారంభించారు. ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన ఈ ప్రణాళికను ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగుల డబ్బులతో అమలు చేసే ఎత్తుగడ వేశారు. పబ్లిక్, ప్రైవేట్, పీపుల్, పార్ట్నర్‌షిప్ విధానంలో దాతల సొమ్ముతో ప్రభుత్వ ప్రచారానికి తెర తీశారు. వాస్తవానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్, జేసీ, డీఆర్వో, డీఎంహెచ్‌ఓ, ఇతర జిల్లా స్థాయి అఽధికారులు పేద కుటుంబాలను దత్తత తీసుకోవాల్సి ఉంది. అయితే వీరు ముఖం చాటేయడంతో నెల జీతంపై ఆధారపడి బతికే చిరు ఉద్యోగుల నుంచి జిల్లా అధికారుల వరకు ప్రతి ఒక్కరికి టార్గెట్ విధించి మెడపై కత్తి పెట్టారు. భారమంతా ఉద్యోగులపైనే వేస్తున్నారు. వైద్యశాఖలో కాంట్రాక్ట్ పద్ధతిలో సీహెచ్‌ఓలుగా (కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ లేదా ఎంహెల్‌హెచ్‌పీలు) పనిచేస్తున్న చిన్న ఉద్యోగులను ఆన్‌లైన్‌లో ముందుగా పీ4 రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని వైద్యశాఖ అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. దీంతో ప్రభుత్వ తీరును సీహెచ్‌ఓలు తీవ్రంగా నిరసిస్తున్నారు. డీఎంహెచ్‌ఓ శుక్రవారం నిర్వహించిన కార్పొరేట్ ఆస్పత్రుల యాజమాన్యాలతో నిర్వహించిన సమావేశంలో మాత్రం పీ4 అనేది స్వచ్ఛందంగా జరగాలని పేర్కొన్నారు. కలెక్టర్ ఆదేశాలంటూ కూడా తెలిపారు. అయితే ఆచరణలో పెద్దలెవరూ పీ4కి ముందుకు రాలేదు. దీంతో వైద్యశాఖలోని చిన్న ఉద్యోగులపై బలవంతపు పీ4 రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు.
రూ.కోట్లకు పడగలెత్తిన నేతలు ఉండగా..
కూటమి పార్టీల్లో రూ.కోట్లకు పడగలెత్తిన నేతలు ఉన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఏడాది కాలంపైగా ఊరూరా ఆ పార్టీల నేతలు ఇసుక, మట్టి, గ్రావెల్, మద్యం, పేకాట, కోళ్ల పందేలు, అక్రమ వ్యాపారాలతో రూ.కోట్ల సంపాదించారు. వీరందరిని వదిలేసి తమ వంటి చిరు ఉద్యోగులపై భారం పెట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
జిల్లాలో ఆయుష్మాన్ భారత్ కింద విలేజ్ హెల్త్ క్లినిక్‌ల్లో 496 సీహెచ్‌ఓ పోస్టులున్నాయి. వీటిలో 20 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాంట్రాక్ట్ పద్ధతిలో 476 మంది పని చేస్తున్నారు. వీరి జీతం కేవలం రూ.25 వేలు మాత్రమే. ఈ జీతంలోనే విలేజ్ హెల్త్ క్లినిక్‌కు ఉన్న ప్రాంతం నుంచి చార్జీలు భరించాలి. వైద్యశాఖ నుంచి మందులు, ఇతరత్రా సామగ్రి తరలించేందుకు జేబులో నుంచే రవాణా ఖర్చు భరించాలి. బీఎస్సీ నర్సింగ్ వంటి ఉన్నత కోర్సులు చదివి ఎన్నో ఆశలతో వైద్యశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా చేరిన వీరికి చివరకు నెలంతా కష్టపడితే ఖర్చులు పోను రూ.20 వేలు వరకు మాత్రమే మిగులుతోంది. అలాంటి చిన్న ఉద్యోగులను పీ4 కింద రిజిస్ట్రేషన్ చేయించుకుని బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవాలంటూ రెండు రోజుల నుంచి మెడికల్ ఆఫీసర్లు తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నారు.
డీఎంహెచ్‌ఓ పేరిట జిల్లాలోని మెడికల్ ఆఫీసర్లు వైద్యశాఖ గ్రూపులో సీహెచ్‌ఓలకు టెక్ట్స్ మెసేజ్‌లు, వాయిస్ మెసేజ్‌లు వాట్సాప్ గ్రూపులో పంపారు. శనివారం సాయంత్రం లోపు ఒక్కో సీహెచ్‌ఓ రెండు కుటుంబాలను దత్తత తీసుకుంటూ ఆన్‌లైన్‌లో పీ4 రిజిస్ట్రేషన్ తీసుకోవాలని సూచించారు. ఇది డీఎంహెచ్‌ఓ ఆదేశాలంటూ పేర్కొన్నారు. ఇలా రిజిస్ట్రేషన్ చేయించుకోని వారందరూ ఇబ్బంది పడుతారంటూ ఓరల్‌గా హెచ్చరిస్తున్నారు. దీంతో అధికారులను, ప్రభుత్వ తీరును తిట్టుకుంటూ ఇప్పటికే పలువురు తమ పేర్లను పీ4 కింద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. పెద్దలను వదిలేసి తమను బలి చేయడమేంటని సీహెచ్‌ఓలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

డీఎంహెచ్‌ఓ పేరిట మెసేజ్‌లు