
వ్యవసాయం చేసే రైతులకే అన్నదాత సుఖీభవ
కోవూరు: అన్నదాత సుఖీభవ పథకం ద్వారా వ్యవసాయం చేసే రైతులకు మాత్రమే సాయం అందిస్తున్నట్లు, జిల్లాలో 1,95,866 మందికి రూ.131.6 కోట్ల నగదును లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసినట్లు కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. శనివారం కోవూరులోని పీవీఆర్ కన్వెన్షన్ హాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాత సుఖీభవ– పీఎం కిసాన్ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ ఏదైనా కారణంగా లబ్ధి పొందని రైతులు ఆగస్టు 3 నుంచి నిర్వహించనున్న గ్రీవెన్స్ మాడ్యూల్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసుకుంటే లబ్ధి పొందవచ్చు అన్నారు. రెండు కారణాలతో లబ్ధి చేకూరని పరిస్థితి ఉందన్నారు. ఒకటి బ్యాంకు ఆధార్ లింకు లేకపోవడం, సరైన వివరాలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయకపోవడమే కారణమన్నారు. సాగు ధ్రువీకరణ పత్రాలు (సీసీఆర్ కార్డులు) కలిగిన వారికి రబీ సీజన్లో తొలి విడతగా రూ.10 వేలు, ఖరీఫ్ సీజన్‌లో రూ.10 వేల చెల్లిస్తామని తెలిపారు. జిల్లాలో యాక్టివ్‌గా లేని అకౌంట్ ఉన్న వాళ్లు 4000 మంది, ఆధార్ లింకేజీ కాని వాళ్లు 2 వేల మంది ఉన్నారని, వీరంతా వ్యవసాయశాఖాధికారులను సంప్రదించాలని సూచించారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ రైతులందరికీ అవసరమైన మేర ఎరువులు, విత్తనాలు మొదలైనవి అందజేస్తామన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి సత్యవాణి మాట్లాడుతూ మూడు నెలలుగా వ్యవసాయ అనుబంధ శాఖలు లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేశామన్నారు. 27 వేల మంది చనిపోయిన రైతులు, రాంగ్ సీడింగ్ చేసిన రైతులు 18 వేల మంది ఉన్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మ పీడీ ఐ.మురళి, వ్యవసాయశాఖ ఏడీఏ అనిత, తహసీల్దార్ సీహెచ్ సుబ్బయ్య, ఎంపీడీఓ శ్రీహరిరెడ్డి, ఏఓ రజని, ఎంపీపీ పార్వతి, సర్పంచ్ వై.విజయ, అమరావతి, బుచ్చి మున్సిపల్ చైర్మన్ సుప్రజ, వివిధ రైతు సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో 1,95,866 మందికే లబ్ధి
కలెక్టర్ ఓ ఆనంద్