
సిట్ అధికారుల రెండు రోజుల కస్టడీకి కాకాణి
నెల్లూరు (లీగల్): మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిని గుంటూరు సీఐడీ పోలీస్ అధికారులు విచారణ నిమిత్తం 3, 4 తేదీల్లో రెండు రోజుల కస్టడీకి ఇస్తూ నెల్లూరు 2వ అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి శారదరెడ్డి శనివారం ఉత్తర్వులిచ్చారు. ప్రభుత్వ భూముల రికార్డులను తారుమారు చేశారని వెంకటాచలం పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసులో కాకాణిని కస్టడీకి ఇవ్వాలని కోరుతూ గుంటూరు సీఐడీ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై పోలీసులు తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రొసిక్యూటర్ వి.లక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ ఈ కేసులో కాకాణి పాత్ర ఉందని, విచారించడానికి ఏడు రోజులు కస్టడీ అవసరం ఉందన్నారు, కాకాణి తరపు సీనియర్ న్యాయవాదులు రామిరెడ్డి రోజారెడ్డి, పి.ఉమామహేశ్వర్‌రెడ్డి, ఎంవీ విజయకుమారి, సిద్ధన సుబ్బారెడ్డి వాదనలు వినిపిస్తూ ఈ కేసులో ప్రాథమిక ఆధారాల్లేవని, కేవలం రాజకీయ కక్షతో కాకాణిని 14వ నిందితుడిగా పోలీసులు చేర్చారని, పోలీస్ కస్టడీ ఇవ్వాల్సిన అవసరం లేదని వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి శారదరెడ్డి రెండు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాకాణిని ఈ నెల 3వ తేదీ ఉదయం 8 గంటలకు విచారణ నిమిత్తం నెల్లూరు కేంద్ర కారాగారం నుంచి గుంటూరు సీఐడీ పోలీసులు కస్టడీకి తీసుకోవాలని, 4వ తేదీ విచారణ అనంతరం సాయంత్రం 5 గంటలకు వైద్య పరీక్షలు చేయించి మెడికల్ సర్టిఫికెట్‌తో కోర్టులో హాజరుపరచాలని, విచారణ సమయంలో థర్డ్ డిగ్రీ ఉపయోగించవద్దన్నారు. న్యాయవాది సమక్షంలో గోవర్ధన్‌రెడ్డిని సీఐడీ పోలీసులు విచారణ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.