
లారీని తప్పించబోయి..
● రోడ్డు ప్రమాదంలో
ట్రావెల్స్ బస్సు డ్రైవర్ మృతి
కావలి(జలదంకి): రోడ్డు ప్రమాదంలో ఓ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ మృతిచెందాడు. కావలి రూరల్ పోలీసుల కథనం మేరకు.. విజయవాడకు చెందిన కోదాటి రాజు (47) ట్రావెల్స్ బస్సు డ్రైవరుగా పని చేస్తున్నాడు. అతడికి భార్య సంధ్య, ముగ్గురు పిల్లలున్నారు. బుధవారం సాయంత్రం 4:45 గంటలకు రాజు ఏలూరు నుంచి బెంగళూరుకు బయలుదేరిన బస్సుకు డ్రైవర్‌గా ఉన్నాడు. రాత్రి 11:50 గంటల సమయంలో కావలి మండలం అడవిరాజుపాళెం దాటిన తర్వాత పెట్రోల్ బంకు సమీపంలో జాతీయ రహదారిపై లారీ వెళ్తోంది. దాని డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. దీంతో రాజు లారీని తప్పించేందుకు స్టీరింగ్‌ను ఎడమవైపునకు తిప్పాడు. ఆ సమయంలో మరో లారీ వెళ్తుండగా దానిని బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాజు స్టీరింగ్, సీటు మధ్యలో ఇరుక్కుని మృతిచెందాడు. ఈ ప్రమాదంలో ప్రయాణులకు స్వల్ప గాయాలయ్యాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని కావలి రూరల్ సీఐ రాజేశ్వరరావు గురువారం తెలిపారు.