
మమ్మల్ని అడిగేదెవరు!
స్థలాన్ని ఆక్రమించి వేసిన లేఅవుట్
నెల్లూరు(వీఆర్సీసెంటర్): కూటమి నేతలు యథేచ్ఛగా రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూములను ఆక్రమిస్తున్నారు. మమ్మల్ని అడిగేదెవరంటూ దర్జాగా లేఅవుట్లు వేసి అమ్ముకుంటున్నారు. నెల్లూరు నగరంలోని 53వ డివిజన్ గాంధీ గిరిజన కాలనీలో భూకబ్జా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇరిగేషన్, ప్రభుత్వ స్థలాన్ని దర్జాగా ఆక్రమించి లేఅవుట్ వేశారు. అధికార పార్టీకి చెందిన వారు కావడంతో యంత్రాంగం అటువైపు కన్నెత్తి చూడటం లేదని విమర్శలున్నాయి.
ఎక్కడంటే..
గాంధీ గిరిజన కాలనీలో రైల్వే ట్రాక్ పక్కన ఇరిగేషన్ స్థలం, దాని పక్కన ప్రభుత్వ స్థలాలున్నాయి. ఆ ప్రాంతంలో మురుగునీరు ప్రవహించేందుకు భూగర్భ డ్రెయినేజీని ఏర్పాటు చేశారు. అయితే కొందరు అక్రమార్కుల దృష్టి ఆ స్థలాలపై పడింది. కాలువను సైతం పూడ్చేసి దానితోపాటు పక్కనే ఉన్న ప్రభుత్వ, ఇరిగేషన్ శాఖలకు చెందిన రూ.కోట్ల విలువైన ఐదెకరాల భూమిని ఆక్రమించారు. సదరు స్థలం చుట్టూ ప్రహరీ నిర్మించారు. భూమిని చదునుచేసి అక్రమంగా లేఅవుట్ వేశారు. 80 ప్లాట్లను విక్రయిస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత శాఖల అధికారులు, పాలకులు పట్టించుకోవడం లేదు.
యథేచ్ఛగా ఇరిగేషన్,
ప్రభుత్వ స్థలం ఆక్రమణ
రూ.కోట్ల విలువైన ఐదెకరాల భూమిలో లేఅవుట్
పొర్లుకట్టను కొల్లగొట్టి
లేఅవుట్‌లో రోడ్లు
పట్టించుకోని అధికారులు
పొర్లుకట్టను తవ్వేసి..
పెన్నానది వరద ప్రవాహాన్ని అడ్డుకునేందుకు గతంలో ఏర్పాటు చేసిన పొర్లుకట్టను సైతం అక్రమార్కులు తవ్వేసి గ్రావెల్‌ను లేఅవుట్‌లో రోడ్లు వేసేందుకు వినియోగించారు. ఇప్పటికే కొందరు లేఅవుట్‌లో ప్లాట్లను విక్రయించారు. వారంతా నష్టపోయే అవకాశముంది. ఇరిగేషన్, కార్పొరేషన్‌కు చెందిన ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరముంది.

మమ్మల్ని అడిగేదెవరు!