
పేట్రేగిపోతున్న టీడీపీ ముష్కర మూకలు
వైఎస్సార్‌సీపీ వర్గీయులపై భౌతిక దాడులు, ప్రైవేట్ ఆస్తుల ధ్వంసాలు
కాకాణిపై కొనసాగుతోన్న అక్రమ కేసులు
మాజీ మంత్రి నల్లపరెడ్డి ఇంట్లో బీభత్సంపై చర్యలు శూన్యం
నేటి వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనకు ఉప్పెనలా జన ప్రభంజనం
ఇంటెలిజెన్స్ నివేదికలతో కుట్రలకు పదును పెట్టిన పోలీసులు
కాకాణిని పోలీస్ కస్టడీ కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు
జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేల నుంచి నేతలు, కార్యకర్తలు పేట్రేగిపోయి ప్రవర్తిస్తున్నారు. టీడీపీ ముష్కర మూకలు సాగిస్తున్న భౌతిక దాడులు, ఆస్తుల విధ్వంసాలు, అరాచకాలు, దాష్టీకాలతో సామాన్య ప్రజలు వణికిపోతున్నారు. అధికారం చేజిక్కిన రోజు నుంచి ప్రభుత్వ భవనాల శిలాఫలకాల ధ్వంసాలతో ప్రారంభమైన ఆటవిక హింసను పదమూడు నెలలుగా కొనసాగిస్తున్నారు. వీరి చర్యలను అడ్డుకునేందుకు సాహసించలేక సామాన్య ప్రజలు మౌనంగా రోధిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే నేతలను టార్గెట్ చేస్తూ అక్రమ కేసులతో నెలల కాలంగా జైల్లో ఉండేలా చేస్తున్నారు. మరో వైపు రాజకీయ విమర్శల నేపథ్యంలో పచ్చమూకలు మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంట్లో పోలీసుల సాక్షిగా విధ్వంసం సాగించినా ఇంత వరకు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. వీరిని పరామర్శించేందుకు వచ్చే మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకునేందుకు అడుగడుగునా కుట్రలకు తెరతీశారు.
సాక్షిప్రతినిధి, నెల్లూరు: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నెల్లూరు పర్యటనను అడ్డుకునేందుకు ‘నారా’ ఆటవిక కుట్రలకు తెర తీశారు. రెడ్‌బుక్ అరాచకానికి.. ఖాకీల పైశాచికం తోడు కావడంతో జిల్లాలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది. ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా పర్యటన ఆగదని స్పష్టం కావడంతో పోలీస్ యంత్రాంగం పౌరుల రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ ఆంక్షలు, బెదిరింపులతో భయానక వాతావరణం సృష్టిస్తోంది. జిల్లా వ్యాప్తంగా ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలోని వైఎస్సార్‌సీపీ ముఖ్య నేతలు ఎవరూ వైఎస్ జగన్ పర్యటనకు వెళ్లడానికి వీల్లేదంటూ నోటీసులు జారీ చేస్తున్నారు.
ఎవరైనా ఆంక్షలు అతిక్రమించి వెళ్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. తాజాగా ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం ఇప్పటి వరకు జరిగిన జగన్ పర్యటనల కంటే మిన్నగా నెల్లూరుకు ఉప్పెనలా జన ప్రభంజనం పోటెత్తే అవకాశం ఉందని చెప్పడంతో కొత్త కుట్రలకు తెర తీశారు. జిల్లా జైల్లో ఉన్న ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డితో ములాఖత్ అయ్యేందుకు వస్తున్న వైఎస్ జగన్ పర్యటనకు అనుమతులిచ్చిన పోలీసులు తాజాగా కాకాణిని పోలీస్ కస్టడీ కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం నారా కుట్రలకు అద్దం పడుతోంది.
ప్రశ్నించే గొంతుకలను నొక్కే యత్నం
ప్రభుత్వ వైఫల్యాలను, అసమర్థతను ప్రశ్నించే గొంతుకలను నొక్కేందుకు కూటమి సర్కార్ రెడ్‌బుక్ రాజ్యాంగంతో భయానక పరిస్థితి సృష్టిస్తోంది. రాజకీయ ప్రత్యర్థులను శత్రువులుగా పరిగణించి హత్యాయత్నాలు, దాడులతో భయానక వాతావరణం నెలకొల్పడమే కాకండా అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపుతూ వికట్టహాసం చేస్తోంది. ప్రభుత్వం చేతిలో కీలు»ొమ్మలుగా మారిన ఖాకీలు ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు నమోదు చేయడం, జైళ్లకు పంపడమే ప్రథమ కర్తవ్యంగా విధులు నిర్వహిస్తున్నారు. దీంతో శాంతిభద్రతలు అదుపు తప్పుతున్నాయి. అధికార పార్టీ అండదండలతో పాత నేరస్తులు, రౌడీïÙటర్లు, అసాంఘిక శక్తులు పేట్రేగిపోతుండటంతో ప్రజలు అభద్రతా భావంతో బతుకుతున్నారు. పోలీస్ శాఖ పూర్తిగా కూటమి ప్రజాప్రతినిధిల కనుసన్నల్లో పనిచేస్తుండడంతో జిల్లాలో శాంతి భద్రతలు గాడి తప్పాయి. హత్యలు, అత్యాచారాలతో రౌడీ మూకలు పేట్రేగి పోతున్నా పట్టించుకోని ఖాకీలు వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసులు నమోదు చేయడంలో మాత్రం అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు.
అదుపు తప్పిన శాంతిభద్రతలు
జిల్లాలోని కొందరు పోలీసు అ«ధికారులు రెడ్‌బుక్ అమల్లో కనబరుస్తున్న శ్రద్ధ నేరాల అదుపులో చూపడం లేదు. దీంతో శాంతిభద్రతలు క్షీణదశకు చేరాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసుశాఖలో రాజకీయ జోక్యం మితిమీరిపోయింది. పోస్టింగ్‌లన్నీ దాదాపు అధికా ర పార్టీ నేతలను ప్రసన్నం చేసిన వారికే దక్కాయి. దీంతో సదరు పోలీసు అధికారులు తమ స్వామి భక్తిని చాటుకుంటున్నారు. అధికార పార్టీ నేతలు చెప్పిందే తడువుగా ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. తమపై దాడు లు, దౌర్జన్యాలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు, ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు, నేతలు పోలీసులకు చేస్తోన్న ఫిర్యాదులు బుట్టదాఖలవుతున్నా యి. అందుకు శంకరనగరంలో జరిగిన దౌర్జన్యకాండే నిదర్శనంగా నిలుస్తోంది.
చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన రోజు అనంతసారం మండలం శంకరనగరంలో వైఎస్సార్‌సీపీ నేత, సర్పంచ్ ఇంటి వద్ద టీడీపీ నాయకులు కవి్వంపు చర్యలకు పాల్పడ్డారు. ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ నేతలపై మారణాయుధాలతో దాడులకు తెగబడ్డారు. వారి ఇంట్లోకి టీడీపీ నేతలు చొరబడి టీవీలు, ఫ్రిజ్‌లను ధ్వంసం చేశారు. సర్పంచ్ వరలక్ష్మి ఇంట్లోకి చొరబడి మారణాయుధాలతో దాడి చేశారు. ఆమెపై దాడికి తెగబడ్డారు. ఇంట్లో చొరబడి ధ్వంసం ఆస్తులు చేశారు. ఆ పక్క ఇంట్లోనే ఉన్న సర్పంచ్ బంధువు రవికుమార్‌రెడ్డి, అడ్డుకోబోయిన ఆయన బావ మరిది నాగసునీల్‌రెడ్డి, మామ రామసుబ్బారెడ్డిపై గొడ్డలితో దాడి చేశారు. ఇంట్లోని వృద్ధులని కూడా చూడకుండా ఇద్దరు మహిళలపై దాడికి పాల్పడ్డారు. న్యాయం చేయాల్సిన పోలీసులు అందుకు భిన్నంగా అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో బాధితులపైనే అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపారు.
జైలునుంచి బయట కు వచ్చినా వారిపై దౌర్జన్యాలు అధికమవడంతో అనేకమంది ఊరు విడిచి వెళ్లిపోయారు. గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. పుట్టగొడుగుల్లా బెల్టుషాపులు వెలిశాయి. గంజాయి, మద్యం 24 గంటలూ అందుబాటులో ఉండడంతో మత్తులో నేరాలు జరుగుతున్నాయి. గచడిన ఏడాదికాలంలో జిల్లాలో 42కుపైగా హత్యలు, 165కుపైగా హత్యాయత్నాలు, 33కుపైగా బాలికలపై లైంగికదాడులు, దాడియత్నాలు, దోపిడీలు, దొంగతనాలు జరిగాయి. ఒక్క నెల్లూరు నగరంలోనే గడిచిన ఏడునెలల్లో 13కుపైగా హత్యలు జరగడం శాంతిభద్రతలు ఏస్థాయిలో క్షీణదశకు చేరాయో ఇట్టే అవగతమవుతోంది. ప్రజాసంక్షేమాన్ని గాలికొదిలేసిన కూటమి పెద్దల పైశాచిక చర్యలపై ప్రజల్లో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
నల్లపరెడ్డి ఇంట్లో విధ్వంసం చేసినా దిక్కులేదు
జిల్లా చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా కూటమి నేతలు నీచ సంస్కృతికి తెరలేపారు. మాజీమంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంట్లో వేమిరెడ్డి దంపతుల ప్రోద్బలంతో వందలాది మంది టీడీపీ ముష్కర మూకలు సాగించిన విధ్వంసంపై పోలీస్ శాఖ చర్యలు తీసుకోవడంలో మీనవేషాలు లెక్కిస్తోంది. ఈ నెల 7న రాత్రి వేళ ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిని ధ్వంసం చేశారు. స్థానిక సీఐ ఘటనా స్థలానికి చేరుకునే సమయంలో కూడా విధ్వంసకారులు అక్కడే ఉన్నారు. ఆ సమయంలో ఆయన ఇంట్లో లేకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డారు.
విధ్వంసం జరిగిన తీరు, చేసిన వ్యక్తులకు సంబంధించిన పూర్తి ఆధారాలను ప్రసన్నకుమార్‌రెడ్డి దర్గామిట్ట పోలీసులకు అందజేíశారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. అయితే అధికార పార్టీ నేతల ప్రమేయం ఉండడంతో పోలీసులు కేసు నమోదులో తీవ్ర జాప్యం చేశారు. ఆరు రోజుల అనంతరం నామమాత్రపు సెక్షన్లతో గుర్తులేని వ్యక్తులు దాడులకు పాల్పడినట్లు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అయితే కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై ఆగమేఘాల మీద నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డితోపాటు మాజీ మంత్రి డాక్టర్ పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతి, మరో ముగ్గురిపై కోవూరు పోలీసులు కేసు నమోదు చేసి అధికార పార్టీ నేతలపై తమ పచ్చభక్తిని చాటుకున్నారు. ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంట్లో జరిగిన విధ్వంసకర చర్యలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేకెత్తించినా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌తో సరిపట్టారు.
కాకాణిపై రుస్తుం కేసుతో..
ప్రభుత్వ వైఫల్యాలు, సూపర్ సిక్స్ హామీల అమల్లో అసమర్థత, అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలతోపాటు స్థానిక ఎమ్మెల్యే వైఫల్యాలను మాజీమంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఎప్పటికప్పుడు ఎండగట్టుతూ వచ్చారు. ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుకయ్యారు. దీనిని జీరి్ణంచుకోలేని కూటమి ప్రభుత్వం ఆయనను టార్గెట్ చేసింది. కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు 13 అక్రమ కేసులు నమోదు చేశారు. తప్పుడు కేసులపై కేసులు బనాయించి హక్కులను కాలరాస్తోంది.
సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టారంటూ, అక్రమ మైనింగ్, గ్రావెల్ తవ్వకాలు, ఎక్సైజ్ శాఖలో చార్జిషిట్ వేసిన కేసుల్లో సైతం పునరి్వచారణ పేరుతో కాకాణిని నిందితుడిగా చేర్చుతూ కేసుల పరంపర కొనసాగిస్తూ ప్రభుత్వం పైశాచిక ఆనందం పొందుతోంది. ఆయన జైలు నుంచి బయటకు వస్తే మరింత దూకుడు పెంచే అవకాశం ఉందని భావించి సంబంధం లేని కేసుల్లో ఆయన పేరును ఇరికించి 67 రోజులుగా వేధిస్తోంది. ఆయా కేసుల్లో బెయిల్ రాకుండా పోలీస్ కస్టడీ విచారణ పేరుతో అడ్డుకుంటోంది. సీడీ ఫైల్స్ లేకుండానే పోలీసులు కస్టడీ వేస్తూ కాకాణిపై వేధింపుల పర్వాన్ని కొనసాగిస్తోంది. తాజాగా ఇదే కేసులోనే మాజీ మంత్రి డాక్టర్ అనిల్‌కుమార్‌యాదవ్‌ను ఇరికించినట్లు తెలుస్తోంది.