
వృద్ధురాలిని బెదిరించి బంగారం దోపిడీ
మనుబోలు: ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలిని దొంగలు బెదిరించి బంగారు గొలుసు, చేతిగాజులు దోపిడీ చేసిన ఘటన మంగళవారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం మేరకు.. మనుబోలు కోదండరామపురంలోని సాయిబాబా మందిరం ఎదురుగా మాధవగిరి ప్రభావతమ్మ ఒంటరిగా నివాసం ఉంటోంది. మంగళవారం అర్ధరాత్రి దొంగలు గోడ దూకి ప్రధాన ద్వారాన్ని పగులగొట్టి ప్రభావతమ్మ ఇంట్లోకి ప్రవేశించారు. నగలు ఇవ్వకుంటే చంపేస్తామని ఆమెను బెదిరించారు. ప్రభావతమ్మ మెడలోని మూడు సవర్ల బంగారు గొలుసు, నాలుగు సవర్ల గాజులు, ఉంగరం లాక్కొని బయట గడియపెట్టి పరారయ్యారు. ఆమె ఈ విషయంపై కుమారుడు హనుమాచార్యులకు సమాచారం అందించింది. అతను స్థానికులతో కలిసి అమ్మ ఉంటున్న ఇంటికి చేరుకున్నాడు. ఫిర్యాదు అందుకున్న ఎస్సై శివరాకేష్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. బుధవారం కేసు నమోదు చేపట్టి దర్యాప్తు చేస్తున్నారు.