
‘అపోలో’లో ఎండ్–ఓ చెక్ సేవలు
నెల్లూరు(అర్బన్): మహిళలకు ఎక్కువగా సోకుతున్న గర్భాశయ ముఖద్వారా కేన్సర్లను ముందుగానే గుర్తించి చికిత్స ద్వారా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మార్చేందుకు ఎండ్–ఓ చెక్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించామని అపోలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మెడికల్ స ర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ తెలిపారు. నెల్లూరు హరనాథపురంలోని అపోలో ఆస్పత్రిలో సర్జికల్ అంకాలజిస్ట్ జీవీవీ ప్రసాద్‌రెడ్డి, సీనియర్ ఆంకాలజిస్ట్ హరిత, యూనిట్ హెడ్ బాలరాజుతో కలిసి ఎండ్–ఓ చెక్ సేవలను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీరామ్ సతీష్ మాట్లాడుతూ మహిళలకు ప్రధానంగా సోకుతున్న ఐదు రకాల కేన్సర్లలో అండాశయ, గర్భాశయ కేన్సర్లు మొదటి స్థానంలో ఉన్నాయన్నారు. 45 ఏళ్లు దాటిన మహిళలకు ఈ కేన్సర్లు ఎక్కువగా వస్తున్నాయన్నారు. ఎండ్–ఓ చెక్ కార్యక్రమం ద్వారా గర్భాశయ ముఖద్వారా కేన్సర్లపై మహిళలకు అవగాహన కల్పించడం, స్క్రీనింగ్ పరీక్షలను ప్రోత్సహించడం, సరైన చికిత్స అందించడమే అపోలో సంస్థ లక్ష్యమని తెలిపారు.
మామపై కోడలి దాడి
● కేసు నమోదు
దగదర్తి: కుటుంబ వివాదాల నేపథ్యంలో మామ మందలించాడని కోడలు దాడి చేసిన ఘటనపై దగదర్తి పోలీస్‌స్టేషన్‌లో బుధవారం కేసు నమోదైంది. వారి కథనం మేరకు.. మండలంలోని దామవరం ఎస్సీ కాలనీ చెందిన చిన వెంకయ్య, కోడలు సంపూర్ణమ్మల మధ్య తరచూ వివాదాలు జరుగుతూ ఉన్నాయి. ఈనెల 25వ తేదీన రాత్రి ఇంట్లో వెంకయ్య నిద్రిస్తుండగా రోకలి బండతో కోడలు దాడి చేసింది. ఈ ఘటనలో గాయపడిన వెంకయ్యను ఆస్పత్రిలో చేర్పించారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు.
కండలేరులో 26.608 టీఎంసీలు
రాపూరు: కండలేరు జలాశయంలో బుధవారం నాటికి 26.608 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. సత్యసాయి గంగ కాలువకు 1,760, పిన్నేరు కాలువకు 20, లోలెవల్ కాలువకు 70, మొదటి బ్రాంచ్ కాలువకు 85 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.

‘అపోలో’లో ఎండ్–ఓ చెక్ సేవలు