జనం రాకుండా రోడ్లు తవ్వేశారు.. చంద్రబాబు సర్కార్‌పై వైఎస్సార్‌సీపీ ఆగ్రహం | YSRCP Reaction On Police Restrictions Over Jagan Nellore Visit | Sakshi
Sakshi News home page

జనం రాకుండా రోడ్లు తవ్వేశారు.. చంద్రబాబు సర్కార్‌పై వైఎస్సార్‌సీపీ ఆగ్రహం

Jul 31 2025 10:44 AM | Updated on Jul 31 2025 1:47 PM

YSRCP Reaction On Police Restrictions Over Jagan Nellore Visit

సాక్షి, నెల్లూరు జిల్లా: వైఎస్‌ జగన్‌ నెల్లూరు పర్యటనపై చంద్రబాబు సర్కార్‌ ఆంక్షలు పెట్టడం దారుణమని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇలాంటి ఆంక్షలు ఎప్పుడూ లేదన్నారు. ప్రభుత్వమే రోడ్లను తవ్వేస్తోందన్న అంబటి.. రోడ్ల తవ్వడమేంటి? ఇదేమైనా యుద్ధ భూమా? అంటూ దుయ్యబట్టారు. ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని  ఆగ్రహం వ్యక్తం చేశారాయన.

మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డిపై దొంగ కేసులు పెట్టి జైలుకు పంపారని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. జిల్లా జైలు వద్ద ఆయన మీడియాత మాట్లాడుతూ.. ప్రజలను రానివ్వకుండా ఎక్కడిక్కడ బారికేడ్లు పెట్టారు.. పక్క జిల్లాల నుంచి పోలీసులు వచ్చారు. ప్రజలు స్వచ్ఛందంగా జగన్‌ని చూసేందుకు వస్తారు. జగన్ పర్యటనపై పోలీసులు, కూటమి నేతలు  కుట్రలు చేస్తున్నారు’’ అని అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌పై ఉండే అభిమానాన్ని ఎవ్వరూ ఆపలేరన్నారు.

భూమన కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ జగన్ నెల్లూరు జిల్లా పర్యటన సందర్భంగా చంద్రబాబు కూటమి ప్రభుత్వం హాస్యాస్పదంగా వ్యవహరిస్తుందన్నారు. నెల్లూరు నగరాన్ని పూర్తిగా పోలీసులతో అష్ట దిగ్బంధనం చేసారు. చుట్టుపక్కల ఉన్న పల్లెలను పోలీసులతో చుట్టుముట్టారు. అయినా అభిమానులు, కార్యకర్తలు వస్తారని దారులను జేసీబీలతో గుంతలు తవ్వుతున్నారు. ఇది ఆశ్చర్యం కలిగించే విషయం. ఇలా గుంతలు తవ్వడం ద్వారా ప్రజలకు అత్యవసర పనులకు ఆటంకం కలుగుతుంది.

..నెల్లూరు లో ప్రధాన రహదారులు, దారులలో ముళ్ల కంచెలు వేస్తున్నారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ తరంగాలు చూస్తే మంచి హాస్య నాటకం పోలీసులతో వేయిస్తున్నట్లు ఉంది. అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు వస్తుంటే ఇన్నీ ఆంక్షలా.. అందరికీ నోటీసులు ఇచ్చి, అడుగడుగునా అడ్డంకులు పెడుతున్నారు. ఎక్కడ ప్రజలు జగన్ కోసం వస్తారోనని ప్రభుత్వం భయపడుతుంది. చంద్రబాబు కూటమి ప్రభుత్వం అన్ని అడ్డంకులు, నిబంధనలు పెట్టిన జగన్ చూడటానికి సునామీలా వస్తారని బంగారుపాళ్యంలో రుజువైయింది. కూటమీ ప్రభుత్వం గుంతలు తవ్విన, ముళ్ల కంచెలు వేసిన జగన్ పర్యటన విజయవంతం అవ్వడం ఖాయం. ఆపడం ఎవరితరం కాదు’’ అని భూమన అన్నారు.

రోడ్లను తవ్వడం దారుణం: అప్పలరాజు
రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. రోడ్లను తవ్వడం దారుణమన్నారు.

వైఎస్‌ జగన్‌ అంటే భయమెందుకు?: అనంత వెంకటరామిరెడ్డి
వైఎస్‌ జగన్‌ అంటే చంద్రబాబు ప్రభుత్వానికి భయమెందుకు అంటూ ప్రశ్నించారు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి. సింహాన్ని చూసి భయపడినట్లు ఉంది. టీడీపీ కూటమి ప్రభుత్వం తీరు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యున్ని ఆపాలనుకోవడం మూర్ఖత్వం. వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనలో ప్రజలను అడ్డుకోవడం దుర్మార్గం. దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు వైఎస్ జగన్. పులివెందుల ఎమ్మెల్యే అంటూ వ్యంగ్యంగా మాట్లాడిన మంత్రులు... జగన్ పర్యటనలపై ఆంక్షలు ఎందుకు విధిస్తున్నారో చెప్పాలని అనంత వెంకటరామిరెడ్డి అన్నారు.

సునామీని ఆపగలిగే శక్తి ఉందా?: ఎమ్మెల్సీ ఇస్సాక్‌ బాషా
వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనపై ప్రభుత్వ ఆంక్షలపై ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా మండిపడ్డారు. ప్రజలను, సునామీని ఆపగలిగే శక్తి ఉందా? అన్న ఇస్సాక్‌ భాషా.. ముందే నీ ఓటమిని ఒప్పుకుంటున్నవా? చంద్రబాబు అంటూ ప్రశ్నించారు. ‘‘అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపలేరు. అలాగే వైఎస్‌ జగన్‌ మీద ప్రజలకు ఉన్న అభిమానాన్ని ఆపలేరు. ప్రజలను రాకుండా మీరు చేస్తున్న పనులు హేయమైనవి, దుర్మార్గమంటూ ఆయన విమర్శించారు. మీ నీచ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు. మాపై ఎన్ని కేసులు పెట్టిన భయపడం’’ అని ఇస్సాక్‌ భాషా తేల్చి చెప్పారు.

ఇలాంటి దుస్థితి ఏ రాష్ట్రంలోనూ లేదు: వైఎస్‌ అవినాష్‌రెడ్డి
వైఎస్ జగన్ భద్రతను గాలికొదిలేసిన చంద్రబాబు ప్రభుత్వం.. కార్యకర్తలను అడ్డుకుంటుందని వైఎస్సార్‌సీపీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి మండిపడ్డారు. రోజురోజుకీ కూటమి ప్రభుత్వ అరాచకం పెరిగిపోతోందన్నారు. నెల్లూరు పర్యటనకు కార్యకర్తలను రాకుండా లాఠీ ఛార్జ్ చేయడం దారుణం. మా ప్రభుత్వంలో మిమ్మల్ని అడ్డుకున్నామా..?. చంద్రబాబు స్వేచ్ఛగా తిరిగి ఎన్నెన్నో విమర్శలు చేశారు. ఏ హోదా లేని పవన్ కళ్యాణ్‌కి కూడా అన్నాడు మేము భద్రత ఇచ్చాం. వీళ్ళని మేము ఎక్కడా అడ్డుకున్నది లేదు. కానీ ఇప్పుడు జగన్‌ను అడ్డుకోవాలని చూడటం దారుణం.

ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటివద్ద కార్యకర్తలపై లాఠీ ఛార్జ్ చేశారు. ఎవరు రాకూడదని 5 వేల మంది పోలీసులను వినియోగించారు. ఇలాంటి దుస్థితి ఏ రాష్ట్రంలోనూ లేదు. గుంటూరు, సత్తెనపల్లి, పొదిలి, బంగారుపాళ్యం.. ఇలా రోజు రోజుకీ కూటమి ప్రభుత్వ అరాచకం ఎక్కువవుతోంది. మీరు ఎంత అపాలనుకున్నా.. వైఎస్‌ జగన్ కోసం వచ్చే జనాన్ని మీరు ఆపలేరు. జగన్ భద్రతపై ప్రతి ఒక్క కార్యకర్తల్లో ఆందోళన ఉంది. భద్రతపై కేంద్రాన్ని, సుప్రీం కోర్టును, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాం’’ అని అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement