
రెడ్‌బుక్ రాజ్యాంగంతో ఇవాళ రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులు కనిపిస్తున్నాయని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. తన పార్టీ వాళ్లను పరామర్శించడానికి వస్తే తప్పేంటని.. పర్యటన కోసం ఆంక్షలు విధించడం విడ్డూరంగా ఉందని అన్నారాయన. నెల్లూరులో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు..
సాక్షి, నెల్లూరు: రెడ్‌బుక్ రాజ్యాంగంతో ఇవాళ రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులు తలపిస్తున్నాయని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. మా పార్టీ వాళ్లను పరామర్శించడానికి వస్తే తప్పేంటి?.. పర్యటన నేపథ్యంలో ఆంక్షలు విధించడం విడ్డూరంగా ఉందని అన్నారాయన. గురువారం నెల్లూరు పర్యటనలో భాగంగా.. అక్రమ కేసుల్లో జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాణితో ములాఖత్ అయ్యారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించి మీడియాతో వైఎస్ జగన్ మాట్లాడారు.
మా పార్టీ శ్రేణులు, అభిమానులు రాకుండా రోడ్లను తవ్విన అధ్వాన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రతిపక్ష నేతను చూసి చంద్రబాబు ఇంతలా ఎందుకు భయపడుతున్నారు?. ఇవాళ వేల మంది పోలీసులు.. లెక్కలేనంత మంది డీఐజీలు, డీఎస్పీలు ఉన్నారు. వీళ్లంతా నా సెక్యూరిటీ కోసం కాకుండా.. అభిమానులను ఆపడం కోసం ఉన్నారు.
సూపర్‌సిక్స్ అంటూ ప్రజలను మోసం చేశారు. నాడు నేడు ఆగిపోయింది. ఇంగ్లీష్ మీడియం ఆగిపోయింది. అన్ని పథకాలు ఆపేశారు. వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేశారు. తన పాలన చూసి చంద్రబాబే భయపడుతున్నారు. ప్రజలకు సమాధానం చెప్పుకోలేకే రెడ్‌బుక్ రాజ్యాంగం. ప్రశ్నించేవారి గొంతులను నొక్కేస్తున్నారు.
ఆరుసార్లు ఎమ్మెల్యే అయిన ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిపై దాడికి ప్రయత్నించారు. ప్రసన్న ఇంటిపైకి 80 మందిని పంపి దాడి చేయించారు. మారణాయుధాలతో ఇంట్లోకి ప్రవేశించి.. ఫర్నీచర్ ధ్వంసం చేశారు. ఆ దాడితో ప్రసన్న తల్లి వణికిపోయారు. ఆ సమయంలో ప్రసన్న ఇంట్లో లేరు కాబట్టి సరిపోయింది. లేకుంటే చంపి ఉండేవారేమో. ఇళ్లపై దాడులేంటి.. మనుషుల్ని చంపాలని చూడడమేంటి?. మనిషి నచ్చకపోతే చంపేస్తారా?.. ఇలాంటి దిగజారుడు రాజకీయాలు గతంలో చూడలేదు. మా పార్టీ మహిళా నేతలు రోజా, ఉప్పాడ హారిక, విడదల రజిని లాంటి వాళ్లను ఉద్దేశించి టీడీపీ నేతలు ఎంత దారుణంగా మాట్లాడారో అంతా చూశారు. రాష్ట్రంలో చంద్రబాబు విషబీజాలు నాటారు..
కాకాణి గోవర్ధన్‌పై 14 కేసులు పెట్టారు. కావలిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి చేశారు. దానిని ప్రశ్నించినందుకే తప్పుడు సాక్ష్యాలు సృష్టించి కాకాణిపై కేసులు పెట్టారు. ఒక రాజకీయ నాయకుడు ప్రెస్ మీట్ పెడితే.. దానిని వాట్సాప్‌లో షేర్ చేస్తే కేసులు పెడతారా?. ఒక కేసు అయిపోగానే మరో కేసు పెట్టి వేధిస్తున్నారు. ఏ తప్పు చేశాడని కాకాణిపై కేసులు పెట్టారు?. శాడిజం చంద్రబాబు నరనరాన పేరుకుపోయిందనడానికి ఇదే నిదర్శనం అని జగన్ అన్నారు.
టీడీపీ కార్యకర్త సాక్ష్యం చెబితే కాకాణిపై కేసు పెడతారా?. మాగుంట శ్రీనివాసులు ఫోర్జరీ కేసులో చొవ్వా చంద్రబాబు కోసం కాకాణిపై కేసు పెడతారా?. టీడీపీ నేతల దాడుల్లో గాయపడిన బాధితులను పరామర్శించినా కేసులు పెడతారా?. పోలీసుల పక్షపాత ధోరణిని ఎత్తి చూపించినా కేసులు పెడతారా?. ఇంతకన్నా అన్యాయమైన పరిస్థితులు ఉంటాయా?.. అని జగన్ ప్రశ్నించారు.
లిక్కర్ మాఫియాకు డాన్ చంద్రబాబే. కూటమి ప్రభుత్వంలో ఇల్లీగల్ పర్మిట్ రూంలో మద్యం అమ్ముతున్నారు. ఎమ్మార్పీ కంటే అధిక రేట్లకు అమ్ముతున్నారు. మద్యం కమీషన్లు చంద్రబాబు, ఎమ్మెల్యేలే పంచుకుంటున్నారు. సిలికా, క్వార్ట్జ్‌ను విచ్చలవిడిగా దోచేస్తున్నారు. మైన్స్ కమీషన్లు చంద్రబాబు, లోకేష్‌కే చేరుతున్నాయి. పరిశ్రమలు నడుపుకోవాలన్నా.. ముడుపులు చెల్లించాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. చంద్రబాబు పాలన ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి ఈ పరిస్థితులే ఉదాహరణలు.
నందిగం సురేష్‌ను జైల్లో పెట్టారు. వల్లభనేని వంశీని చిత్రహింసలు పెట్టారు. కాలేజీ రోజుల నాటి గొడవ.. పెద్దిరెడ్డితో కోపంతోనే మిథున్‌రెడ్డిపై చంద్రబాబు లిక్కర్ కేసు పెట్టారు. తన సొంత నియోజకవర్గంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యాడనే కోపంతోనే చంద్రబాబు కేసు పెట్టించాడు. కొడాలి నాని, పేర్ని నాని.. పేర్ని నాని భార్యను, అనిల్ కుమార్ యాదవ్‌ను వేధిస్తున్నారు. ఇలా ఎంతో మంది(పేర్లు చదివి వినిపించారు) అన్యాయాలను ప్రశ్నిస్తున్నవాళ్ల మీద తప్పుడు కేసులు పెట్టారు అని జగన్ అన్నారు.

చంద్రబాబూ.. మీరు ఏదైతే విత్తుతారో అదే రేపు పండుతుంది. ఎల్లకాలం మీ ప్రభుత్వం ఉండదు. కళ్లు మూసి తెరిచేలోపే మూడేళ్లు గడుస్తుంది. అప్పుడు మా ప్రభుత్వమే వచ్చింది. అప్పుడు కచ్చితంగా చంద్రబాబుకి, చంద్రబాబు అడుగులకు మడుగులు ఒత్తిన అధికారులకు లెక్క జమ తీసి చట్టం ముందు నిలబెడుతాం. తప్పు చేసిన ప్రతీ ఒక్కరికి శిక్ష తప్పదు. ఇప్పటికైనా అది గుర్తించండి.. అని జగన్ మరోసారి హెచ్చరించారు.
