
సాక్షి, నెల్లూరు జిల్లా: వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటి వద్ద పోలీసులు అరాచకం సృష్టించారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, ప్రజలపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. మహిళలు, వృద్ధులపైనా కూడా లాఠీఛార్జ్ చేశారు. పోలీసుల చర్యలకు నిరసనగా ప్రసన్నకుమార్‌రెడ్డి రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు తోసివేయడంతో ఆయన చేతికి గాయమైంది. మహిళలను కూడా పోలీసులు చితకబాదారు. పోలీసుల తీరుపై వైఎస్సార్‌సీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు నినాదాలు చేశాయి. పోలీస్ జులుం నశించాలంటూ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు.

వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో ఆంక్షల వలయంలో నెల్లూరు నగరాన్ని పోలీసులు అష్ట దిగ్బంధం చేశారు. గుంటూరు రేంజ్, తిరుపతి రేంజ్ నుంచి భారీగా పోలీసు బలగాలు తరలివచ్చాయి. చెవుడు గుంట జైలు నుంచి సుజాతనగర్‌లోని మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వరకు భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. అడుగడుగునా భారీకేడ్లు, ముళ్లకంచెలు ఏర్పాటు చేశారు. అయ్యప్ప గుడి నుంచి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మీదుగా నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ ఇంటికి వైఎస్ జగన్ రానున్నారు. మెయిన్ రోడ్డులోకి జనం రాకుండా ప్రతి సందులో ముళ్లకంచెలు, భారీ కేట్లు ఏర్పాటు చేశారు. పోలీసుల తీరుపై నగర వాసులు అసహనం వ్యక్తం చేశారు.

రోజువారి కార్యక్రమాలకు, పనులకు వెళ్లనీయకుండా పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారంటూ జనం మండిపడ్డారు. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి వెళ్లే కార్నర్‌లో ఉద్రిక్తత నెలకొంది. తన ఇంటి వైపు కార్యకర్తలు రానీయకుండా పోలీసులు అడ్డుకోవడంపై నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడే నిలబడి నిరసన తెలిపారు.
తమ కార్యకర్తలను అన్యాయంగా కొట్టారంటూ ప్రసన్నకుమార్‌రెడ్డి మండిపడ్డారు. ‘‘స్వచ్ఛందంగా ప్రజలు తరలివస్తుంటే అడ్డకుంటున్నారు. ప్రజలపై కూడా పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. జనం రాకుండా రోడ్లు తవ్వేశారు. వైఎస్ జగన్ అభిమానులను ఎవరూ ఆపలేరు’’ అని ప్రసన్నకుమార్ పేర్కొన్నారు.