
జగన్ పర్యటనకు పటిష్ట బందోబస్తు
నెల్లూరు (క్రైమ్): మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 31న నెల్లూరు పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. నెల్లూరు నగరంలో 30 పోలీసు యాక్ట్ అమల్లో ఉన్న దృష్ట్యా సభలు, సమావేశాలు, ఊరేగింపులు నిషేధమని చెప్పారు. మంగళవారం నగరంలోని ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన సందర్భంగా తీసుకుంటున్న చర్యలపై ఆయన వివరాలు వెల్లడించారు. జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ప్రత్యేక హెలికాప్టర్‌లో ఉదయం 10.30 నుంచి 11 గంటల మధ్యలో డీటీసీ సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారన్నారు. అక్కడి నుంచి జిల్లా కేంద్ర కారాగారానికి చేరుకుని రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డితో ములాఖాత్ అవుతారన్నారు. హెలిప్యాడ్ వద్దకు కేవలం 10 మందికి మాత్రమే అనుమతి ఉందని, జైలు నిబంధనల మేరకు ములాఖాత్‌కు ముగ్గురు మాత్రమే వెళుతారన్నారు. వీరు మినహా మిగిలిన వారికి ఎవరికి జైలు వద్దకు అనుమతుల్లేవని స్పష్టం చేశారు. ప్రజలు ఎవరూ రావొద్దని వస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ములాఖాత్ అనంతరం రోడ్డు మార్గాన సుజాతమ్మ కాలనీలోని మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటికి వెళ్లి వారితో మాట్లాడుతారన్నారు. అక్కడికి 100 మందికి మాత్రమే అనుమతి ఉందన్నారు. పోలీసు ఆంక్షలను దాటుకుని ఎవరైనా వస్తే చర్యలు తప్పవన్నారు. రోడ్‌షోలు, వాహన ర్యాలీలకు ఎలాంటి అనుమతులు లేవన్నారు. రెచ్చగొట్టేఽ విధంగా ఫ్లకార్డులు, పోస్టర్లు ప్రదర్శించినా, నినాదాలు చేసిన చర్యలు తప్పవన్నారు. ఆరు డ్రోన్లు, 40 సీసీ కెమెరాలతో పర్యటన మొత్తం రికార్డు చేస్తామని, కమాండ్ కంట్రోల్ నుంచి లైవ్ పర్యవేక్షిస్తామన్నారు. ఈ సమావేశంలో ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, ఎస్‌బీ, నెల్లూరు నగర, రూరల్ డీఎస్పీలు ఎ. శ్రీనివాసరావు, పి. సిందుప్రియ, ఘట్టమనేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
అమల్లో 30 పోలీసు యాక్ట్
హెలిప్యాడ్ వద్దకు
10 మందికే అనుమతి
ఆంక్షలు ఉల్లంఘిస్తే చట్ట పరమైన చర్యలు
ఇన్‌చార్జి ఎస్పీ ఏఆర్ దామోదర్