
సాక్షి, నెల్లూరు: నలభై ఏళ్ల తన రాజకీయ జీవితంలో నారా చంద్రబాబు నాయుడు ఎన్నో పర్యటనలు చేసి ఉంటారు. ప్రతిపక్ష నేతగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోనూ ఆయన ఆ పని స్వేచ్ఛగానే చేశారు. ఏనాడూ.. ఏ పర్యటనకు ఆటంకాలు ఎదురైంది లేదు.. ఆంక్షలు విధించింది లేదు. అలాంటిది జగన్ జనాల్లోకి వస్తున్నారంటే మాత్రం.. సింగపూర్ పర్యటనలో ఉన్నాసరే చంద్రబాబు ఎందుకనో వణికిపోతున్నారు!.
వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన వేళ.. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంక్షల విధింపు కనిపిస్తోంది. జగన్ పర్యటన హైలైట్ కావొద్దని టీడీపీ కుట్రలు చేస్తోంది. ఇప్పటికే వైఎస్సార్‌సీపీ నేతలకు, కార్యకర్తలకు పోలీసులతో బెదిరింపులు చేయించింది. జనసమీకరణ జరగొద్దని మైకులతో ప్రచారం చేయిస్తోంది. పోలీస్ సెక్షన్ 30 అమల్లో ఉందని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరిస్తోంది.
ఇప్పటికే జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లా నేతలకూ పోలీస్ నోటీసులు జారీ అయ్యాయి. ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మండల స్థాయి నాయకులకు నోటీసులు చేరాయి. తాజాగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిలకు పోలీసులు నోటీసులు అందజేశారు. జగన్ పర్యటనకు రాకూడదంటూ అందులో పేర్కొన్నారు. అదే సమయంలో.. కేసులు పెడతామంటూ కార్యకర్త స్థాయి వాళ్లకూ పోలీసు బెదిరింపులు వెళ్తుండడం గమనార్హం.
మాజీ మంత్రి కాకాణితో ములాఖత్‌తో పాటు టీడీపీ గుండాల చేతిలో తృటిలో దాడి నుంచి తప్పించుకున్న నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని జగన్ పరామర్శించాల్సి ఉంది. సాధారణంగానే.. జగన్ వస్తున్నారంటే జనం తండోపతండాలుగా తరలి వస్తారు. అందునా కూటమి ప్రభుత్వ వ్యతిరేకత అనేది జగన్ పర్యటన రూపంలో స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే ఆయన పర్యటనలకు జనాన్ని దూరం చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు.
తాజాగా.. జగన్ నెల్లూరు పర్యటనకి 113 మందికి మించకూడదని వింత ఆంక్షలు విధించారు. బైక్ ర్యాలీ, రోడ్ షోకి అనుమతి లేదంట. మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి దగ్గర కేవలం 100 మందికే అనుమతి ఉందట. అంతకు మించి గుమిగూడితే.. కేసులు పెడతామని బెదిరింపులకు దిగుతున్నారు.
అలాగే.. జగన్ పర్యటన హెలిప్యాడ్ అనుమతి విషయంలో తాత్సారం చేసిన పోలీసులు చివరాఖరికి 10 మందికే అనుమతి ఉందంటూ చెప్పడం గమనార్హం. దేశంలో ఎక్కడా లేని విధంగా షరతులు పెడుతున్న ఏపీ పోలీసులపై, వాళ్ల బెదిరింపులపై, నోటీసుల వ్యవహారంపై వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడుతున్నారు. ఇదేమి రాజ్యం చంద్రబాబూ.. అని ప్రశ్నిస్తున్నారు.
