బదిలీలు.. కాదండోయ్ బేజారే
నెల్లూరు (టౌన్): జిల్లాలో గురువులకు బదిలీల బెంగ పట్టుకుంది. ప్రక్రియ కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఆన్‌లైన్ కేంద్రాలకు వెళ్తే సర్వర్ మొరాయిస్తోంది. ఫలితంగా గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. కొద్దిసేపే పనిచేస్తూ.. ఆపై సమస్య మళ్లీ మొదటికొస్తోంది. సాఫ్ట్‌వేర్‌ను సక్రమంగా డిజైన్ చేయకపోవడంతో అంతా తప్పులతడకగా దర్శనమిస్తోంది. ఈ పరిణామాలతో ఏమి చేయాలో ఉపాధ్యాయులకు పాలుపోవడంలేదు.
అంతా లోపభూయిష్టం
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఎనిమిదేళ్ల సర్వీస్‌ను పూర్తి చేసుకున్న స్కూల్ అసిస్టెంట్లు 1289, సెకండరీ గ్రేడ్ టీచర్లు 1482, ఐదేళ్లు పూర్తి చేసుకున్న హెడ్‌మాస్టర్లు 45 మంది ఉన్నారు. వీరితో పాటు రెండేళ్లు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులకు రిక్వెస్ట్ కింద బదిలీ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఇలా జిల్లాలో దాదాపు మూడు వేల మంది దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. హెడ్‌మాస్టర్ల దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ముగియగా, స్కూల్ అసిస్టెంట్లకు శనివారంతో పూర్తయింది. అయితే దరఖాస్తు సమయంలో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. వీరికి రావాల్సిన పాయింట్లు వ్యక్తిగత వివరాల్లో కనిపించడంలేదు. ఏమైనా సమస్యలుంటే జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో డిప్యూటీ డీఈఓను కలవాలని జిల్లా విద్యాశాఖ అధికారులు ఉచిత సలహాలిస్తున్నారు.
అస్తవ్యస్తంగా..
● రెండుసార్లు రీఅపోర్ష్‌మెంట్‌కు గురయ్యే వారికి ఏడు పాయింట్లను కేటాయించాలి. అయితే కొందరికే ఇవి వస్తున్నాయి.
● కొత్తగా రీఅపోర్ష్‌మెంట్‌కు గురయ్యే ఉపాధ్యాయులకు ఐదు పాయింట్లు రావడం లేదు.
● సర్వర్ కొంతమందికి అవైలబుల్ సూన్ అని, మరికొందరికి అసలు ఓపెనే కావడం లేదు.
● రీఅపోర్ష్‌మెంట్‌కు గురయ్యే ఉపాధ్యాయులకు పాత స్టేషన్ పాయింట్లు రావడం లేదు.
● మోడల్ ప్రాథమిక పాఠశాలల్లో ఎన్‌రోల్‌మెంట్ 120 దాటితే అదనంగా ఎస్జీటీ పోస్టు ఉంటుందని చెప్పినా, అదెక్కడా కానరావడంలేదు. మిగులు ఉంటే ఇస్తామంటున్నారు.
● ఎస్జీటీల కేడర్ స్ట్రెంథ్, సర్‌ప్లస్ జాబితాను నేటికీ విడుదల చేయలేదు.
● ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్న హైస్కూల్ ప్లస్‌లలో 1, 2 తరగతుల విద్యార్థులు సమీపంలోని పాఠశాలల నుంచి వచ్చి ఇక్కడ చేరారు. ఆ సంఖ్యను నమోదు చేయకపోవడంతో పోస్టులు పెరగని పరిస్థితి నెలకొంది.
● పాఠశాలల కేటగిరీ – 4 (రోడ్డు సౌకర్యం లేని) జాబితాను ఇప్పటికీ ప్రదర్శించలేదు.
కౌన్సెలింగ్ ఆన్‌లైనా.. ఆఫ్‌లైనా..?
తొలుత అన్ని కేడర్ ఉపాధ్యాయులకు ఆన్‌లైన్లోనే కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తామని ప్రకటించారు. అయితే ఆఫ్‌లైన్లో నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాలు పట్టుబట్టాయి. ఎస్జీటీలకు మాత్రమే ఆఫ్‌లైన్లో నిర్వహిస్తామని చెప్పినా, జీఓ ఇప్పటికీ జారీ కాలేదు. పైగా ఈ తరహాలో నిర్వహించలేమంటూ చాలా మంది డీఈఓలు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అధికారులకు మొరపెట్టుకున్నారని సమాచారం. మరోవైపు రెండేళ్ల సర్వీస్‌ను పూర్తి చేసుకున్న కొంతమంది ఉపాధ్యాయులు రిక్వెస్ట్ బదిలీలకు దరఖాస్తు చేసుకుంటున్నారు. తాము కోరుకున్న ప్రాంతాన్ని సాధించాలనే లక్ష్యంతో అధికార పార్టీ నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారని తెలిసింది. డబ్బులు ముట్టజెప్పయినా తాముకున్నది సాధించేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు.
దరఖాస్తు చేసుకోవాలంటే గగనమే
తరచూ మొరాయిస్తున్న సర్వర్
గంటల తరబడి పడిగాపులు
సమస్యలు పరిష్కరించకుండానే
సాఫ్ట్‌వేర్ రూపకల్పన
వివరాలను గోప్యంగా ఉంచుతున్న
జిల్లా విద్యాశాఖ
ముగిసిన స్కూల్ అసిస్టెంట్ల దరఖాస్తు ప్రక్రియ
దరఖాస్తు తేదీని పొడిగించాలి
దరఖాస్తు చేసుకునేందుకు సర్వర్ తరచూ మొరాయిస్తోంది. సాఫ్ట్‌వేర్‌లో లోపాలను సరిచేయాలి. ఈ పరిణామాల క్రమంలో స్కూల్ అసిస్టెంట్ల దరఖాస్తు గడువును ఒకరోజు పొడిగించాలి. ఎస్జీటీల కేడర్ స్ట్రెంథ్‌ను జిల్లా విద్యాశాఖ అధికారులు బహిర్గతం చేయాలి.
– సురేందర్‌రెడ్డి, ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు
సాంకేతిక సమస్యలపై వాట్సాప్‌లో మెసేజ్‌లు పెట్టాలి
సాఫ్ట్‌వేర్‌లో వస్తున్న సాంకేతిక సమస్యలపై జిల్లా విద్యాశాఖ అదికారులకు వాట్సాప్‌లో మెసేజ్ పెట్టాలి. దీన్ని రాష్ట్ర విద్యాశాఖ ఐటీ విభాగ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తున్నాం. ఈ విషయంలో ఎవర్నీ కలవాల్సిన అవసరం లేదు. రెండేళ్ల సర్వీస్‌ను పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు రిక్వెస్ట్ బదిలీకి దరఖాస్తు చేసుకోవచ్చు.
– బాలాజీరావు, డీఈఓ
బదిలీలు.. కాదండోయ్ బేజారే


