పులి ఆచూకీ కోసం గాలింపు
ఉదయగిరి: ఉదయగిరి రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో పెద్ద పులి సంచరిస్తోందనే అంశం స్థానికుల్లో అలజడి సృష్టిస్తున్న నేపథ్యంలో దాని ఆచూకీ కోసం గాలింపు చర్యలను అటవీ సిబ్బంది శుక్రవారం చేపట్టారు. బండగానిపల్లి ఘాట్ రోడ్డులో బైక్‌పై వెళ్తున్న వారికి పులి మంగళవారం రాత్రి కనిపించడంతో దాని పాదముద్రలను అటవీ అధికారులు సేకరించారు. తాజాగా గోసుకొండ ప్రాంతంలో జీవాల కాపరికి పులి గురువారం మధ్యాహ్నం కనిపించడంతో అటవీ అధికారులు, బేస్ క్యాంప్, స్టయికింగ్ ఫోర్స్ సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టారు. కొన్ని ప్రదేశాల్లో పాదముద్రలను గుర్తించారు. ఈ దిశను అనుసరించి వచ్చిన దారినే తిరిగి ప్రయాణాన్ని ప్రారంభించి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో ట్రాప్ కెమెరాలను అమర్చారని సమాచారం. కాగా పాదముద్రల విశ్లేషణ నివేదిక ల్యాబ్ నుంచి రావాల్సి ఉంది. అదొచ్చాకే స్పష్టత లభించనుంది.
విద్యార్థులకు తీరిన
రవాణా కష్టాలు
వెంకటాచలం: వీఎస్‌యూ విద్యార్థులకు రవాణా కష్టాలు ఇక తీరినట్లేనని వీసీ అల్లం శ్రీనివాసరావు పేర్కొన్నారు. మండలంలోని కాకుటూరు వద్ద గల వర్సిటీలో 8 సీటర్ల బ్యాటరీ వాహనాన్ని యూనియన్ బ్యాంక్ సహకారంతో ఎంపవర్ హర్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రధాన రహదారి నుంచి క్యాంపస్ సుమారు కిలోమీటర్ దూరంలో ఉండటంతో విద్యార్థులు, మహిళలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. తమ అభ్యర్థన మేరకు ఈ వాహనాన్ని యూనియన్ బ్యాంక్ అందించడంపై ఆనందం వ్యక్తం చేశారు. బ్యాంక్ రీజినల్ హెడ్, ఏజీఎం శ్యామ్‌ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
పులి ఆచూకీ కోసం గాలింపు


