
తెలుగు అధ్యాపకుల నిరసన
నెల్లూరు(టౌన్): ‘ఇంటర్ బోర్డు చేపట్టిన సంస్కరణల్లో భాగంగా ఎప్పటి నుంచో ద్వితీయ భాషగా ఉన్న తెలుగును ఆప్షనల్ చేయడం దారుణం. ఇది ఆ భాషను అవమానించడమే’ అని తెలుగు అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు స్టోన్‌హౌస్‌పేటలోని కేఏసీ జూనియర్ కళాశాలలో జరుగుతున్న మాల్యాంకనం వద్ద మంగళవారం నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. అనంతరం క్యాంప్ ఆఫీసర్ ఎ.శ్రీనివాసులుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో అధ్యాపకులు రమేష్, వెంకట్రావు, పులి చెంచయ్య, శ్రీనివాసులు, ఆశ్వీరాదం, సోమశేఖర్, వనజ, సరళ, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ధాన్యం లారీ బోల్తా
ఆత్మకూరు: ధాన్యం లోడ్‌తో వెళ్తున్న లారీ అదుపుతప్పి పొలాల్లో బోల్తా పడిన ఘటన మంగళవారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. మున్సిపల్ పరిధిలోని 9వ వార్డు అనంతరాయనియేని గిరిజన కాలనీ వద్ద పొలాల్లో లారీలో ధాన్యం బస్తాలు లోడ్ చేయగా నెల్లూరుకు బయలుదేరింది. ఈ క్రమంలో డొంకరోడ్డు కొంతమేర కుంగి ఉండటంతో లారీ అదుపుతప్పి పొలాల్లో బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్, క్లీనర్ గాయపడగా వారిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ధాన్యం బస్తాలు అన్ని పొలాల్లో చెల్లాచెదురుగా పడిపోయాయి. దీంతో మరో లారీలో లోడ్ చేసి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
తల్లిదండ్రులకు
కన్నీరు మిగిల్చి..
● రోడ్డు ప్రమాదంలో
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి
వలేటివారిపాలెం: రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతిచెందిన ఘటన మండలంలోని పోకూరు ఆక్స్‌ఫర్డ్ స్కూల్ వద్ద వే బ్రిడ్జి సమీపంలో 167–బీ జాతీయ రహదారిపై మంగళవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని శింగమనేనిపల్లి గ్రామానికి చెందిన బాశం వెంకటేశ్వర్లు – మాధవి దంపతుల కుమారుడు బాశం దినేష్ (25) వర్క్ ఫ్రం హోం చేస్తున్నాడు. అంతేకాకుండా తల్లిదండ్రుల వ్యవసాయ పనుల్లో చేదోడువాదోడుగా ఉన్నాడు. బడేవారిపాళెం నుంచి పొలం అరక దున్నే కూలీని తీసుకురావాలని తండ్రి వెంకటేశ్వర్లు కుమారుడికి చెప్పాడు. దీంతో తన బుల్లెట్‌పై బయలుదేరిన దినేష్‌కు ఊరు దాటగానే తండ్రి ఫోన్ చేసి అమ్మకి ఆరోగ్యం బాగోలేదు.. ముందు పోకూరు వెళ్లి మందులు తీసుకొని అక్కడి నుంచి బడేవారిపాళెం వెళ్లమని చెప్పాడు. దినేష్ మందులు తీసుకుని బడేవారిపాళెం వెళ్తున్నాడు. హైవేపై ముందు వెళ్తున్న కారును ఓవర్ టేక్ చేయబోయి ఎదురుగా కందుకూరు వైపు వస్తు న్న ఆటోను ఢీకొట్టాడు. రోడ్డుపై పడిపోయిన దినేష్ తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న ఎస్సై మరిడి నాయుడు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కందుకూ రు ఏరియా వైద్యశాలకు తరలించారు. అప్పటి వరకు గ్రామంలో ఉత్సాహంగా తిరిగిన దినేష్ మృతితో శింగమనేనిపల్లిలో విషాదం నెలకొంది. వెంకటేశ్వర్లుకు ఒక అబ్బాయి, అమ్మాయి సంతానం. మరో ఆరునెలల్లో దినేష్ అక్కకు వివాహం చేయాల్సి ఉంది. అన్ని తానై చూసుకుంటున్న యువకుడి మృతితో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ఆటోలో వెళ్తుండగా..
● కింద పడి చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
ఉదయగిరి: మండలంలోని సున్నంవారిచింతల సమీపంలో మంగళవారం మధ్యాహ్నం ఆటోలో వెళ్తున్న తిరుమలాపురం ఎస్టీ కాలనీకి చెందిన కొండయ్య (48) అనే వ్యక్తి ప్రమాదవశాత్తు జారి కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తీసుకెళ్లారు. అక్కడ ఓ ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఇంద్రసేనారెడ్డి తెలిపారు.

తెలుగు అధ్యాపకుల నిరసన

తెలుగు అధ్యాపకుల నిరసన