
ఓ యువ క్రికెటర్ 17 ఏళ్లు కూడా నిండకుండానే జాతీయ జట్టుకు నాయకుడయ్యాడు. 17 ఏళ్ల జాక్ వుకుసిక్ (Zach Vukusic) క్రొయేషియా జాతీయ పురుషుల క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. తద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో కెప్టెన్‌గా ఎంపికైన అతి చిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు.
కెప్టెన్‌గా ఎంపికైన రోజే (ఆగస్ట్ 7, 2025) సైప్రస్‌పై విజయం సాధించి జాక్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అతి పిన్న వయసులో అంతర్జాతీయ విజయం సాధించిన కెప్టెన్‌గా రికార్డుల్లోకెక్కాడు. బ్యాటింగ్ ఆల్‌రౌండర్ అయిన జాక్.. 2007, సెప్టెంబర్ 30న జన్మించాడు.
జాక్ క్రొయేషియా తరఫున 6 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడి 139 స్ట్రయిక్‌రేట్‌తో 197 పరుగులు చేశాడు. అలాగే బౌలింగ్‌లో 3 వికెట్లు తీశాడు. జాక్ ఇంగ్లండ్‌లో సోమర్‌సెట్ కౌంటీ అకాడమీకి కూడా ఆడుతున్నాడు. ఇటీవలే అతను ఇంగ్లండ్ స్టార్ పేసర్ డేవిడ్ విల్లే బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాది వార్తల్లో నిలిచాడు.
జాక్ ఫ్రాన్స్ ఆటగాడు నొమాన్ అంజాద్ (18 ఏళ్ల 24 రోజులు) రికార్డును అధిగమించి అంతర్జాతీయ క్రికెట్‌లో అతి పిన్న వయస్కుడైన కెప్టెన్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు.