టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్ నుంచి బంగ్లాదేశ్ తప్పుకోవడం దాదాపుగా ఖాయమైనట్లే కనిపిస్తోంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) మాటను లెక్కచేయకుండా పంతానికి పోయినందుకు బంగ్లా టోర్నీలో ఆడే అవకాశం కోల్పోవడం లాంఛనమే అనిపిస్తోంది. కాగా భారత్- బంగ్లాదేశ్ మధ్య గత కొంతకాలంగా దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే.
ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు
గతంలో తమకు చేదోడువాదోడుగా నిలిచిన భారత్‌పై కొంతమంది బంగ్లాదేశ్ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం.. బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై వరుస దాడులు ఇందుకు ప్రధాన కారణం అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే ఐపీఎల్ నుంచి బంగ్లాదేశ్ ఫాస్ట్‌బౌలర్ ముస్తాఫిజుర్ రహమాన్‌ను బీసీసీఐ తప్పించింది.
ఐసీసీ మాట వినని బీసీబీ
ఈ విషయాన్ని సాకుగా చూపుతూ టీ20 ప్రపంచకప్-2026లో భారత్‌లో తమ మ్యాచ్‌లు ఆడబోడమంటూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) రచ్చకెక్కింది. తమ ఆటగాళ్లకు అక్కడ భద్రత ఉండదంటూ కొత్తగా రాగం ఎత్తుకుంది. తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని కోరగా.. ఐసీసీ ఇందుకు నిరాకరించింది.
ఈ క్రమంలో ఐసీసీ తమ పట్ల న్యాయంగా వ్యవహరించాలని.. ఏదేమైనా తాము భారత్‌లో ఆడబోమని బంగ్లాదేశ్ గురువారమే తన నిర్ణయాన్ని స్పష్టం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ అతుల్ వాసన్ బీసీబీకి ఓ సలహా ఇచ్చాడు.

మీ కెప్టెన్ ఓ హిందువు
వార్తా సంస్థ ANIతో మాట్లాడుతూ.. ‘‘నిజంగా ఐసీసీకి ఇదొక పీడకలలాంటిది. చాన్నాళ్ల క్రితమే టీ20 ప్రపంచకప్ టోర్నీ నిర్వహణకు ఏర్పాట్లు జరిగాయి. టోర్నీ ఆరంభానికి సమయం కూడా ఆసన్నమైంది. ఇలాంటి పరిస్థితుల్లో బంగ్లాదేశ్ ఇలా చేయడం సరికాదు.
భారత్‌లో భద్రతా పరమైన ఇబ్బందులు ఉంటాయని నేను అనుకోను. అసలు ఇక్కడ గతంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. ఇక్కడ సెక్యూరిటీకి వచ్చిన ఇబ్బంది ఏమీలేదు. మీ కెప్టెన్ (Litton Das) ఓ హిందువు.
ఈ విషయాన్ని బంగ్లాదేశ్ తమకు సానుకూలంగా మలచుకోవచ్చే. టోర్నీలో పాల్గొనడం ద్వారా ప్రస్తుతం ఇరుదేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతలను తగ్గించుకునే ప్రయత్నం చేయవచ్చు’’ అని అతుల్ వాసన్ బంగ్లాదేశ్‌కు హితవు పలికాడు. కాగా భారత్- శ్రీలంక వేదికలుగా ఫిబ్రవరి 7- మార్చి 8 వరకు వరల్డ్‌కప్ టోర్నీ జరుగనుంది.
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి బంగ్లాదేశ్ జట్టు
లిట్టన్ దాస్ (కెప్టెన్), మహ్మద్ సైఫ్ హసన్, తాంజిద్ హసన్ తమీమ్, పర్వేజ్ హొస్సేన్ ఇమోన్, తౌహిద్ హృదోయ్, షమీమ్ హొస్సేన్, నూరుల్ హసన్ సోహన్, మెహదీ హసన్, రిషద్ హొస్సేన్, నసుమ్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహమాన్, తాంజిమ్ హసన్ సకీబ్, టస్కిన్ అహ్మద్, మహ్మద్ షైపుద్దీన్, షోరిఫుల్ ఇస్లాం.
చదవండి: భారత్‌కు మాత్రమే అవకాశం ఇస్తారా?: బంగ్లాదేశ్ ఆరోపణలు


