బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) తీరు మారలేదు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం తాము భారత్‌లో టీ20 ప్రపంచకప్-2026 మ్యాచ్‌లు ఆడబోమని గురువారం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో బీసీబీ అధ్యక్షుడు అమీనుల్ ఇస్లామ్ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC)ని విమర్శించాడు. ఐసీసీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందనేలా ఆరోపణలు చేశాడు.
భద్రతాపరమైన కారణాలతో వేదికలు మార్చడం గతంలో చాలాసార్లు జరిగిందని, ఇటీవల చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లన్నింటినీ దుబాయ్‌లోనే ఆడేలా భారత్‌కు అనుమతి ఇచ్చారని బీసీబీ అధ్యక్షుడు అమీనుల్ ఇస్లామ్ గుర్తు చేశాడు.
పాక్‌లో ఆడబోమని భారత్ చెబితే..
‘ఐసీసీ ఎప్పుడో 1996, 2003లో జట్లు కొన్ని వేదికల్లో ఆడటానికి ఇష్టపడక పాయింట్లు చేజార్చుకున్న విషయాన్ని గుర్తు చేస్తోంది. ఎప్పటి మాటలో ఎందుకు?
2025 చాంపియన్స్ ట్రోఫీని పాకిస్తాన్‌లో ఆడబోమని భారత్ చెబితే వారి మ్యాచ్‌లను తరలించలేదా? అన్ని మ్యాచ్‌లు ఒకే వేదికపై ఆడి, ఒకే హోటల్‌లో జట్టు బస చేయడం వారికి కల్పించిన ప్రత్యేక సౌకర్యం కాదా?
మేం పోరాడతాం
శ్రీలంక పేరుకే సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తోంది కానీ ఒక జట్టు కోసమే (పాకిస్తాన్) హైబ్రిడ్ మోడల్‌లో మ్యాచ్‌లు అక్కడ పెట్టారు. ఐసీసీ స్థాయి సంస్థ 24 గంటల గడువు ఇవ్వడం అనేది అర్థరహితం. ఈ విషయంలో మేం పోరాడతాం’ అని అమీనుల్ స్పష్టం చేశాడు. కాగా గతంలో పాకిస్తాన్‌లో శ్రీలంక క్రికెటర్లపై ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత విదేశీ జట్లు అక్కడ పర్యటించడం మానేశాయి.
పాక్‌లో పరిస్థితి వేరు.. వితండవాదం
ఇటీవలి కాలంలో మళ్లీ పర్యటనలు మొదలుపెట్టాయి. అయితే, బీసీసీఐ మాత్రం భద్రతా కారణాలతో టీమిండియాను అక్కడకు పంపడం లేదు. అందుకే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నీకి తటస్థ వేదికను ఏర్పాటు చేసింది. ఇప్పుడు టీ20 ప్రపంచకప్ టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇస్తున్నందున శ్రీలంకలో పాక్ మ్యాచ్‌లు ఆడిస్తోంది.
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు ముదిరిన నేపథ్యంలో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, భారత్‌లో బంగ్లాదేశ్ క్రికెటర్లకు ఏమాత్రం ముప్పులేదని పరిశీలన బృందం చెప్పినా బంగ్లాదేశ్ ఇలా వితండవాదానికి దిగడం గమనార్హం.
లాంఛనమే
కాగా టీ20 వరల్డ్ కప్‌నుంచి బంగ్లాదేశ్ తప్పుకోవడం ఇక లాంఛనంగానే కనిపిస్తోంది! ఒకరోజు సమయమిచ్చి తుది నిర్ణయం తీసుకోవాలంటూ ఐసీసీ చేసిన హెచ్చరికను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు పట్టించుకోలేదు.
భద్రతా కారణాల వల్ల తాము భారత్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ వరల్డ్ కప్ మ్యాచ్‌లు ఆడబోమని బంగ్లాదేశ్ క్రీడా సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ పునరుద్ఘాటించారు.
‘ఇది మా దేశ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అని స్పష్టంగా చెప్పదల్చుకున్నాం. భద్రత విషయంలో మా భయం వాస్తవం. ఐసీసీ నుంచి మాకు ఇప్పటి వరకైతే న్యాయం దక్కలేదు. మా ఆందోళనను వారు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా’ అని నజ్రుల్ వ్యాఖ్యానించాడు.
చదవండి: వరల్డ్‌కప్-2027లో అతడిని ఆడించాలి: భారత మాజీ క్రికెటర్


