
మేనేజ్‌మెంట్‌పై మాజీ క్రికెటర్ విమర్శలు
టీమిండియా యాజమాన్యం తీరును భారత మాజీ క్రికెటర్ దొడ్డ గణేశ్ (Dodda Ganesh) విమర్శించాడు. నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) విషయంలో మేనేజ్‌మెంట్ వైఖరి ఏమిటో అర్థం కావడం లేదన్నాడు. అతడికి బౌలింగ్ చేసే అవకాశమే ఇవ్వనపుడు ఆల్‌రౌండర్‌గా ఎలా తీర్చిదిద్దుతారని ప్రశ్నించాడు.
నాలుగు ఓవర్లు మాత్రమే
గాయం కారణంగా ఇంగ్లండ్ పర్యటన మధ్యలోనే జట్టుకు దూరమైన ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి.. తాజాగా వెస్టిండీస్‌తో టెస్టులతో పునరాగమనం చేశాడు. అహ్మదాబాద్‌లో తొలి టెస్టు తుదిజట్టులో చోటు దక్కించుకున్న 22 ఏళ్ల ఈ సీమ్ బౌలింగ్ ఆల్‌రౌండర్.. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం నాలుగు ఓవర్లు మాత్రమే వేశాడు.
మొత్తంగా పదహారు పరుగులు ఇచ్చి ఒక వికెట్ కూడా తీయని నితీశ్ రెడ్డి.. రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌కే రాలేదు. అంతేకాదు.. ఈ మ్యాచ్‌లో అతడికి బ్యాటింగ్ చేసే అవకాశం కూడా రాలేదు. ఇక తాజాగా ఢిల్లీ వేదికగా రెండో టెస్టులో బ్యాటింగ్ చేసిన నితీశ్ రెడ్డి.. రెండు ఇన్నింగ్స్‌లోనూ అసలు బౌలింగ్‌కే రాలేదు.
54 బంతుల్లో 43 పరుగులు
టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన నితీశ్ రెడ్డి.. 54 బంతుల్లో 43 పరుగులు చేసి నిష్క్రమించాడు. అయితే, బౌలర్‌గా మాత్రం అతడు రంగంలోకి దిగలేదు. ఇక విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనింగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్‌తోనూ ఓ ఓవర్ వేయించిన మేనేజ్‌మెంట్ నితీశ్ సేవలు మాత్రం వాడుకోలేదు.
నితీశ్ రెడ్డి జట్టులో ఎందుకు?.. ఆల్‌రౌండర్ అంటే ఇదేనా?
ఈ నేపథ్యంలో కర్ణాటక మాజీ ఆటగాడు దొడ్డ గణేష్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. ‘‘నితీశ్ రెడ్డికి అసలు బౌలింగ్ చేసే అవకాశం ఇవ్వకుండానే అతడిని ఆల్‌రౌండర్‌గా ఎలా సన్నద్ధం చేస్తున్నారు?.. ఇలా అయితే ఆల్‌రౌండర్ పాత్రకు తను ఎలా న్యాయం చేయగలడు’’ అని మేనేజ్‌మెంట్ తీరును విమర్శించాడు.
ఆల్‌రౌండర్‌గా తీర్చిదిద్దడమే మా లక్ష్యం
ఇదిలా ఉంటే.. నితీశ్ సేవలను ఉపయోగించుకునే విషయంలో విమర్శలు రాగా.. వెస్టిండీస్ రెండో టెస్టుకు ముందు అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డష్కాటే స్పందించిన విషయం తెలిసిందే
‘‘బ్యాటింగ్ చేయగల అరుదైన సీమ్ బౌలర్. అతడి నైపుణ్యాల విషయంలో ఎలాంటి సందేహాలు లేవు. తన బ్యాటింగ్ ఎలా ఉంటుందో ఆస్ట్రేలియాలో (సెంచరీ) చూపించాడు. అయితే, విదేశీ గడ్డ మీదే తన సేవలు ఎక్కువగా ఉపయోగించుకుంటాం. తనను పూర్తిస్థాయి ఆల్‌రౌండర్‌గా తీర్చిదిద్దడమే మా లక్ష్యం’’ అని డష్కాటే స్పష్టం చేశాడు.
పోరాట పటిమ కనబరిచిన విండీస్
ఇక మ్యాచ్ విషయానికొస్తే... ఢిల్లీలో శుక్రవారం మొదలైన టెస్టులో టాస్ గెలిచిన తొలుత బ్యాటింగ్ చేసింది భారత్. యశస్వి జైస్వాల్ (175), కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (129 నాటౌట్) శతక్కొట్టగా.. సాయి సుదర్శన్ 87 పరుగులు సాధించాడు.
కేఎల్ రాహుల్ (38) విఫలం కాగా.. నితీశ్ రెడ్డి 43, ధ్రువ్ జురెల్ 44 పరుగులు చేశారు. ఫలితంగా 134.2 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 518 పరుగుల వద్ద ఉన్న వేళ టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.
అనంతరం విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 248 పరుగులకు కుప్పకూలగా.. భారత్ ఫాలో ఆన్ ఆడించింది. అయితే, రెండో ఇన్నింగ్స్ విండీస్ బ్యాటర్లు అద్భుత పోరాటం చేసి.. టీమిండియాకు 121 పరుగుల టార్గెట్ ఇచ్చారు. ఓపెనర్ జాన్ క్యాంప్‌బెల్ (115), షాయీ హోప్ 103 పరుగులతో రాణించగా.. ఆఖర్లో జస్టిన్ గ్రీవ్స్ (50 నాటౌట్) పట్టుదలగా నిలబడటంతో విండీస్‌కు ఇన్నింగ్స్ పరాజయం తప్పింది.
చదవండి: World Cup 2025: వరుస ఓటములు.. భారత్ సెమీ ఫైనల్ చేరాలంటే...