క్రికెట్‌ ఫీవర్‌.. వరల్డ్‌కప్‌లో టీమిండియాకు మద్దతుగా డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్‌ స్టార్‌

WWE Superstar Drew McIntyre Is Supporting India In 2023 World Cup - Sakshi

వన్డే వరల్డ్‌కప్‌ ఫీవర్‌ డబ్ల్యూడబ్ల్యూఈ (World Wrestling Entertainment)ని తాకింది. డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్‌ స్టార్‌ ఒకరు టీమిండియాకు మద్దతుగా నిలిచారు. తాజాగా జరిగిన ఓ ఎపిసోడ్‌లో స్టార్‌ రెజ్లర్‌ డ్రూ మెక్‌ఇన్‌టైర్‌ (Drew McIntyr) టీమిండియా జెర్సీ ధరించి రింగ్‌లోకి దిగాడు. ఈ పిక్‌ ప్రస్తుతం​ సోషల్‌మీడియాలో వైరలవుతుంది. భారత క్రికెట్‌ అభిమానులు తమ జట్టు జెర్సీని ధరించిన డ్రూ మెక్‌ఇన్‌టైర్‌ను చూసి మురిసిపోతున్నారు.

అప్పటివరకు జాన్‌ సీనా, ద రాక్‌ లాంటి పాశ్యాత్య దేశ రెజ్లర్లకు అభిమానులుగా ఉన్న భారతీయులు డ్రూ మెక్‌ఇన్‌టైర్‌ తాజా చర్య తర్వాత అతని అభిమానులుగా మారిపోయారు. డబ్ల్యూడబ్ల్యూఈలో ఒక్కసారిగా మెక్‌ఇన్‌టైర్‌కు క్రేజ్‌ పెరిగిపోయింది. సోషల్‌మీడియాలో అతన్ని ఫాలో అయ్యే భారతీయుల సంఖ్య ఒక్కసారిగా రెండింతలయ్యింది. డ్రూ మెక్‌ఇన్‌టైర్ ఇటీవల భారత్‌లో పర్యటించినప్పడు కూడా ఇక్కడి వారిని ఆకట్టుకున్నాడు.

కొద్ది రోజుల కిందట ఓ ఈవెంట్‌ కోసం హైదరాబాద్‌కు వచ్చిన మెక్‌ఇన్‌టైర్‌ భారతీయులతో మమేకమైపోయాడు. స్టార్‌ ఇమేజ్‌ కలిగిన మెక్‌ఇన్‌టైర్ హైదరాబాద్‌ నగర వీధుల్లో సాధారణ వ్యక్తిలా తిరుగుతూ భారతీయులకు, ముఖ్యంగా హైదరాబాదీలకు బాగా చేరువయ్యాడు. తాజా చర్యతో (వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియాకు మద్దతుగా భారత జెర్సీ ధరించడం​)‌ అతను భారతీయులకు మరింత దగ్గరయ్యాడు. 38 ఏళ్ల మెక్‌ఇన్‌టైర్‌ స్కాట్లాండ్‌కు చెందిన ప్రొఫెషనల్‌ రెజ్లర్‌ అన్న విషయం తెలిసిందే. 

ఇదిలా ఉంటే, వన్డే వరల్డ్‌కప్‌ 2023 భారత్‌ వేదికగా అక్టోబర్‌ 5 నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ఇంగ్లండ్‌-గత ఎడిషన్‌ రన్నరప్‌ న్యూజిలాండ్‌ మధ్య మ్యాచ్‌తో మెగా టోర్నీ ప్రారంభంకానుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదిక కానుంది. ఈ టోర్నీలో భారత్‌ తమ తొలి మ్యాచ్‌ను అక్టోబర్‌ 8న ఆస్ట్రేలియాతో ఆడుతుంది. టీమిండియా తమ చిరకాల ప్రత్యర్ధి పాక్‌ను అక్టోబర్‌ 14న నరేంద్ర మోదీ స్టేడియంలో ఢీకొంటుంది. నవంబర్‌ 19న జరిగే ఫైనల్‌తో మెగా టోర్నీ ముగుస్తుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top