
బుడాపెస్ట్ (హంగేరి): పొలియాక్ ఇమ్రె–వర్గా యానోస్ స్మారక అంతర్జాతీయ ర్యాంకింగ్ రెజ్లింగ్ టోర్నమెంట్‌లో భారత్‌కు తొలి రోజు రెండు పతకాలు లభించాయి. పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో సుజీత్ (65 కేజీలు) స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకోగా... రాహుల్ (57 కేజీలు) కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. ఫైనల్లో సుజీత్ 5–1 పాయింట్ల తేడాతో అలీ రహీమ్‌జాదే (అజర్‌బైజాన్)పై గెలుపొందాడు.
అంతకుముందు సెమీఫైనల్లో సుజీత్ 6–1తో వాజ్‌జెన్ తెవాన్‌యాన్ (అర్మేనియా)పై, క్వార్టర్ ఫైనల్లో 11–0తో అర్సమెర్‌జుయెవ్ (ఫ్రాన్స్)పై, తొలి రౌండ్‌లో 11–0తో ఇస్లాం దుదయెవ్ (అల్బేనియా)పై విజయం సాధించాడు. కాంస్య పతక బౌట్‌లో రాహుల్ 4–0తో నిక్లాస్ స్టెచెలె (జర్మనీ)పై నెగ్గాడు. అంతకుముందు సెమీఫైనల్లో రాహుల్ 6–7 పాయింట్ల తేడాతో ల్యూక్ జోసెఫ్ (అమెరికా) చేతిలో ఓడిపోయాడు.