ఈ నెల 27న డబ్ల్యూపీఎల్ వేలం
అందరి చూపు దీప్తి వైపు
న్యూఢిల్లీ: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2026వ సీజన్‌కు సంబంధించిన వేలం ఈ నెల 27న జరగనుంది. ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచిన టీమిండియా స్పిన్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మతో పాటు... హర్లీన్ డియోల్, ప్రతీక రావల్, పూజ వస్త్రకర్, ఉమా ఛెత్రీ, క్రాంతి గౌడ్ వంటి భారత ఆటగాళ్లతో పాటు పలువులు అంతర్జాతీయ ప్లేయర్లు వేలం బరిలో ఉన్నారు. అ
టు బౌలింగ్ ఇటు బ్యాటింగ్‌లో సత్తాచాటే దీప్తి కోసం ఫ్రాంచైజీలు పోటీ పడే అవకాశాలున్నాయి. మొత్తం 5 ఫ్రాంచైజీలు కలిసి ఈ వేలంలో రూ. 41.1 కోట్లు ఖర్చు చేయనున్నాయి. ఖాళీగా ఉన్న 73 స్థానాల కోసం మొత్తం 277 మంది ప్లేయర్లు పోటీపడుతున్నారు. ఇందులో 194 మంది భారత ప్లేయర్లు ఉన్నారు. వారిలో 52 మంది క్యాప్డ్ ప్లేయర్స్ కాగా... 142 మంది అన్‌క్యాప్డ్ ప్లేయర్లు. ఇక విదేశాల నుంచి 83 మంది పోటీ పడుతున్నారు.
ఇందులో 66 మంది క్యాప్డ్ ప్లేయర్లు కాగా... 17 మంది అన్ క్యాప్డ్ ప్లేయర్లు. గరిష్ట ప్రారంభ ధర రూ. 50 లక్షలు కాగా... ఇందులో 19 మంది ప్లేయర్లు ఉన్నారు. దీప్తి, హర్లీన్, ప్రతీక, పూజ, ఉమ, క్రాంతితో పాటు సోఫీ డివైన్, అమేలియా కెర్ (న్యూజిలాండ్), సోఫీ ఎకిల్‌స్టోన్ (ఇంగ్లండ్), అలీసా హీలీ, మెగ్ లానింగ్ (ఆ్రస్టేలియా) కూడా తమ ప్రాథమిక ధరను రూ. 50 లక్షలుగా నిర్ణయించుకున్నారు.
రూ. 40 లక్షల ప్రారంభ ధరతో 11 మంది, రూ. 30 లక్షల ప్రారంభ ధరతో 88 మంది ప్లేయర్లు వేలానికి రానున్నారు. ‘వేలంలో 194 మంది భారత ప్లేయర్లు ఉన్నారు. 50 స్థానాల కోసం వీరు పోటీ పడుతున్నారు. 23 విదేశీ స్థానాల కోసం 83 మంది పోటీలో ఉన్నారు’ అని బీసీసీఐ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.


