రేపే భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన వివాహం
డీవై పాటిల్ స్టేడియం మధ్యలో స్మృతికి ప్రపోజ్ చేసిన పలాశ్
కాబోయే జంటకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్ తొలిసారి విజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించిన వైస్ కెప్టెన్, స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన మనసిచ్చిన వాడితో రేపు మనువాడబోతోంది. ఇన్నేళ్లుగా ఒకలా రేపటి రోజు ఒకలా స్మృతి కనిపించబోతోంది. జట్టు జెర్సీతో మైదానంలో ప్యాడ్లు, గ్లౌజ్‌లు, క్యాప్‌తో ఓపెనర్‌గా క్రీజులోకి వచ్చే ఆమె... రేపు మాత్రం అరుదైన డిజైనర్ లెహెంగా, నుదుటన పాపిట బిళ్ల, బుగ్గన చుక్క, మోచేతుల దాకా గాజులు, అరచేతి నిండా పండిన గోరింటాకు, కాళ్లకు పారాణితో వధువులా ముస్తాబై కమనీయ కళ్యాణ వేదికకు రానుంది.
మధ్యప్రదేశ్‌కు చెందిన సంగీత దర్శకుడు, డైరెక్టర్ పలాశ్ ముచ్చల్‌తో స్మృతి కొన్నాళ్లుగా ప్రేమాయణం నడుపుతోంది. వీరిద్దరు త్వరలోనే ఒక్కటవుతారనే వార్తలు నెట్టింట తెగ షికార్లు చేశాయి. ప్రపంచకప్ తర్వాత ముహూర్తం ఖాయమనే ముచ్చట్లూ వినిపించాయి. చివరకు అన్నట్లే ప్రపంచకప్ ముగిసిన వెంటనే స్మృతి ఇంట పెళ్లి బాజా మోగనుంది.
తన హోటల్ ‘ఎస్‌ఎం 18’ (స్మృతి మంధాన 18 జెర్సీ నంబర్)లో భారత జట్టు సహచరుల సందడితో పెళ్లి కోలాహలం ఎప్పుడో మొదలైంది. హల్దీ, మెహందీ వేడుకల్లో సహచరుల చిందులు, చిలిపి అల్లర్లు నెట్టింట కనువిందు చేస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలతో పాటు డీవై పాటిల్ స్టేడియం మధ్యలో స్మృతి కళ్లకు గంతలు కట్టి పలాశ్ పిచ్ వద్దకు తొడ్కొని రావడంతోపాటు మోకాళ్లపై కూర్చోని ఆమెకు చేసిన పెళ్లి ప్రతిపాదన వీడియో కూడా నెట్టింట క్రికెట్ అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఏకంగా 19 లక్షలు లైక్‌లు, 12 వేలపైచిలుకు కామెంట్లు, లెక్కలేనన్ని శుభాకాంక్షలు ఇన్‌స్టాలో వెల్లువెత్తాయి. ‘ఎక్స్’లో ప్రధాని నరేంద్ర మోదీ కాబోయే జంట స్మృతి మంధాన, పలాశ్‌లకు ఆశీర్వదిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.


