హసన్, షాద్‌మన్ హాఫ్ సెంచరీలు
ఐర్లాండ్‌తో రెండో టెస్టు
మిర్పూర్: సొంతగడ్డపై ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతున్న బంగ్లాదేశ్ జట్టు... ఐర్లాండ్‌తో రెండో టెస్టులో భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 37 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 156 పరుగులు చేసింది. ఓపెనర్లు మహ్ముదుల్ హసన్ జాయ్ (91 బంతుల్లో 60; 6 ఫోర్లు), షాద్‌మన్ ఇస్లామ్ (110 బంతుల్లో 69 బ్యాటింగ్; 5 ఫోర్లు) హాఫ్‌సెంచరీలతో రాణించారు. ఐర్లాండ్ బౌలర్లలో గావిన్ హోయ్ ఒక వికెట్ పడగొట్టాడు.
నేడు ఆటకు నాలుగో రోజు కాగా... చేతిలో 9 వికెట్లు ఉన్న బంగ్లాదేశ్... ప్రస్తుతం 367 పరుగుల ఆధిక్యంలో ఉంది. షాద్‌మన్‌తో పాటు మోమినుల్ హక్ (19 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. అంతకుముందు 98/5తో శుక్రవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఐర్లాండ్ జట్టు... 88.3 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌటైంది. వికెట్ కీపర్ టకర్ (171 బంతుల్లో 75 నాటౌట్; 7 ఫోర్లు) అజేయ అర్ధశతకంతో ఆకట్టుకోగా... జోర్డన్ నీల్ (83 బంతుల్లో 49; 9 ఫోర్లు), స్టీఫెన్ (77 బంతుల్లో 46; 4 ఫోర్లు) చక్కటి పోరాటం కనబర్చారు.
బంగ్లా బౌలర్లలో తైజుల్ ఇస్లామ్ 4 వికెట్లు పడగొట్టగా... ఖాలెద్ అహ్మద్, హసన్ మురాద్ చెరో 2 వికెట్లు తీశారు. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 476 పరుగుల భారీ స్కోరు చేయడంతో... ఆ జట్టుకు 211 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. మ్యాచ్ జరుగుతన్న సమయంలో ఉదయం సెషన్‌లో భూప్రకంపనలు రావడంతో కొన్ని నిమిషాలపాటు ఆటను నిలిపి వేశారు.


