తీవ్ర ఒత్తిడిలో భారత్
అమితోత్సాహంతో దక్షిణాఫ్రికా
నేటి నుంచి రెండో టెస్టు
గిల్ అవుట్, కెప్టెన్‌గా పంత్
ఉదయం 9 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం
పుష్కర కాలం పాటు సొంతగడ్డపై ఆడిన ప్రతీ టెస్టు సిరీస్ గెలిచిన భారత్ ఇప్పుడు ఏడాది వ్యవధిలో రెండో సిరీస్‌ను చేజార్చుకునే ప్రమాదంలో పడింది. తొలి టెస్టులో దక్షిణాఫ్రికా చేతిలో అనూహ్యంగా ఓడిన జట్టు సిరీస్ గెలుచుకునే అవకాశం లేకపోగా, ఇప్పుడు దానిని కాపాడుకునే ప్రయత్నంలో బరిలోకి దిగుతోంది. కోల్‌కతా పిచ్ మనకు పూర్తి ప్రతికూలంగా మారి చర్చకు దారి తీసిన నేపథ్యంలో... ఈసారి ఎలాంటి పిచ్ భారత్‌కు అనుకూలిస్తుందో చెప్పలేని పరిస్థితి ఉంది.
మరోవైపు పదిహేనేళ్ల తర్వాత భారత గడ్డపై టెస్టు మ్యాచ్ గెలిచిన వరల్డ్ చాంపియన్ దక్షిణాఫ్రికా అదే ఉత్సాహంతో మరోసారి తమ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చి పైచేయి సాధించాలని భావిస్తోంది. ఇలాంటి స్థితిలో రెండో టెస్టు ఎంత హోరాహోరీగా సాగుతుందనేది ఆసక్తికరం.
గువాహటి: భారత్, దక్షిణాఫ్రికా మధ్య సిరీస్ ఫలితాన్ని తేల్చే రెండో టెస్టు మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. మూడు రోజుల్లోపే ముగిసిన తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా అనూహ్య విజయం సాధించగా, ఇప్పుడు దానికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది.
గత టెస్టులో మెడ నొప్పితో అర్ధాంతరంగా తప్పుకున్న శుబ్‌మన్ గిల్ ఈ మ్యాచ్‌కు దూరం కావడంతో రిషబ్ పంత్ తొలిసారి జట్టు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. పక్కటెముకల గాయంతో తొలి టెస్టు ఆడని దక్షిణాఫ్రికా పేసర్ రబడ ఇంకా కోలుకోకపోవడంతో ఈ మ్యాచ్ నుంచి కూడా తప్పుకున్నాడు. చివరిసారి దక్షిణాఫ్రికా 2000లో భారత గడ్డపై టెస్టు సిరీస్ గెలుచుకుంది.
సుదర్శన్‌కు అవకాశం!
గత టెస్టు రెండు ఇన్నింగ్స్‌లలో మన బ్యాటర్లెవరూ కనీసం అర్ధసెంచరీ కూడా నమోదు చేయలేకపోయారు. ఆ వైఫల్యాన్ని దాటి ఓపెనర్లు జైస్వాల్, రాహుల్ శుభారంభం ఇవ్వాల్సి ఉంది. గిల్ గాయం కారణంగా ఒక తప్పనిసరి మార్పుతో జట్టు బరిలోకి దిగనుంది. గిల్ స్థానంలో వచ్చే సాయి సుదర్శన్ ఎలాంటి ప్రభావం చూపిస్తాడనేది చెప్పలేం.
ధ్రువ్ జురేల్ మరింత జాగ్రత్తగా ఆడాల్సి ఉండగా, ఇప్పుడు కొత్తగా కెప్టెన్సీతో పంత్‌పై బాధ్యత మరింత పెరిగింది. అతని ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగితే భారత్ పటిష్ట స్థితికి చేరుతుంది. జడేజా, సుందర్‌ల బ్యాటింగ్ మరోసారి కీలకం కానుంది. పేసర్లుగా బుమ్రా, సిరాజ్ ఖాయం కాగా, పిచ్‌ను బట్టి మూడో పేసర్‌కు అవకాశం దక్కవచ్చు.
అదే మేనేజ్‌మెంట్ ఆలోచన అయితే నితీశ్ కుమార్ రెడ్డి తుది జట్టులోకి వస్తాడు. ఈడెన్‌లో నలుగురు స్పిన్నర్లతో ఆడి విమర్శలపాలైన జట్టు నితీశ్‌ను ఆడిస్తే అక్షర్‌ను పక్కన పెట్టవచ్చు. ఆఫ్ స్పిన్నర్ హార్మర్ చెలరేగుతున్న నేపథ్యంలో ఆరుగురు లెఫ్ట్ హ్యాండర్లతో ఆడటం మరింత ఇబ్బందికరం అనుకుంటే కూడా నితీశ్‌కు చాన్స్ లభిస్తుంది.
బ్రెవిస్‌కు చోటు!
కోల్‌కతా టెస్టు ఘన విజయం ఇచ్చిన జోష్‌తో దక్షిణాఫ్రికా బరిలోకి దిగుతోంది. బ్యాటింగ్‌లో ఆ జట్టు తడబడినా బౌలర్లు గెలుపును అందించారు. ఈసారి కూడా హార్మర్, మహరాజ్ కీలకం కానున్నారు. పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తే వీరిద్దరు చెలరేగిపోగలరు. అవసరమైతే మూడో స్పిన్నర్‌గా ముత్తుసామిని కూడా ఆడించాలని టీమ్ భావిస్తోంది.
తొలి మ్యాచ్‌లో ప్రభావం చూపలేకపోయిన ముల్డర్ స్థానంలో అతనికి స్థానం దక్కవచ్చు. పిచ్ స్పిన్‌కు అనుకూలంగా లేకపోతే ముల్డర్ స్థానంలో మరో బ్యాటర్ బ్రెవిస్‌కు చాన్స్ దక్కవచ్చు. దూకుడుగా ఆడే బ్రెవిస్ కొద్ది సేపట్లోనే ఆట గమనాన్ని మార్చగల సమర్థుడు.
జట్టు బ్యాటింగ్‌కు మరోసారి కెప్టెన్ బవుమా మూల స్థంభంలా ఉన్నాడు. ఇతర బ్యాటర్ల నుంచి అతనికి తగినంత సహకారం కావాలి. రికెల్టన్, జోర్జిలకు తగినంత అనుభవం లేకపోగా... ఓపెనర్‌గా మార్క్‌రమ్ రాణించడం జట్టుకు అవసరం. పేసర్లు యాన్సెన్, బాష్ కూడా భారత్‌పై ప్రభావం చూపించగలరు.
గువాహటిలో తొలి టెస్టు
భారత్‌లో టెస్టు మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న 30వ వేదికగా గువాహటి నిలుస్తోంది. ఇక్కడి బర్సపర స్టేడియంలో ఇప్పటి వరకు 2 వన్డేలు, 4 టి20లతో పాటు ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగాయి. ఇటీవల మహిళల వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా ఐదు మ్యాచ్‌లకు ఈ మైదానం ఆతిథ్యం ఇచ్చింది. బర్సపరలో కొత్త మైదానం ప్రారంభానికి ముందు 1983 నుంచే గువాహటి నెహ్రూ స్టేడియంలో వన్డేలు జరిగాయి.
ముందు టీ విరామం, ఆ తర్వాత లంచ్...
ఈశాన్య రాష్ట్రం అసోంలోని వాతావరణ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని టెస్టు మ్యాచ్ సమయాల్లో స్వల్ప మార్పు చేశారు. ఇక్కడ సాయంత్రం తొందరగా చీకటి పడిపోతుంది. దాంతో మ్యాచ్‌ను ఉదయం 9 గంటల నుంచి మొదలుపడుతున్నారు. తొలి సెషన్ తర్వాత 11 గంటలకు టీ విరామం ఇస్తారు. 1:20కి లంచ్ బ్రేక్ అవుతుంది. సాయంత్రం 4 గంటలకు ఆట ముగుస్తుంది.
ఒకటే మ్యాచ్‌కు కెప్టెన్‌గా అంటే చేసేదేముంటుంది. అయితే దేశానికి నాయకత్వం వహించడం అంటే గర్వపడాల్సిన క్షణం. నాకు అవకాశం ఇచ్చిన బీసీసీఐకి కృతజ్ఞతలు. వ్యూహాల్లో కెప్టెన్‌గా సాంప్రదాయ శైలిని అనుసరించడంతో పాటు కొత్త తరహాలో కూడా ఆలోచిస్తాను. ఆటగాళ్లకు స్వేచ్ఛనిస్తూనే జట్టు కోసం సరైన నిర్ణయాలు తీసుకోగలననే నమ్మకం ఉంది. –రిషభ్ పంత్, భారత జట్టు 38వ టెస్టు కెప్టెన్
పిచ్, వాతావరణం
కోల్‌కతాతో పోలిస్తే మెరుగైన పిచ్ అని అందరూ అంగీకరించారు. ఆరంభంలో బౌన్స్, బ్యాటింగ్‌కు అనుకూలిస్తూ ఆ తర్వాత స్పిన్ ప్రభావం కనిపించవచ్చు. అయితే ఇక్కడ తొలి టెస్టు కాబట్టి ఎవరికీ స్పష్టత లేదు. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం లేదు.
తుది జట్ల వివరాలు (అంచనా)
భారత్: పంత్ (కెప్టెన్), జైస్వాల్, రాహుల్, సుదర్శన్, జురేల్, జడేజా, సుందర్, అక్షర్/నితీశ్, కుల్దీప్, బుమ్రా, సిరాజ్.
దక్షిణాఫ్రికా: బవుమా (కెప్టెన్), మార్క్‌రమ్, రికెల్టన్, ముల్డర్/ బ్రెవిస్, జోర్జి, స్టబ్స్, వెరీన్, బాష్, యాన్సెన్, హార్మర్, మహరాజ్.


