బంగ్లాదేశ్ సీనియర్ ప్లేయర్ ముష్ఫికర్ రహీమ్ తన కెరీర్‌లో ఆడుతున్న 100వ టెస్టులో అదరగొట్టాడు. ఢాకా వేదికగా ఐర్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రహీమ్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 99 ఓవర్ నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన రహీమ్.. జోర్డాన్ నైల్ బౌలింగ్‌లో తన 13వ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.
ఈ క్రమంలో ముష్ఫికర్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో వందో మ్యాచ్‌లో శతక్కొట్టిన 11వ ఆటగాడిగా రహీమ్ రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో రికీ పాంటింగ్, హషీమ్ ఆమ్లా, గ్రేమ్ స్మిత్ వంటి దిగ్గజాలు ఉన్నారు.
వందో టెస్ట్‌లో సెంచరీ చేసిన ఆటగాళ్లు..
కొలిన్ కౌడ్రే
జావిద్ మియాందాద్
గార్డన్ గ్రీనిడ్జ్
అలెక్ స్టీవర్ట్
ఇంజమామ్ ఉల్ హక్
రికీ పాంటింగ్- రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు
గ్రేమీ స్మిత్
హషీమ్ అమ్లా
జో రూట్- వందో టెస్ట్‌లో డబుల్ సెంచరీ చేసిన తొలి ఆటగాడు
డేవిడ్ వార్నర్- వందో టెస్ట్‌లో డబుల్ సెంచరీ చేసిన రెండో ఆటగాడు
ముష్ఫికర్ రహీమ్
👉అదేవిధంగా టెస్టు క్రికెట్‌లో బంగ్లాదేశ్ తరపున అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా మొమిముల్ హక్ రికార్డును ముష్ఫికర్ సమం చేశారు. ఇద్దరూ కూడా ఇప్పటివరకు టెస్టుల్లో 13 సెంచరీలు సాధించారు.
బంగ్లాదేశ్ తరపున టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్లు..
13 - మోమిముల్ హక్, ముష్ఫికర్ రహీమ్
10 - తమీమ్ ఇక్బాల్
8 - నజ్ముల్ హొస్సేన్ శాంటో
ప్రత్యేక జ్ఞాపిక
మ్యాచ్ ఆరంభానికి ముందు జరిగిన కార్యక్రమంలో ముష్ఫికర్‌ను ప్రత్యేకంగా సన్మానించారు. 2005లో ఇంగ్లండ్‌పై లార్డ్స్ టెస్టులో 18 ఏళ్ల 17 రోజుల వయసులో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ముషి్ఫకర్... సుదీర్ఘ కెరీర్‌లో బంగ్లాదేశ్‌కు ఎన్నో మరపురాని విజయాలు అందించాడు. సచిన్ టెండూల్కర్, ఇమ్రాన్ ఖాన్ తర్వాత టెస్టుల్లో సుదీర్ఘ కెరీర్ ఉన్న ఆటగాడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ముష్ఫికర్‌కు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రత్యేక జ్ఞాపికతో సత్కరించింది.
తొలి టెస్టు ఆడిన సహచరుల సంతకాలతో కూడిన జెర్సీతో పాటు... ప్రస్తుత మ్యాచ్ ఆడుతున్న ప్లేయర్ల సంతకాలతో కూడిన జెర్సీని అతడికి బహుమతిగా అందజేశారు. దీంతో పాటు 100 అంకెతో కూడిన ప్రత్యేక టోపీని బహుకరించారు. బంగ్లాదేశ్ తరఫున వందో టెస్టు మ్యాచ్ ఆడుతున్న తొలి ప్లేయర్ కావడంతో... గతంలో అతడితో కలిసి ఆడిన ప్లేయర్లు, కుటుంబ సభ్యుల ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.


