తీర్పు వెలువరించిన బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్
మాజీ హోం మంత్రి అసదుజ్జమాన్ ఖాన్‌కూ మరణశిక్ష
విద్యార్థిసంఘాల ఉద్యమాన్ని అణిచివేసి వందల మందిని చంపేశారని ఆరోపణ
మాజీ ఐజీ చౌదరి అబ్దుల్లా అల్‌మమూన్‌కు ఐదేళ్ల శిక్ష
తీర్పును రాజకీయకుట్రగా అభివర్ణించిన పదవీచ్యుత ప్రధాని
ఢాకా/న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ విమోచన పోరాటంలో పాల్గొన్న స్వాతంత్య్రసమరయోధుల వారసులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కేటాయింపుతో మొదలైన విద్యార్థుల ఉద్యమం చివరకు పదవీచ్యుత మహిళా ప్రధాని షేక్ హసీనాకు అంతర్జాతీయ నేరాల ట్రిబ్యూనల్ మరణశిక్ష విధింపునకు దారితీసింది.
జూలై 15న విద్యార్థుల సారథ్యంలో ఉవ్వెత్తున ఎగసిన ఆందోళనలను ఉక్కుపాదంతో అణచివేసి 1,400 మంది మరణాలకు హసీనా కారణమయ్యారంటూ దాఖలైన కేసులో ఆమెకు మరణశిక్ష విధిస్తూ ట్రిబ్యునల్ సంచలన తీర్పు వెలువరిచింది.
ఈ మేరకు సోమవారం జస్టిస్ మొహమ్మద్ గులామ్ మోర్తుజా మజూందార్ సారథ్యంలోని ముగ్గురు సభ్యుల ప్రత్యేక ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. కోర్టు గతంలోనే ఆమె పారిపోయిన నేరుస్తురాలిగా ప్రకటించింది. మానవత్వానికి వ్యతిరేకంగా ఆమె నిర్దయగా ఆదేశాలు జారీచేసి భద్రతబలగాల సాయంతో ఉద్యమాన్ని అణిచివేశారని, వందల మంది మరణాలకు ప్రధాన బాధ్యురాలు అని ప్రభుత్వం అందించిన సాక్ష్యాధారాలతో రూఢీ అయిందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
‘‘ వందల మరణాలకు, ఉద్యమాన్ని అణచివేత వ్యూహాలకు కర్త, కర్మ, క్రియ హసీనాయే. ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమం చేస్తున్న విద్యార్థులపైకి ఆమెకు చెందిన పార్టీ కార్యకర్తలు విచక్షణారహితంగా దాడులకు తెగబడేలా ఆమె రెచ్చగొట్టే ప్రకటనలు ఇచ్చారు. దాడులు చేస్తున్న వారిని ఏమాత్రం కట్టడిచేయకుండా ఆమె మానవత్వానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నారు.
నిరసనబాటపట్టిన వేలాది మంది విద్యార్థులపై మారణాయుధాలు, హెలికాప్టర్లతో దాడులు చేయించారు’’ అని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. ఉద్యమకారులపై విచక్షణారహితంగా కాల్పులు జరపడం వంటి ఘటనలతో ప్రత్యక్ష సంబంధం ఉన్న నాటి హసీనా ప్రభుత్వంలో హోం మంత్రి అసదుజ్జమాన్ ఖాన్‌కు సైతం కోర్టు మరణశిక్షను ఖరారుచేసింది. మాజీ పోలీస్ ఉన్నతాధికారి, ఇన్‌స్పెక్టర్ జనరల్ చౌదరి అబ్దుల్లా అల్–మమూన్‌కు ఐదేళ్ల శిక్ష విధించింది.
ఆమెను అప్పగించాలన్న తాత్కాలిక సర్కార్
గత ఏడాది ఆగస్ట్ 5న దేశం నుంచి పారిపోయి ఢిల్లీలో ఆశ్రయం పొందుతున్న అవామీ లీగ్ పార్టీ అధినేత్రి హసీనాను తమకు అప్పగించాలని భారత్‌ను బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం కోరింది. ఈ మేరకు బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ సోమవారం ఒక ప్రకటన విడుదలచేసింది. ‘‘ భారత్‌కు పారిపోయిన హసీనా, అసదుజ్జమాన్ ఖాన్ కమాల్‌లను వెంటనే బంగ్లాదేశ్ ఉన్నతాధికారులకు అప్పగించండి. గతంలో మన రెండు శాల మధ్య కుదిరిన ద్వైపాక్షిక ఒడంబడికను గౌరవించాల్సిందే. కోర్టు తీర్పుతో దోషులుగా నిర్ధారణ అయిన ఖైదీలను మాకు భారత ప్రభుత్వం అప్పగించాలి.
దోషులు అని తేలాకకూడా వాళ్లను ఆశ్రయం కల్పించడం స్నేహపూర్వక చర్య అనిపించుకోదు. ఇలాంటి ధోరణి న్యాయబద్ధంకాదు’’ అని బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ ఆ ప్రకటనలో పేర్కొంది. ‘‘ఈ మేరకు మరోసారి భారత్‌కు అధికారికంగ లేఖ రాస్తాం. ఊచకోత కారకులకు ఇంకా ఆశ్రయం కల్పిస్తామని భారత్ మొండికేస్తే రెండుదేశాల మధ్య విరోధం పెరుగుతుంది’’ అని ప్రభుత్వ న్యాయ సలహాదారు అసిఫ్ నజ్రుల్ స్పష్టంచేశారు. దీనిపై భారత్ స్పందించింది. బంగ్లాదేశ్ ప్రజల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తామని భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదలచేసింది.
తీర్పు తర్వాత పలు చోట్ల ఘర్షణలు
తమ పార్టీ చీఫ్ హసీనాకు మరణశిక్ష ఖరారుచేస్తూ తీర్పు వెలువడటంతో అవామీ లీగ్ పార్టీ కార్యకర్తలు రెచ్చిపోయారు. దేశవ్యాప్తంగా కీలక నగరాలు, పట్టణాల్లో ఆందోళనకు దిగారు. దీంతో పలు చోట్ల ఘర్షణలు జరిగాయి. ఆపద్ధర్మ ప్రభుత్వ అనుకూల వర్గాలు సైతం రోడ్లమీదకొచ్చాయి. ఢాకాలో హసీనా తండ్రికి చెందిన భవనాన్ని కూల్చేందుకు యత్నించగా పోలీసులు బాష్పవాయుగోళాలు ప్రయోగించారు. లాఠీచార్జ్ చేసి నిరసనకారులను చెదరగొట్టారు.
ఉక్కు మహిళ నుంచి మరణశిక్ష దాకా..
1947 సెప్టెంబర్ 28వ తేదీన నాటి తూర్పు పాకిస్తాన్‌లో హసీనా జన్మించారు. ఈమె తండ్రి షేక్ ముజిబుర్ రెహ్మాన్ 1971లో బంగ్లాదేశ్ విమోచన కోసం పోరాడి తర్వాత బంగ్లాదేశ్‌కు స్వాతంత్య్రం సిద్దించేలా కృషిచేవారు. తర్వాత బంగ్లాప్రజలు ఆయనను జాతిపితగా కీర్తించారు. ఢాకా యూనివర్సిటీలో ఈమె చదువుకున్నారు. 1968లో అణుశాస్త్రవేత్త ఎంఏ వాజెద్ మియాను పెళ్లాడారు. 1975లో సైనిక తిరగుబాటు వేళ తండ్రి, తల్లి, ముగ్గురు సోదరులు, ఇతర కుటుంబసభ్యులు హత్యకు గురయ్యారు.
ఈ హత్యోదంతం తర్వాత ఈమె దేశ రాజకీయాల్లో అడుగుపెట్టారు. అప్పటికే దివంగత దేశాధ్యక్షుడు జివుర్ రెహ్మాన్ భార్య ఖలీదా జియా రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నారు. వీరిద్దరినీ బంగ్లాదేశ్ రాజకీయాల్లో పోరాడే బేగమ్‌లు అని పిలిచేవారు. 1996లో హసీనా తొలిసారిగా ప్రధానమంత్రి అయ్యారు. 2001లో ఓడినా 2008లో మళ్లీ పీఠం అధిరోహించారు. స్వాతంత్య్ర సమరయోధుల వారసులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటా అంశం గతేడాది చిలికిచిలికి గాలివానగా, విద్యార్థి మహోద్యమంగా మారడంతో హసీనా ప్రభుత్వం కూలిపోయింది. అప్పటి నుంచి ఆమె ఢిల్లీలోనే రహస్య జీవితం గడుపుతున్నారు.
చట్టానికి ఎవరూ అతీతులు కారు
తీర్పును స్వాగతిస్తూ యూనుస్ వ్యాఖ్య
ఢాకా: హసీనాకు పడిన మరణశిక్షను ముహమ్మద్ యూనుస్ సారథ్యంలోని తాత్కాలిక ప్రభుత్వం గట్టిగా సమర్థించింది. తీర్పును స్వాగతిస్తున్నట్లు యూనుస్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘ ఈరోజు బంగ్లాదేశ్ వ్యాప్తంగా, దేశానికి ఆవల సైతం ప్రతిధ్వనించేలా దేశ న్యాయస్థానాలు అత్యంత స్పష్టమైన సందేశానిచ్చాయి. అధికారంలో ఉన్నా, లేకున్నా చట్టానికి ఎవరూ అతీతులు కారు అనే ప్రాథమిక సూత్రం ఇక్కడ వర్తిస్తుందని న్యాయస్థానం మరోసారి గుర్తుచేసింది. గత జూలై, ఆగస్ట్‌లో ఉద్యమం వేళ ప్రాణాలు కోల్పోయిన, వేధింపులకు గురైన, ఇప్పటికీ మనోవ్యథను భరిస్తున్న విద్యార్థుల కుటుంబాలకు న్యాయం జరిగేలా కోర్టు తీర్పు వెలువడింది. ఏళ్ల తరబడి కొనసాగిన అణిచివేతతో పెళుసుబారిన ప్రజాస్వామ్య పునాదుల పునరుద్ధరణకు మేం కృషిచేస్తాం’’ అని యూనుస్ వ్యాఖ్యానించారు.
హసీనాపై మోపిన కీలక ఆరోపణలు
1. హత్య, హత్యాయత్నం, నిరసనకారులను చిత్రహింసలకు గురి చేయడం. విద్యార్థులపై దాడులను ప్రోత్సహించడం, దాడులను ఏమాత్రం అడ్డుకోకపోవడం
2. హలికాప్టర్లు, డ్రోన్ల సాయంతో నిరాయుధ విద్యార్థులపైకి మారణాయుధాలతో సైన్యం దాడిచేసేలా ఆదేశాలు ఇవ్వడం
3. రంగ్‌పూర్‌లో బేగమ్ వర్సిటీ విద్యార్థి అబూ సయీద్‌ను అత్యంత దారుణంగా చంపేయడం
4. ఆగస్ట్ 5న ఛంకార్‌పూర్‌లో ఆరుగురిని హత్యచేయడం, విద్యార్థులపై దాడి చేయాలని ప్రసంగాలు ఇవ్వడం
5. ఆగస్ట్ 5న అషూలియాలో ఆరుగురు విద్యార్థులపై బుల్లెట్ల వర్షం కురిపించడం, తర్వాత ఆధారాల్లేకుండా తగలబెట్టడం రాజకీయ ప్రేరేపిత తీర్పు ఇది
తీర్పుపై ఘాటుగా స్పందించిన హసీనా
తీర్పుపై 78 ఏళ్ల హసీనా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపిత తీర్పు. ప్రజాతీర్పు పొందని ఎన్నికల్లో గెలవని ఒక అనామిక ప్రభుత్వం ఒత్తిడితో వెల్లడైన తీర్పు ఇది. ప్రస్తుత ప్రభుత్వంలో తీవ్రస్థాయి భావజాలం ఏ స్థాయిలో తీర్పు కళ్లకుకడుతోంది. తీర్పు పూర్తిగా పక్షపాతధోరణితో, రాజకీయ కక్షతో వెలువర్చారు. ప్రజాస్వామ్యయుతంగా ప్రధానిగా ఎన్నికైన నన్ను, అవామీ లీగ్ రాజకీయశక్తిని నిర్వర్యీంచేసే కుట్ర ఇది. పారదర్శకంగా కేసు నడవని, సాక్ష్యాధారాలను పరిశీలించని ఇలాంటి ట్రిబ్యునళ్లు ఇచ్చిన తీర్పులకు నేను అస్సలు భయపడను. మొహమ్మద్ యూనుస్ తాత్కాలిక ప్రభుత్వం తమ చేతగానితనాన్ని ఈ తీర్పును సాకుగా చూపి అస్తవ్యస్తపాలనను అద్భుతంగా ఉందని చెప్పుకునే దుస్సాహసంచేస్తోంది’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.


