సౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా ఊహించని ఫలితాన్ని పొందింది. ప్రొటిస్ బ్యాటర్ల కోసం బిగించిన స్పిన్ ఉచ్చులో.. మనవాళ్లే చిక్కుకుపోయి విలవిల్లాడారు. సఫారీ స్పిన్నర్లు సైమన్ హార్మర్, కేశవ్ మహరాజ్ (Keshav Maharaj) ధాటికి తాళలేక చేతులెత్తేశారు.
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో సౌతాఫ్రికా విధించిన 124 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక.. 93 పరుగులకే కుప్పకూలి ఓటమిని ఆహ్వానించారు. బ్యాటర్ల వైఫల్యం కారణంగా రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ వెనుకబడింది. ఈ నేపథ్యంలో పిచ్ విషయంలో టీమిండియా యాజమాన్యం వ్యవహారశైలిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.
ఈ క్రమంలో గువాహటిలో సౌతాఫ్రికాతో జరిగే రెండు టెస్టు టీమిండియాకు మరింత ప్రతిష్టాతక్మకంగా మారింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే భారత్ 1-1తో సిరీస్‌ను సమం చేయగలుగుతుంది. ఇలాంటి తరుణంలో బర్సపరా క్రికెట్ మైదానంలో ఎర్రమట్టి పిచ్‌ను తయారు చేయాలని బీసీసీఐ సంకల్పించింది.
ఈ నేపథ్యంలో పేస్‌తో పాటు ఎక్కువగా బౌన్స్ అవుతూ.. పాతబడే కొద్ది స్పిన్నర్లకు అనుకూలించే పిచ్‌ను క్యూరేటర్ రూపొందించినట్లు సమాచారం. ఇలాంటి వికెట్‌పై పరుగులు రాబట్టే క్రమంలో టీమిండియా బ్యాటర్లు.. ఈడెన్ గార్డెన్స్‌లోనే ప్రాక్టీస్ చేశారు. ముఖ్యంగా మంగళవారం ఓ ప్రత్యేక బౌలర్‌ను భారత బ్యాటర్లు ఎదుర్కొన్నారు.

అతడు మరెవరో కాదు.. బెంగాల్ మిస్టరీ స్పిన్నర్ కౌశిక్ మెయిటీ. రెండు చేతులతోనూ బౌలింగ్ చేయగల సవ్యసాచి. కుడి చేతితో ఆఫ్ స్పిన్.. ఎడమ చేతితో లెఫ్టార్మ్ స్పిన్ బౌలింగ్ చేయగల కౌశిక్‌ను పిలిపించాలన్నది హెడ్‌కోచ్ గౌతం గంభీర్ ఆలోచన అని సమాచారం. గతంలో పలు ఐపీఎల్ జట్లకు నెట్ బౌలర్‌గా కౌశిక్ మెయిటీ పనిచేశాడు.
అయితే, టీమిండియాకు నెట్స్‌లో కౌశిక్ బౌలింగ్ చేయడం ఇదే తొలిసారి. 26 ఏళ్ల ఈ స్పిన్ బౌలర్.. నెట్స్‌లో లెఫ్టాండర్లు సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, దేవ్‌దత్ పడిక్కల్‌కు ఆఫ్ స్పిన్ వేశాడు. అదే విధంగా.. కుడిచేతి వాటం గల బ్యాటర్లు ధ్రువ్ జురెల్ వంటి వాళ్లను లెఫ్టార్మ్ స్పిన్‌తో తిప్పలు పెట్టాడు. ఈ క్రమంలో హార్మర్, మహరాజ్‌లను ఎదుర్కొనేందుకు టీమిండియా బ్యాటర్లకు కావాల్సినంత ప్రాక్టీస్ దొరికింది.
రెండు చేతులతోనూ బౌలింగ్ చేయగల విలక్షణ నైపుణ్యం కలిగిన కౌశిక్ మెయిటీ కారణంగా టీమిండియాకు అన్ని రకాలుగా సిద్ధమయ్యే అవకాశం దొరికింది. కాగా కోల్‌కతాకు చెందిన కౌశిక్ మెయిటీ దేశీ క్రికెట్‌లో ఎనిమిది లిస్ట్-ఎ మ్యాచ్‌లతో పాట మూడు టీ20 మ్యాచ్‌లు ఆడి.. మొత్తంగా పదకొండు వికెట్లు కూల్చాడు.
ఈ నేపథ్యంలో టీమిండియాకు నెట్స్‌లో బౌలింగ్ చేసే అవకాశం రావడంపై కౌశిక్ మెయిటీ స్పందిస్తూ.. ‘‘మొదటిసారి భారత బ్యాటర్లకు నెట్స్ బౌలింగ్ చేశాను. కల నిజమైన అనుభూతి కలిగింది. నేను జడ్డూ భాయ్‌కు బౌలింగ్ చేశానంటే ఇంకా నమ్మలేకపోతున్నా’’ అంటూ ఉద్వేగానికి లోనయ్యాడు.
తాను బౌలింగ్ చేస్తున్నపుడు గౌతం గంభీర్ కానీ.. బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ గానీ ఎలాంటి సూచనలు ఇవ్వలేదని.. తనను స్వేచ్ఛగా బౌలింగ్ చేయనిచ్చారని మెయిటీ తెలిపాడు. తన సహజ నైపుణ్యాలపై నమ్మకం ఉంచినందుకు వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపాడు. జడేజా తనకు కొన్ని సూచనలు ఇచ్చాడని.. ఈ ట్రెయినింగ్ సెషన్ తనకు సరికొత్త అనుభవం, అనుభూతిని ఇచ్చిందని తెలిపాడు.


