భారత్, బంగ్లాదేశ్ (India vs Bangladesh) మహిళా క్రికెట్ జట్ల మధ్య వచ్చే నెలలో (డిసెంబర్) జరగాల్సిన పరిమిత ఓవర్ల సిరీస్ (మూడు వన్డేలు, మూడు టీ20లు) రద్దైనట్లు తెలుస్తుంది. ఇరు దేశాల మధ్య పెరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఈ సిరీస్‌కు అనుమతి లభించలేదని బీసీసీఐ వర్గాల సమాచారం.
ఐసీసీ ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్‌లో (FTP) భాగమైన ఈ సిరీస్‌కు సంబంధించి ఖచ్చితమైన తేదీలు, వేదికలు ఖరారు కావాల్సి ఉండింది. ఈ లోపే రద్దు నిర్ణయం వెలువడిందంటూ ఓ ప్రముఖ వార్తా సంస్థ వెల్లడించింది.
ఈ సిరీస్ జరగాల్సిన సమయంలో (డిసెంబర్ మూడో వారం) బీసీసీఐ ప్రత్యామ్నాయ హోమ్ సిరీస్‌కు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. జనవరి మొదటి వారంలో ప్రారంభమయ్యే మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) దృష్ట్యా ఈ సిరీస్ చిన్నదిగా ఉండే అవకాశం ఉందని సమాచారం. డబ్ల్యూపీఎల్ తర్వాత టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాల్సి ఉంది.
కాగా, కొద్ది రోజుల కిందట పురుషుల క్రికెట్‌లో భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరగాల్సిన సిరీస్ వాయిదా పడింది. ఆగస్టులో భారత పురుషుల జట్టు పరిమిత ఓవర్ల సిరీస్ కోసం బంగ్లాదేశ్‌లో పర్యటించాల్సి ఉండింది. అయితే బిజీ షెడ్యూల్ కారణంగా ఆ సిరీస్‌ను వచ్చే ఏడాది సెప్టెంబర్‌కు మార్చారు.
ఇదిలా ఉంటే, తాజాగా ముగిసిన మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్ ఛాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే. ఆ టోర్నీలో చివరి జట్టుగా సెమీస్‌కు అర్హత సాధించిన టీమిండియా.. సెమీస్‌లో ఆసీస్‌ను, ఫైనల్స్‌లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసి విశ్వవిజేతగా అవతరించింది. భారత మహిళల జట్టుకు ఇదే తొలి ప్రపంచకప్.
చదవండి: బాబర్ ఆజమ్‌కు భారీ షాక్


