చరిత్ర సృష్టించిన ముష్ఫికర్‌ రహీమ్‌ | Mushfiqur Rahim Creates History Becomes 1st Bangladesh Cricketer To | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన ముష్ఫికర్‌ రహీమ్‌

Nov 19 2025 11:26 AM | Updated on Nov 19 2025 11:55 AM

Mushfiqur Rahim Creates History Becomes 1st Bangladesh Cricketer To

సుదీర్ఘ కెరీర్‌లో బంగ్లాదేశ్‌ క్రికెట్‌కు మూలస్థంభంలా నిలిచిన ముష్ఫికర్‌ రహీమ్‌ (Mushfiqur Rahim) అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ఢాకా వేదికగా బుధవారం ఐర్లాండ్‌ (BAN vs IRE Test)తో మొదలైన టెస్టు మ్యాచ్‌ అతడి కెరీర్‌లో 100వది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి బంగ్లాదేశ్‌ ఆటగాడిగా ముష్ఫికర్‌ రహీమ్‌ గుర్తింపు పొందాడు.

కాగా 18 ఏళ్ల 17 రోజుల వయసులో మొదటి టెస్టు ఆడిన ముష్ఫికర్‌ రహీమ్‌..‌ ప్రఖ్యాత లార్డ్స్‌ మైదానం (Lord's Stadium)లో అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. తర్వాతి రోజుల్లో బంగ్లా తరఫున అత్యంత కీలక ఆటగాడిగా అతడు ఎదిగాడు. 

మిడిలార్డర్‌ బ్యాటర్‌గా
టెస్టుల్లో పెద్ద స్థాయికి చేరలేకపోయిన తన టీమ్‌ వరుస పరాజయాల్లో భాగమైన రహీమ్‌...జట్టు సాధించిన చిరస్మరణీయ విజయాల్లో ప్రధాన పాత్ర పోషించాడు.

సచిన్‌ టెండూల్కర్, ఇమ్రాన్‌ ఖాన్‌ తర్వాత
వికెట్‌ కీపర్‌గా జట్టులోకి వచ్చినా... క్రమేణా తన బ్యాటింగ్‌కు మెరుగులు దిద్దుకొని కీపింగ్‌ వదిలేసి రెగ్యులర్‌ మిడిలార్డర్‌ బ్యాటర్‌గా ముష్ఫికర్‌ రహీమ్‌ సత్తా చాటాడు. సచిన్‌ టెండూల్కర్, ఇమ్రాన్‌ ఖాన్‌ తర్వాత టెస్టుల్లో సుదీర్ఘ కెరీర్‌ ఉన్న (20 ఏళ్ల 5 నెలల 25 రోజులు) ఆటగాడిగా అతను తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించడం విశేషం. 

ఇప్పటి వరకు బంగ్లాదేశ్‌ తరఫున 99 టెస్టుల్లో ముష్ఫికర్‌ రహీమ్‌ 38.02 సగటుతో 6351 పరుగులు సాధించాడు. ఇందులో 12 సెంచరీలు, 27 అర్ధ సెంచరీలు ఉన్నాయి. బంగ్లాదేశ్‌కు 34 టెస్టుల్లో కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించిన అతడు ...55 టెస్టుల్లో వికెట్‌ కీపర్‌గా వ్యవహరించాడు.   

బంగ్లాదేశ్‌ పర్యటనలో ఐర్లాండ్‌
రెండు టెస్టులు, మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లు ఆడేందుకు ఐర్లాండ్‌ క్రికెట్‌ జట్టు బంగ్లాదేశ్‌ పర్యటనకు వచ్చింది. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య సెల్హైట్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్‌.. ఐరిష్‌ జట్టును ఇన్నింగ్స్‌ మీద 47 పరుగుల తేడాతో ఓడించింది.

ఇక బంగ్లా- ఐర్లాండ్‌ మధ్య బుధవారం ఢాకా వేదికగా రెండో టెస్టు మొదలు కాగా.. టాస్‌ గెలిచిన ఆతిథ్య జట్టు తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. భోజన విరామ సమయానికి బంగ్లాదేశ్‌ 31 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది.

ఓపెనర్లలో మహ్ముదుల్‌ హసన్‌ జాయ్‌ 34, షాద్‌మాన్‌ ఇస్లాం 35 పరుగులు చేశారు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్‌ నజ్ముల్‌ హుసేన్‌ షాంటో (8) విఫలమయ్యాడు.

వన్‌డౌన్‌ బ్యాటర్‌ మొమినుల్‌ హక్‌ (17*)కు తోడుగా ముష్ఫికర్‌ రహీమ్‌ (3*) క్రీజులో ఉన్నాడు. ఐర్లాండ్‌ బౌలర్లలో స్పిన్నర్‌ ఆండీ మెక్‌బ్రిన్‌ మూడు వికెట్లు కూల్చాడు. 

చదవండి: IPL 2026: రసెల్‌, మాక్సీ ఒకే జట్టులో.. వీళ్లతో మామూలుగా ఉండదు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement