బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. స్థానికుల దాడిలో తాజాగా సమీర్ దాస్ అనే మరో హిందువు మృతిచెందారు. మీడియా కథనాల ప్రకారం.. చిట్టాగాంగ్‌లోని దాగన్‌భూయాన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితుడిని ఆస్పత్రికి తరలించేలోపే మృతిచెందినట్లు తెలుస్తోంది.
సమీర్ దాస్(28) స్థానికంగా ఆటోడ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆదివారం రాత్రి అతన్నిఅడ్డగించిన గుంపు ఒక్కసారిగా విరుచుకుపడింది. అతనిపై దాడి చేసి కత్తులతో పొడిచి చంపారు. ఆపై సమీర్ ఆటోలోనే అక్కడి నుంచి పారిపోయారు. ఘటన జరిగిన తీరుతో ఇది ప్రీప్లాన్డ్‌గా తెలుస్తోందని స్థానిక అధికారి ఒకరు తెలిపారు. మత కోణం ఉందా? లేదా? అనేది ఇప్పుడే చెప్పలేమని అన్నారాయన. నిందితులను గాలించేందుకు స్పెషల్ ఆపరేషన్ చేపట్టినట్లు తెలిపారు. అయితే..
అతని కుటుంబ సభ్యులు మాత్రం స్థానికులు కొందరు మతం పేరుతో తమను దూషిస్తున్నారని.. గత కొంతకాలంగా తన కొడుకును కొందరు వెంబడిస్తున్నారని అంటున్నారు. 2024లో తలెత్తిన రాజకీయ సంక్షోభం తర్వాతి నుంచి బంగ్లాదేశ్‌లో మైనారిటీ వర్గాలపై దాడులు పెరిగిపోయాయి. తాజాగా సమీర్ దాస్‌పై జరిగిన దాడితో కలిపి.. గత 42 రోజుల్లో 13 ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇందులో ఐదు హత్యలు కొత్త ఏడాది 13 రోజుల్లోనే జరిగాయి.
మైనారిటీల దాడుల ఘటనలను.. బంగ్లాదేశ్ హిందూ బుద్ధిస్ట్ క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్ ఖండిస్తోంది. పిబ్రవరిలో ఆ దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ సమయంలో మత ఘర్షణలు చోటుచేసుకోవడంపై కౌన్సిల్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. మరోవైపు..
మైనారిటీలు.. అందునా హిందువులపై దాడులను భారత్ తీవ్రంగా ఖండిస్తోంది. ‘‘బంగ్లాదేశ్‌లో మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని దాడులు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ దాడులు వ్యక్తుల మీద, అలాగే వాళ్ల నివాసాలు, వ్యాపారాలపై కూడా జరుగుతున్నాయి. తక్షణమే వీటిని నిలువరించి.. మైనారిటీలకు భద్రత కల్పించాల్సిన అవసరం అక్కడి ప్రభుత్వంపై ఉంది’’ అని భారత విదేశాంగ శాఖ గత శుక్రవారం ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. అయితే భారత్ ఈ దాడులను భూతద్దంలో పెట్టి చూస్తోందంటూ యూనస్ ప్రభుత్వం అంటోంది.


