'మరో' చరిత్రకు అడుగు దూరంలో బంగ్లాదేశ్‌ దిగ్గజం | mushfiqur rahim stands 99 not out in 100th test first innings at day 1 stumps | Sakshi
Sakshi News home page

'మరో' చరిత్రకు అడుగు దూరంలో బంగ్లాదేశ్‌ దిగ్గజం

Nov 19 2025 5:04 PM | Updated on Nov 19 2025 5:34 PM

mushfiqur rahim stands 99 not out in 100th test first innings at day 1 stumps

బంగ్లాదేశ్‌ దిగ్గజ బ్యాటర్‌ ముష్ఫికర్‌ రహీమ్‌ (Mushfiqur Rahim) టెస్ట్‌ క్రికెట్‌లో మరో చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్నాడు. ప్రస్తుతం వందో టెస్ట్‌ (ఐర్లాండ్‌తో రెండో టెస్ట్‌) ఆడుతున్న ఈ మాజీ కెప్టెన్‌.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి సెంచరీకి పరుగు దూరంలో (99 నాటౌట్‌) ఉన్నాడు.

ముష్ఫికర్‌ రెండో రోజు ఈ ఒక్క పరుగు పూర్తి చేస్తే.. టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో వందో మ్యాచ్‌లో వంద చేసిన 11వ ఆటగాడిగా రికార్డుల్లోకెక్కుతాడు. ఇప్పటివరకు టెస్ట్‌ క్రికెట్‌లో 83 మంది 100 టెస్ట్‌లు పూర్తి చేసుకోగా.. బంగ్లాదేశ్‌ తరఫున ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడు ముష్ఫికర్‌ మాత్రమే.  

వందో టెస్ట్‌లో సెంచరీ చేసిన ఆటగాళ్లు..
కొలిన్‌ కౌడ్రే
జావిద్‌ మియాందాద్‌
గార్డన్‌ గ్రీనిడ్జ్‌
అలెక్‌ స్టీవర్ట్‌
ఇంజమామ్‌ ఉల్‌ హక్‌
రికీ పాంటింగ్‌- రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు
గ్రేమీ స్మిత్‌
హషీమ్‌ అమ్లా
జో రూట్‌- వందో టెస్ట్‌లో డబుల్‌ సెంచరీ చేసిన తొలి ఆటగాడు
డేవిడ్‌ వార్నర్‌- వందో టెస్ట్‌లో డబుల్‌ సెంచరీ చేసిన రెండో ఆటగాడు

మ్యాచ్‌ విషయానికొస్తే.. రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం ఐర్లాండ్‌ జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లలో ఇప్పటికే తొలి టెస్ట్‌ (బంగ్లాదేశ్‌ విజయం సాధించింది) పూర్తి కాగా.. ఇవాళ (నవంబర్‌ 19) రెండో టెస్ట్‌ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌ బంగ్లాదేశ్‌ ఆటగాడు ముష్ఫికర్‌ రహీంకు వందో టెస్ట్‌.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 292 పరుగులు చేసింది. మహ్మదుల్‌ హసన్‌ 34, షద్మాన్‌ ఇస్లాం 35, మొమినుల్‌ హక్‌ 63, కెప్టెన్‌ నజ్ముల్‌ హసన్‌ షాంటో 8 పరుగులు చేసి ఔట్‌ కాగా.. ముష్ఫికర్‌ రహీం​ 99, లిటన్‌ దాస్‌ 47 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఐర్లాండ్‌ బౌలర్లలో ఆండీ మెక్‌బ్రైన్‌కే 4 వికెట్లు దక్కాయి.

చదవండి: చరిత్ర సృష్టించిన ముష్ఫికర్‌ రహీమ్‌

 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement