ఎన్టీఆర్ జిల్లా: మద్యానికి బానిసైన ఓ తండ్రి కన్న కూతురినే బేరానికి పెట్టిన ఘటన గణపవరంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మైలవరం మండలం గణపవరం గ్రామానికి చెందిన ఏరువ జమలారెడ్డి భార్యతో విడాకులు తీసుకుని మద్యానికి బానిసయ్యాడు. తనకున్న పొలాన్ని కూడా అమ్ముకుని వచ్చిన సొమ్ముతో తాగి జల్సాలు చేస్తున్నాడు. తన స్నేహితుడైన బెల్లంకొండ నాగరాజును బావమర్ది అని సంబోధిస్తూ.. ఇద్దరూ కలిసి తాగుతూ, తిరుగుతూ ఉండేవారు.
ఈ క్రమంలో నాగరాజు తన 15ఏళ్ల కుమార్తెతో వివాహం జరిపిస్తానని చెప్పి పలు దఫాలుగా జమలారెడ్డి వద్ద నుంచి రూ.20లక్షలు వరకు దండుకుని కారు తదితరాలు కొనుక్కున్నాడు. ఆ విధంగానే ఎవరికీ తెలియకుండా జమలారెడ్డికి ఇచ్చి పెళ్లి కూడా చేశాడు. అయితే ఆ మైనర్ బాలిక కాపురానికి వెళ్లలేదు. ఈ క్రమంలో ఈ నెల 12వ తేదీ రాత్రి నాగరాజు మరోసారి తనకు డబ్బు కావాలని జమలారెడ్డిని అడగడంతో కుమార్తెను కాపురానికి తీసుకొస్తే ఇస్తానని చెప్పాడు.
దీంతో నాగరాజు తన కుమార్తెను జమలారెడ్డి ఇంటి వద్ద వదలిపెట్టి వెళ్లిపోయాడు. జమలారెడ్డి మైనర్‌తో అసభ్యకరంగా ప్రవర్తించడంతో బాధితురాలు చుట్టుపక్కల వారి సహాయంతో పోలీసులను ఆశ్రయించింది. దీంతో బాలిక తండ్రి నాగరాజు, జమలారెడ్డిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు, పోక్సో కేసు నమోదు చేశారు. ఇరువురిని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ సుధాకర్ తెలిపారు.


