భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమైంది. చిరకాల స్నేహితుడు, సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ (Palash Muchhal)తో ఏడడుగులు వేయనుంది. చాన్నాళ్ల క్రితమే తమ బంధాన్ని బయటి ప్రపంచానికి తెలిపిన స్మృతి- పలాష్ జంట.. తమ ప్రేమను వైవాహిక బంధంతో నవంబరు 23న పదిలం చేసుకోనున్నారు.
జగజ్జేతగా భారత్
ఈ నేపథ్యంలో ఇప్పటికే ముందస్తు పెళ్లి వేడుకలు మొదలుకాగా.. పలాష్ తన రొమాంటిక్ ప్రపోజల్‌తో స్మృతిని సర్‌ప్రైజ్ చేశాడు. కాగా భారత మహిళా క్రికెట్ జట్టు ఇటీవలే ఐసీసీ వన్డే వరల్డ్‌కప్-2025 టైటిల్‌ను గెలుచుకున్న విషయం తెలిసిందే. భారత్ ప్రపంచకప్ గెలవాలన్న మిథాలీ రాజ్, ఝులన్ గోస్వామి వంటి దిగ్గజ ఆటగాళ్ల కలను హర్మన్ సేన సొంతగడ్డపై నెరవేర్చింది.
ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి.. మహిళల వన్డే క్రికెట్‌లో తొలిసారి భారత్ జగజ్జేతగా నిలిచింది. నాలుగున్నర దశాబ్దాల కలను నెరవేరుస్తూ ట్రోఫీని ముద్దాడింది. ఈ విజయంలో ఓపెనర్‌గా, వైస్ కెప్టెన్‌గా స్మృతి మంధాన తన వంతు పాత్ర పోషించింది. ఇంతటి ప్రత్యేకమైన ఈ మైదానంలోనే స్మృతికి పలాష్ అదిరిపోయే బహుమతి ఇచ్చాడు.
నన్ను పెళ్లి చేసుకుంటావా?
కళ్లకు గంతలు కట్టి మరీ స్మృతిని డీవై పాటిల్ స్టేడియానికి తీసుకువెళ్లిన పలాష్.. మోకాళ్లపై కూర్చుని.. ‘‘నన్ను పెళ్లి చేసుకుంటావా?’’ అంటూ ప్రతిపాదన తెచ్చాడు. ఇందుకు ఆమె నవ్వుతూ అంగీకరించింది. పలాష్ తన వేలికి ఉంగరం తొడగడంతో సిగ్గులమొగ్గయిన స్మృతి.. ఆ తర్వాత తాను కూడా పలాష్ వేలికి ఉంగరం తొడిగింది.
ఇందుకు సంబంధించిన వీడియోను పలాష్ ముచ్చల్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ‘‘ఆమె సరేనంది’’ అంటూ తమ జీవితంలోని మధుర క్షణాలను అభిమానులతో పంచుకున్నాడు. కాగా తమ్ముడు పలాష్‌తో పాటు బాలీవుడ్ సింగర్ పాలక్ ముచ్చల్ కూడా స్టేడియానికి వచ్చి మరదల్ని సర్‌ప్రైజ్ చేసింది. ఆ తర్వాత అంతా కలిసి నవ్వులు చిందిస్తూ స్టెప్పులు వేశారు.
కాగా మహారాష్ట్రకు చెందిన 29 ఏళ్ల స్మృతి మంధాన క్రికెటర్‌గా సత్తా చాటుతుండగా.. ఇండోర్‌కు చెందిన 30 ఏళ్ల పలాష్ ముచ్చల్ బాలీవుడ్‌లో సంగీత దర్శకుడిగా అదృష్టం పరీక్షించుకుంటున్నాడు. ఇరుకుటుంబాల సమ్మతితో స్మృతి- పలాష్ ఆదివారం (నవంబరు 23) పెళ్లి బంధంలో అడుగుపెట్టనున్నారు.
చదవండి: ఐపీఎల్ ఆడటం మానెయ్: గిల్‌కు గంభీర్ సలహా ఇదే


