ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) పట్ల భారత స్టార్ క్రికెటర్, వన్డే వరల్డ్‌కప్ విజేత దీప్తి శర్మ (Deepti Sharma) అభిమానం చాటుకుంది. ఆయనను నేరుగా కలవాలని ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్నానని.. ఇప్పటికి తన కల నెరవేరిందని హర్షం వ్యక్తం చేసింది.
కాగా ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్-2025 (ICC Women's ODI World Cup)లో విజేతగా నిలిచిన భారత జట్టు బుధవారం ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిసింది.
సరదాగా ముచ్చటించిన మోదీ
ఈ సందర్భంగా.. విజయవంతమైన ఈ ప్రపంచకప్ ప్రయాణంలో ఎదురైన సవాళ్లను అధిగమించి తొలిసారి విశ్వవిజేతగా నిలిచిన హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలో జట్టును మోదీ అభినందించారు. ప్రధాని కేవలం ఓ ఫొటో, రెండు ముక్కల ప్రశంసకే పరిమితం కాకుండా ప్లేయర్లందరితో కలిసి కూర్చుని సరదాగా ముచ్చటించారు.
ఈ క్రమంలో 2017లో ఫైనల్లో ఓడినపుడు ఉత్త చేతులతో మోదీని కలిసిన తాము ఇప్పుడు ప్రపంచకప్ ట్రోఫీతో కలవడం చాలా సంతోషాన్నిచ్చిందని కెప్టెన్ హర్మన్‌ప్రీత్ చెప్పుకొచ్చింది. మోదీ అప్పుడు చెప్పిన మాటలు ఈ సారి కప్ గెలిచేందుకు ఎంతగానో దోహదపడ్డాయని వైస్ కెప్టెన్ స్మృతి మంధాన చెప్పింది.
ఇక ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా నిలిచిన దీప్తి శర్మ మాట్లాడుతూ మరోసారి ప్రధానిని కలిసే అవకాశం కోసం ఎంతగానో ఎదురు చూశామని తాజా కప్‌తో కలుసుకోవడం మరింత తృప్తినిచ్చిందని పేర్కొంది.
ఈ సందర్భంగా దీప్తి ఇన్‌స్ట్రాగామ్ బయోలో ఉన్న ‘జై శ్రీరామ్’, ఆమె భుజంపై ఉన్న హనుమాన్ టాటూ విశేషాలను మోదీ అడిగితెలుసుకున్నారు. తన మానసిక, శారీరక బలానికి హనుమాన్ టాటూ ఉత్ప్రేరకమని దీప్తి చెప్పింది.
‘‘మిమ్మల్ని కలవాలని ఎన్నాళ్లుగానో వేచి చూస్తున్నా. ఈరోజు నేను సంతోషంగా ఉన్నాను. 2017లో మీరు మాతో ఓ మాట చెప్పారు. అవరోధాలను అధిగమించి సవాళ్లను సమర్థవంతంగా పూర్తి చేసినవాళ్లే అసలైన ఆటగాళ్లు అని మీరన్నారు.
లార్డ్ హనుమాన్ టాటూ మీకెలా ఉపయోగపడుతుంది?
కఠినంగా శ్రమిస్తే తప్పక ఫలితం వస్తుందని చెప్పారు. మీ మాటలు, సలహాలు మాలో స్పూర్తిని నింపాయి’’ అని దీప్తి శర్మ ప్రధాని మోదీతో పేర్కొంది. ఈ క్రమంలో ఆయన.. లార్డ్ హనుమాన్ టాటూ మీకెలా ఉపయోగపడుతుంది? అని దీప్తిని అడుగగా..
‘‘నా కంటే నేను ఆయన (హనుమాన్)నే ఎక్కువగా నమ్ముతాను. నా ఆట మెరుగుపడటానికి ఆయన మీదున్న నా నమ్మకం, సానుకూల దృక్పథమే కారణం’’ అని దీప్తి శర్మ బదులిచ్చింది.
కాగా వరల్డ్‌కప్-2025లో భాగంగా సౌతాఫ్రికాతో ఫైనల్లో దీప్తి శర్మ 58 పరుగులు చేయడంతో పాటు.. ఐదు వికెట్లు తీసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించింది. టోర్నీ ఆసాంతం అద్భుత ప్రదర్శన కనబరిచి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచింది.
‘ఫిట్ ఇండియా’ కార్యక్రమంలో
ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికాతో ఫైనల్లో అమన్‌జోత్ క్యాచ్, క్రాంతి గౌడ్ బౌలింగ్ ప్రదర్శనను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ‘ఫిట్ ఇండియా’ కార్యక్రమంలో విశ్వవిజేతలు భాగం కావాలని మోదీ క్రికెటర్లను ఉద్దేశించి అన్నారు. శారీరక ఫిట్‌నెస్ ఆవశ్యకతను తెలియజేసే కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. వీలైనపుడు విద్యార్థులను స్ఫూర్తిదాయక ప్రసంగాలతో ఉత్సాహపరచాలని మోదీ సూచించారు.
చదవండి: ‘సాకులు చెబుతారు... కానీ ఏదో ఒకరోజు సెలక్ట్ చేయక తప్పదు’
Player of the Tournament, Deepti Sharma, recalled that in 2017, Prime Minister @narendramodi had advised her to learn from failure and keep working hard. She shared that she had been eagerly looking forward to this meeting. Deepti also explained the significance of the ‘Hanuman’… pic.twitter.com/aUXki9yZz6
— DD News (@DDNewslive) November 6, 2025


